డాక్టర్ జి.సృజన, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి
కర్నూలు: సార్వత్రిక ఎన్నికలు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే అవకాశం ఉండటంతో ఏర్పాట్లపై జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. వీటితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ , కౌంటింగ్ కేంద్రాల్లో పని చేసేందుకు అవసరమైన ఉద్యోగుల వివరాల సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇందుకోసం ట్రేజరీస్ డీడీ, జిల్లా ఎంప్లాయ్‌మెంట్ అధికారుల ఆధ్వర్యంలో మ్యాన్ పవర్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఒకటి, రెండు రోజుల్లో నివేదికకు సిద్ధం
ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండడానికి సమాయత్తం అవుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను నియమించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల వివరాలు సేకరణ కోసం ఏర్పాటు చేసిన మ్యాన్‌పవర్ కమిటీ తన విధులను ప్రారంభించింది. అన్ని శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది.
విద్యాశాఖలో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర అధికారులు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, జూనియర్ , సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు, వివిధ శాఖల ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేసే ఏఈలు, డీఈలు, ఈఈలు, ఎస్‌ఈలు డిప్యూటీ కలెక్టర్లు, ఆర్‌డీఓలు, సబ్ కలెక్టర్లు, జేసీలు, కలెక్టర్ వరకు ఇలా అన్ని స్థాయిలా అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఒకటి, రెండు రోజుల్లో దాదాపు 33 శాఖల్లో పనిచేసే అధికారుల వివరాలను నివేదించేందుకు మ్యాన్ పవర్ కమిటీ సిద్ధమవుతోంది.
18 వేల మంది సిబ్బంది అవసరం..
ఎన్నికల విధుల్లో ప్రధానంగా పోలింగ్, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలతోపాటు ఇతర విధుల్లో పాల్గొనేందుకు జిల్లాకు 18 వేల మంది సిబ్బంది అవసరం అవుతారు. జిల్లాలో 2,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రైసెడింగ్ ఆఫీసర్, ఒక అడిషినల్ ప్రైసెడింగ్ ఆఫీసర్, నలుగురు అదర్ ప్రైసెడింగ్ ఆఫీసర్‌లు ఉంటారు.
ఈ లెక్కన దాదాపు 13,116 మంది సిబ్బంది అవసరం అవుతారు. అంతేగాక మరో 2 వేల మంది వరకు రిజర్వ్‌లో ఉండేందుకు అవసరం. వీరితోపాటు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ తోపాటు ఇతర విధులకోసం మరో 3 వేల వరకు సిబ్బంది అవసరం అవుతారు. పోలీసులు కాకుండానే జిల్లాలో మొత్తంగా దాదాపు 18 వేల మంది వరకు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఎన్నికల విధుల్లో సెక్టోరల్, నోడల్ ఆఫీసర్‌లు
ఇప్పటికే 20 మందిని నోడల్ అధికారులుగా నియమించగా.. వారు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లాలో 234 మంది సెక్టోరల్ ఆఫీసర్లను నియమించారు. వీరంతా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. పోలీసులకు సంబంధించి 234 మంది పోలీసు సెక్టోరల్ అధికారులను నియమించారు. వీరు పోలింగ్ కేంద్రాల భద్రత అంశాలపై పరిశీలన చేస్తున్నారు. వీరంతా కూడా ఒకటి, రెండురోజుల్లో కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంది.
ఎంపికై న ఉద్యోగులకు శిక్షణ ఇస్తాం
సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాం. సిబ్బంది ఎంపిక కోసం మ్యాన్ పవర్ కమిటీని నియమించాం. ఒకటి, రెండు రోజుల్లో నివేదికలు వస్తాయి. ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుని శిక్షణ ఇస్తాం. – డాక్టర్ జి.సృజన, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికార
Comments
Please login to add a commentAdd a comment