
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి
● 28న కర్నూలులో
ముస్లింల భారీ ర్యాలీ
● 30న రాత్రి ఇళ్లల్లో విద్యుత్ దీపాలు
ఆర్పివేసి నిరసన
● రౌండ్ టేబుల్ సమావేశంలో
ముస్లిం మత పెద్దలు
కర్నూలు (టౌన్): వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఉలమ్ అధ్యక్షుడు మౌలానా మజీద్ డిమాండ్ చేశారు. కర్నూలు రైల్వే స్టేషన్ ప్రాంగణంలోని ఒక హోటల్‌లో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముస్లిం మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు హాజరయ్యారు. కశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడికి నిరసన తెలుపుతూ మృతులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం మౌలానా మజీద్ మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర వ్యక్తులను నియమించడం, కలెక్టర్ పర్యవేక్షణ చేయడం వంటి విధానాలు వ్యతిరేకిస్తున్నామన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఈనెల 28న కర్నూలులో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే ఈనెల 30వ తేదీ రాత్రి 9 నుంచి 9.15 గంటల వరకు ప్రతి ఇంట్లో లైట్లను ఆర్పివేసి నిరసనను వ్యక్తం చేద్దామన్నారు.
● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి మాట్లాడుతూ... పార్లమెంట్, రాజ్య సభలో తమ పార్టీ ముస్లింలకు మద్దతుగా నిలిచిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు అహమ్మద్ అలీఖాన్ మాట్లాడుతూ.. ముస్లింలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కలసికట్టుగా పోరాడుదామన్నారు. మైనార్టీలైన క్రైస్తవులు మద్దతు ఇవ్వడం సంతోషం అన్నారు.
● పాస్టర్లు షాలేమ్ రాజు, బొరెల్లి శశికుమార్ మాట్లాడుతూ.. ముస్లింలు చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామన్నారు. సమావేశంలో ఆర్‌ఆర్‌డీ సజీవరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, రెవరెండ్ అమ్రోజ్, విజయ్‌కుమార్, జహీంగీర్ అహమ్మద్, హమీదు, జాకీర్ అహమ్మద్, అన్వర్ బాషా పాల్గొన్నారు.

వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలి