పెథాయ్ తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారిని నిలువునా వంచిస్తోంది. నిబంధనల పేరిట బంధనాలు వేస్తోంది. నష్టపరిహారం ఇవ్వకుండా తప్పించుకో వడానికి పెథాయ్ తుపాను వల్ల పంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని చిత్రీకరించేందుకు ప్రయత్ని స్తోంది. తమను మోసగించడానికే సీఎం చంద్రబాబు టెక్నాలజీతో తుపాను నష్టాన్ని నివారించానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని బాధిత రైతులు వాపోతున్నారు. పెథాయ్ తుపాను వల్ల కేవలం 66 వేల ఎకరాల్లోనే పంటలు పాడయ్యాయని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు.