
రఘునాథపాలెం/ఖమ్మంఅర్బన్/కామేపల్లి: నగరంలోని విలీన పంచాయతీల పరిధిలోని గ్రామాలు, రఘునాథపాలెం, కామేపల్లి మండలాల పరిధిలోని గ్రామాల్లో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి వందల ఎకరాల్లో వరి పంట, మిరపతోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీస్తుండటంతో వరిపంట నేల మట్టమైంది. మిర పతోటల్లో భారీగా వర్షపు నీరు చేరడంతో పాటు గాలులకు వందల ఎకరాల్లో పంట నేలవాలింది.
రైతులు వరిపంట కోసి పంట పొలాల్లోనే ఉంచడంతో వర్షపు నీటితో పూర్తిగా మునిగిపోయాయి. కొందరు రైతులు వరి కుప్పలపై చేతికి వచ్చిన పంటను కాపాడుకొనేందుకు పట్టాలు కప్పుకున్నారు. వరి కుప్పలు ఉన్న వరి మడులలోకి వర్షపు నీరు చేరుతుండటంతో రైతులు గట్లకు గండ్లు పెట్టారు. నీటిలో మునిగిన వరి పంట చేతికి రాదని, నోటికాడికి వచ్చిన పంట వర్షంతో తీవ్రంగా నష్టపోయిందని, దీంతో తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లిందని ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment