నక్కపల్లి మండలం రాజయ్యపేటలో పర్యటిస్తున్న జేసీ సృజన
విశాఖపట్నం, నక్కపల్లి/పాయకరావుపేట: పెథాయ్ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ సృజన ఆదేశించారు. తుఫాన్ నేపథ్యంలో ఆమె నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లో ఆదివారం పర్యటించారు. నక్కపల్లి మండలం రాజయ్యపేట, ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం, రేవుపోలవరం తీర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. మత్య్సకారులు, తీరప్రాంత గ్రామాలవారితో మాట్లాడారు. భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిందన్నారు. మండల, గ్రామస్థాయి అధికారులను అప్రమత్తం చేసి తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో అందుబాటులో ఉంచామన్నారు. కేటాయించిన గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. మండల, డివిజన్, జిల్లా కేంద్రాల్లో కంట్రోలు రూములు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
అధికారులతో సమీక్ష..
పాయకరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో తీరప్రాంతం ఉన్న రాంబిల్లి, అచ్యుతాపురం,ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల అధికారులతో జేసీ సృజన అత్యవసర సమావేశం నిర్వహించారు. దీనికి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, పోలీస్, ఉపాధిహామీ, ట్రాన్స్‌కో, రవాణా, విద్యా, వైద్య ఆరోగ్యశాఖల అధికారులు హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ సృష్టించిన విధ్వంసం తెలిసిందే అన్నారు. అక్కడ చోటుచేసుకున్న పొరపాట్లు ఇక్కడ జరగకుండా పెథాయ్‌ను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సోమవారం ఉదయం పదిగంటలకు తీరం దాటవచ్చని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభావిత గ్రామాలకు ముందుగానే నిత్యావసర సరుకులు తరలించాలని పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రక్షిత భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలను పునరావాస కార్యక్రమాలకోసం స్వాధీనంలోకి తీసుకోవాలన్నారు. విద్యుత్‌సరఫరాకు అంతరాయం ఏర్పడితే జనరేటర్లను అందుబాటులో ఉంచాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు.
4 వేల విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. 400 స్తంభాలు పాయకరావుపేట నియోజకవర్గానికి కేటాయించామన్నారు. మిగిలిన స్తంభాలు తూర్పుగోదావరి జిల్లాకు పంపినట్టు చెప్పారు. గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాల ఓవర్ హెడ్ ట్యాంకులన్నింటినీ నీటితో నింపాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లోని ట్యాంకులను కూడా నింపి తాగునీటి కొరత లేకుండా చూడాలన్నారు. అవసరమైతే వాటర్ ప్యాకేట్ బస్తాలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. రేషన్ డీలర్లతో పాటు, మధ్యాహ్నభోజన పథక నిర్వాహకులను కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఒక్కో తుఫాన్ రక్షిత కేంద్రంలో 3 వేల మందికి భోజన వసతి ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నిత్యావసర సరకులు ఈ రాత్రికే తీరప్రాంత గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు. పొక్లెయిన్‌లు, జనరేటర్లతో సిద్ధంగా ఉండాలని విపత్తుల నివారణ శాఖను ఆదేశించారు. ఎక్కడైనా భారీ వృక్షాలు కూలిపోతే వెంటనే తొలగించడానికి అవసరమైన సంరంజామా సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వంనుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు తీరప్రాంత గ్రామాల్లో విధులకు నియమించిన వారంతా అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సమావేశంలో నర్సీపట్నం ఆర్డీవో విశ్వేశ్వరరావు, ఏఎస్పీ హఫీజ్, డ్వామాపీడీ కల్యాణ చక్రవర్తి, డీపీవో కృష్ణకుమారి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ, ఐదుమండలాల తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు,ఈవోపీఆర్‌డీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment