అశ్వారావుపేట రూరల్: అన్నదాతల్లో పెథాన్ తుపాన్ భయం వెంటాడుతోంది. బలంగా వీస్తున్న ఈదురు గాలులతో రైతుల్లో అలజడి మొదలైంది. గడిచిన మూడు రోజులుగా వాతావరణం చల్లబడి, ఆకాశం మేఘావృతమై ఉండటంతోపాటు ఆదివారం ఉదయం నుంచి వర్షం కురవడంతో రైతుల్లో అందోళన నెలకొంది. ఇప్పటికే వరి కోతలు దాదాపుగా పూర్తి కాగా, పొలాల్లో ధాన్యం రాశులు ఆరబెట్టుతున్నారు. అదేవిధంగా ఆరిపోయిన ధాన్యం రాశులను అధిక శాతం మంది రైతులు విక్రయించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించారు. కేంద్రాల్లో రైతులు విక్రయాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని రోజుల తరబడి కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దాంతో రైతులు ధాన్యం కేంద్రాల్లోనే ఉండిపోతుంది.
ఈ తరుణంలో ముంచుకొస్తున్న పెథాయ్ తుపాన్, కురుస్తున్న వర్షంతో ధాన్యం తడిచిపోకుండా ఉండేందుకు రైతులు పడుతున్న పాట్లు వర్ణాతీతంగా ఉన్నాయి. మండలంలోని నారాయణపురం, నెమలిపేట, అచ్యుతాపురం, ఊట్లపల్లితోపాటు మరికొన్ని చోట్ల ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు కుప్పకుప్పలుగా ఉండగా వర్షానికి తడిచిపోకుండా ఉండేందుకు కప్పడానికి టార్ఫాలిన్లు అంతంత మాత్రంగా ఉండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. దాంతో చాలా మంది రైతులు టార్ఫాలిన్ల కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వస్తోంది. అదే విధంగా మరికొంత మంది రైతులు అశ్వారావుపేట, వినాయకపురం గ్రామాల్లో అద్దెకు ఇస్తున్న పరదాలను తీసుకొచ్చి ధాన్యం బస్తాలు, పొలాల్లో ఆరబోసిన ధాన్యం రాశులపై కప్పుతున్నారు. ఒకొక్క పరదాను వ్యాపారులు రోజుకు రూ.30 వరకు అద్దె తీసుకుంటుండటంతో రైతులపై మరింత భారం పడుతోంది.
మరో వైపు నారాయణపురం, నెమలిపేట, ఊట్లపల్లి, అచ్యుతాపురంలో ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోగా, వీటిపై కప్పేందుకు టార్ఫిలిన్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో గ్రామ సమైఖ్య సిబ్బంది సైతం వాటిని వర్షం పాలు కాకుండా చూసేందుకు ఇక్కట్ల పడాల్సి వస్తోంది. కాగా కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యం రాశులను ఎప్పటికప్పడు రైతుల నుంచి కొనుగోలు చేసి, లారీల ద్వారా రైస్ మిల్లర్లు, గోదాంలకు తరలిస్తే ఈ సమస్య ఉండదని, కానీ అధికారులు చేస్తున్న తాత్సారం వల్ల ఇటు గ్రామ సమైఖ్య బాధ్యులు, అటు రైతులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది.
పట్టాల కోసం పరుగులు
చండ్రుగొండ:పెథాన్ తుపాన్ అన్నదాత గుండెల్లో దడ పుట్టిస్తోంది. ఆరుగాలం శ్రమించి పంట చేతికొచ్చిన దశలో పెథాన్ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షం పంటను తడిపేస్తుంది. మండలంలోని దామరచర్లలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సుమారు 20 వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉన్నాయి. కాంటాలు కాకపోవడంతో ధాన్యం రాసులుగా పడి ఉన్నాయి. వర్షం నుంచి పంటను కాపాడుకునేందుకు పట్టాల కోసం రైతులు పరుగులు తీశారు. కిరాయి పట్టాలు సరిపడక పోవడంతో కొత్త పట్టాలు కొనుగోలు చేశారు. పట్టాల కొనుగోళ్ళు రైతులకు ఆర్థికంగా అదనపు భారంగా పరిణమించింది. పట్టాలు ఏర్పాటు చేసినప్పటికీ ధాన్యం తడుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తడిచిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.
మండలంలో చిరు జల్లులు
అన్నపురెడ్డిపల్లి: పెధాయ్ తుపాన్ ప్రభావంతో మండలంలోని అన్నపురెడ్డిపల్లి, ఎర్రగుంట, పెంట్లం, అబ్బుగూడెం, మర్రిగూడెం, రాజాపురం, జానికీపురంలో ఆదివారం ఉదయం నుంచి చిరుజల్లులు పడాయి. మండల పరిధిలోని గుంపెన సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు తాము విక్రయించిన ధాన్యం తడవకుండా బస్తాలపై పరదాలు కప్పి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వర్షం కారణంగా చలిప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
వణికిస్తున్న తుఫాను
దమ్మపేట: పెథాన్ తుపాను ముంచుకొస్తుందని తెలుసుకుని రైతుల్లో వణుకుపుడుతోంది. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు, చల్లటి గాలుల నడుమ చిరుజ్లులు పడ్డాయి. దీంతో పొలం పనుల్లో రైతులు శ్రమిస్తుండగా పడిన జల్లులతో రైతుల్లో ఆందోళన నెలకొంది. కోసిన వరి పంటను సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడు తుపాను విరుచుకు పడితే కోలుకోలేమని, ఎవరు ఎంత సాయం చేసినా తమను కష్టాల నుంచి గట్టెక్కించలేరన్న ఆందోళన రైతుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment