ఇది తుపాన్ల సమయం | Cyclones Timings And Effects Special Story | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 18 2018 7:06 AM | Last Updated on Tue, Dec 18 2018 7:16 AM

Cyclones Timings And Effects Special Story - Sakshi

1996 పెను తుపాను మిగిల్చిన విషాదం (ఫైల్‌)

తూర్పు తీరానికి ఇది తుపాన్ల సమయమే. అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకూ ఈ ప్రాంతాన్ని తుపాన్లు పలకరిస్తుంటాయి. 50 ఏళ్లలో పది పెద్ద తుపాన్లను జిల్లావాసులు చూశారు. వాటిలో రెండు పెను విషాదాన్ని నింపాయి.

తూర్పుగోదావరి, అమలాపురం: బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు తీరం తరచూ తుపాన్ల బారిన పడుతూనే ఉంది. సాధారణంగా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ నెలల్లో తుపాన్లు వస్తుంటాయి. అర్ధశతాబ్ద కాలంలో పది పెద్ద తుపాన్లను తూర్పు తీరం చవిచూసింది. వాటిలో 1969, 1996లో వచ్చిన పెనుతుపాన్లకు జిల్లా భారీ మూల్యం చెల్లించుకుంది. అవి వందల కోట్ల ఆస్తినష్టమే కాదు.. భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. 1969లో వచ్చిన పెను తుపానులో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. 1996 నవంబర్‌ 6వ తేదీ రాత్రి వచ్చిన పెను తుపాను కోనసీమకు కాళరాత్రిని మిగిల్చిం ది.  తీరంలో ఐదు నుంచి పది మీటర్ల ఎత్తున రాకాశి ఆలలు ఎగిసిపడ్డాయి. ఈ తుపానుకు సుమారు 560 మంది మృత్యువాత పడ్డారు.

ఐ.పోలవరం మండలం బలుసుతిప్ప, భైరవపాలెం, కాట్రేనికోన మండలం చిర్రయానాం, పల్లం, మగసానితిప్ప, కొత్తపాలెం, బలుసుతిప్పలో వందలాది మత్స్యకారులు మృత్యువాత పడ్డారు. వేట పడవలు కొట్టుకుపోయాయి. ఈ తుపాను వేళ గంటకు 200 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తొలుత తూర్పు నుంచి పడమరకు, తరువాత పడమర నుంచి తూర్పునకు పెనుగాలులు వీయడంతో కొబ్బరిచెట్లు ఈనుల్లా విరిగిపడ్డాయి. సుమారు 80 వేల ఎకరాల్లో కొబ్బరికి నష్టం వాటిల్లింది. 24 లక్షల కొబ్బరిచెట్లు నేలకు ఒరిగిపోగా, 33 లక్షల చెట్లు మొవ్వులు విరిగిపడ్డాయి. రహదారులపై భారీ వృక్షాలు పడ్డాయి. కొన్ని గ్రామాలకు వెళ్లడానికి అధికారులకు వారం రోజులుపైనే పట్టింది. 1996 తరువాత కొబ్బరికి నష్టం చేసిన తుపాన్లలో 2013 నవంబర్‌ 18న వచ్చిన హెలెన్‌ తుపాను ఒకటి. ఈ తుపానుకు కోనసీమలో 80 వేల కొబ్బరిచెట్లు నేలకొరిగాయి. 2010లో ఏకంగా రెందు తుపాన్లు జిల్లాను ముంచెత్తాయి. దీనిలో లైలా విచిత్రంగా మే నెలలో సంభవించగా, అదే ఏడాది నవంబరు నెలలో జల్‌ తుపాను వచ్చింది. ఇవి కాకుండా వాయుగుండాలు, అల్పపీడ ప్రభావంతో భారీ వర్షాలు కురవడం వందలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లిడం జిల్లాలో పరిపాటే.

నష్టాల పాల్జేసిన తుపాన్లు
సంవత్సరం        తుపానుపేరు      వచ్చిన తేదీ    
1969               ను తుపాను       డిసెంబర్‌ 6    
1996               పెను తుపాను    మే 17    
2010                లైలా                 నవంబర్‌ 1    
2010                జల్‌                  అక్టోబర్‌ 28    
2012                నీలం                నవంబర్‌ 18    
2013               హెలెన్‌                అక్టోబర్‌ 7    
2014               హుద్‌హుద్‌        డిసెంబర్‌ 17 (తుని, ఏలేశ్వరం మండలాలు మాత్రమే)    
2018                పెథాయ్‌             డిసెంబర్‌ 17

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement