సాక్షి, అమరావతి: తుఫాన్ పెథాయ్ పడగ విప్పుకొని వస్తోంది. తిత్లీ తుఫాన్‌తో ఇంకా కోలుకొని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రపై విరుచుకుపడబోతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ఇప్పుడు పెనుతుఫాన్ పెథాయ్‌గా మారింది. ప్రస్తుతం తుఫాన్ చెన్నైకి 670 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతూ సోమవారం సాయంత్రం ఒంగోలు, కాకినాడ మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు.
దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటిమీటర్ల వర్షం కురవవచ్చని అప్రమత్తం చేసింది. తీరప్రాంతంలో గంటకు 100 కిలోమీటర్లతో వేగంతో గాలులు వీచనున్నాయి. భారీ వర్షాలు ఉంటాయని హెచ్చరికలు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం, మంగళవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, మామిడికుదురు మండలం ఆదుర్రు మధ్య పెథాయ్ తుఫాన్ తీరం దాటే అవకాశముందని, ఈ నేపథ్యంలో గ్రామస్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులకు సూచించారు. కాగా, పెథాయ్ తుఫాన్ నుంచి తీవ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గవర్నర్ నరసింహాన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడికి ఫోన్ చేసి.. ముందస్తు చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా గవర్నర్ సీఎంకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment