
పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ‘ఆర్‌యూలో నిత్యం సమస్యల ‘పరీక్ష’’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వర్సిటీ అధికారులు స్పందించారు. ఈనెల 25వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు గడువును విధించగా 24వ తేదీ వరకు ఫీజు చెల్లింపుకు ఎన్‌ఆర్‌లో విద్యార్థుల పేర్లు రాలేదు. దీంతో ఈనెల 28వ తేదీ వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించేందుకు గడువును పొడిగించారు. రూ. 100 ఫైన్‌తో 29వ తేదీ, రూ.200 ఫైన్‌తో 30వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 24వ తేదీ కర్నూలు, ఆదోనిలోని పరీక్ష కేంద్రాల్లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టు బడటంతో సంబంధిత పరీక్ష కేంద్రాల సీఎస్, అబ్జర్వర్, ఇన్విజిలేటర్‌లకు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లును వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బసవరావు ఆదేశించారు.