చార్మినార్ వద్ద సోమవారం చలిమంట వేసుకున్న వృద్ధులు..
సాక్షి, సిటీబ్యూరో: పెథాయ్ తుపాను ప్రభావంతో గ్రేటర్ గజగజలాడుతోంది. సోమవారం రోజంతా చలితో సిటీజనులు వణికిపోయారు. పట్టపగలే ఆకాశంలో దట్టమైన మేఘాలు ఆవహించి కారుచీకట్లు కమ్ముకున్నాయి. కొన్నిచోట్ల తేలిక పాటి జల్లులు కురిశాయి. తేమతోకూడిన శీతలగాలులు అధికంగా వీయడంతో వృద్ధులు, చిన్నారులు, రోగులు విలవిల్లాడారు. మధ్యాహ్నం వేళలో సైతం శీతల గాలులు ఉక్కిరి బిక్కిరిచేశాయి. చలి తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వెటర్లు, జర్కిన్లు, మంకీ క్యాపులు ధరించారు. చలి కారణంగా రహదారులు, పర్యాటక ప్రదేశాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు బోసిపోయి కన్పించాయి. సోమవారం నగరంలో 18 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు, గరిష్టంగా 27 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ..శీతల పవనాలవీస్తుండటం వల్ల చలితీవ్రత ఎక్కువగా నమోదైంది. రాగల 24 గంటల్లో నగరంలో వాతావరణంలో పెద్దగా మార్పులుండవని...అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
రోగులూ తస్మాత్ జాగ్రత్త..!
ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వృద్ధులు, హృద్రోగ, ఆస్తమా బాధితులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్త వహించినా అనారోగ్యం ముప్పు తప్పదు. చలితీవ్రతకు చర్మం పొడిబారి, కాళ్లు, చేతులు, ముఖంపై పగుళ్లు ఏర్పడుతున్నాయి. పెదాలు చిట్లిపోతున్నాయి. ముఖ్యంగా టూ వీలర్‌పై ప్రయాణించే వారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇక మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే ఉన్ని దుస్తులు, జర్కిన్‌లు, మంకీ క్యాపులు, మఫ్లర్లను జనం కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలను అమాంతం పెంచేశారు.
పొంచిఉన్న ఫ్లూ ముప్పు..
‘చలితీవ్రత వల్ల వాతావరణంలో స్వైన్‌ఫ్లూ మరిం త బలపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే నగర వా తావరణంలో పదిహేను రకాల ఫ్లూ కారక వైరస్‌లు ఉన్న విషయం తెలిసిందే. తాజా పరిస్థితుల్లో ఇవి మరింత విజృంభించే ప్రమాదం ఉంది. వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ఎక్కువగా దీని బారినపడే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకరి నుంచి మరోకరికి గాలిద్వారా వ్యాపిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు సాధ్యమైనంత వరకు జన సమూహాంలోకి వెళ్లక పోవడమే ఉత్తమం’ అని జిల్లా స్వైన్‌ఫ్లూ విభాగం ఇన్‌చార్జి డాక్టర్ శ్రీహర్ష పేర్కొనారు. దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కన్పిస్తే..ఫ్లూగా భావించి చికిత్స కోసం వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
సూర్యోదయం తర్వాత వాకింగ్ వెళ్లడమే మంచిది...
‘చలికాలంలో శరీరంలో ‘కార్టిసో’ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తనాళాల సైజును తగ్గించి, బ్లడ్‌క్లాట్‌కు కారణం అవుతుంది. వేసవి, వర్షాకాలంతో పోలిస్తే చలికాలంలో గుండె నొప్పికి అవకాశం ఎక్కువ. హృద్రోగ బాధితులు చలిలో తిరగకపోవడం మంచిది. వీరు సూర్యోదయం తర్వాతే వాకింగ్ చేయాలి. ఛాతి లో ఏ చిన్న నొప్పి ఉన్నా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి’ అని నిమ్స్‌కు చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ ఆర్వీకుమార్ సూచించారు. అంతేకాదు ‘చలితీవ్రత వల్ల ఆస్తమా బాధితుల్లో సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీరు ముక్కుకు మాస్క్‌లు ధరించాలి. రాత్రిపూట ఏసీ ఆఫ్ చేసి, తక్కువ స్పీడ్‌లో తిరిగే ఫ్యాను కిందే గడపాలి. సాధ్యమైనంత వరకు సిమెంటు, సున్నం, బొగ్గు, ఇతర రసాయన పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు మంచు కురిసే సమయంలో ఆరుబయట తిరగడం, వ్యాయామం చేయడం వంటివి చేయకూడదు. తాత్కాలిక ఉపశమనం కోసం ఉదయం ‘నాడిశోధన’ ప్రాక్టీస్ చేయాలి. ఊపిరి తీసుకోవడం మరీ కష్టంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంది’ అని కేర్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఫీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment