‘మీట్’ మై ఫ్రెండ్
తెలంగాణలో జాతీయ సగటును మించిన మాంసం వినియోగం
ప్రపంచంలోనే అత్యధిక ధర పలుకుతున్నదీ మన దగ్గరే..
సాక్షి, హైదరాబాద్: పెళ్లి.. పుట్టినరోజు ఇలా ఏ దావత్ చేసినా.. ముక్కలుండాలె... ముక్కలేయకపోతే బంధాలే ముక్కలైపోతాయని బంధు ‘బలగం’మస్తుగా ఉన్న ప్రతీ కుటుంబానికీ తెలుసు. మటన్ ఓ ట్రెడిషన్‌గా మారిపోయి దేశంలోనే మన రాష్ట్రాన్ని టాప్‌ప్లేస్‌కు తీసుకెళ్లింది. జాతీయసగటు కన్నా ఎక్కువగా మాంసాన్ని మనవారు లాగించేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం
దేశంలో 70 శాతానికిపైగా ప్రజలు మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. దేశంలో 16.6శాతం మంది పురుషులు 29.4 శాతం మంది మహిళలు తప్ప, మిగిలిన వారంతా నాన్ వెజ్ ప్రియులేనని, ప్రతీ ముగ్గురిలో ఇద్దరు మాంసం తినేవారేనని తేల్చింది.
మనమే టాప్...
దేశవ్యాప్తంగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో 98.7 శాతంతో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా, పశ్చిమబెంగాల్ 98.55, ఏపీ 98.25 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక కేజీ మాంసం ధర రూ.500 నుంచి రూ.600 మధ్య ఉండగా, మన దగ్గర రూ. 800 నుంచి రూ.1,000 వరకూ ఉంది. తెలంగాణవాసులు వారానికి కనీసం మూడుసార్లు మాంసాహారాన్ని తింటున్నారని ఓ సర్వే వెల్లడించింది. ప్రతీ వ్యక్తి సంవత్సరానికి సగటున రూ.58,000 మాంసం కోసం వెచి్చస్తున్నారని ఓ వెటర్నరీ అధికారి తెలిపారు.
⇒ రాష్ట్రంలో 2014–15లో సగటున ఒక్కో వ్యక్తి సంవత్సరానికి 12.95 కిలోలు తినగా, అది 2021–22 నాటికి 21.17 కిలోలకు పెరిగింది. ఇప్పుడు ఆ సగటు 28.5 కిలోలకు చేరింది. ఇదే సమయంలో జాతీయ సగటు మాంసం వినియోగం దాదాపుగా 7.1 కిలోలు పైచిలుకు మాత్రమే కావడం గమనార్హం.
⇒ మన దగ్గర వినియోగిస్తున్న 28 కిలోల్లో దాదాపు 8 కిలోలు గొర్రె/మేక మాంసం కాగా (జాతీయ సగటు 3.5 కిలోలు) కాగా, ఇందులో స్వల్పంగా బీఫ్, పంది మాంసం మిగిలినది చికెన్.
⇒ జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోలు వరకూ వినియోగించవచ్చు. గొర్రె/మేక మాంస వినియోగం ఎక్కువగా ఉన్న మన దగ్గర ఉత్పత్తి సరిపోక ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. బయట నుంచి వచ్చే మాంసం ఏదైనా కారణాల వల్ల ఆగిపోతే మాంసం కేవలం 10 రోజులు రాకపోయినా మాంసం ధర రూ.1000 పైబడుతుందని అంచనా.
మటన్ క్యాపిటల్ హైదరాబాద్
రాష్ట్రంలో ఉత్పత్తి చేసి, దిగుమతి చేసుకునే మాంసంలో ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే వినియోగిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే మాంసాన్ని హైదరాబాద్‌లో నిల్వ చేసి తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేయడంతో హైదరాబాద్ మాంసం సరఫరాకు కేంద్రంగా మారింది. మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు పెద్ద సంఖ్యలో ఉండడంతో పాటు
వ్యక్తిగత వినియోగం కోసం కూడా కలిపి హైదరాబాద్‌లో ప్రతిరోజూ సుమారు 18,000కు పైగా గొర్రెలను వధిస్తున్నట్టు అంచనా.
రోజుకు 50వేల వరకూ జంతువధ...
తెలంగాణలో చెంగిచెర్ల, జియాగూడ, బోయిగూడ, బహదూర్‌పురా, అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లో కబేళాలు ఉన్నాయి. స్థానిక వినియోగం, ఎగుమతుల కోసం వేర్వేరుగా వీటిని వినియోగిస్తున్నారు. వీటిలో అన్ని రకాల మాంసాలు కలిపి ఒక్కరోజులో 6 వేల నుంచి 7 వేల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 45వేల నుంచి 50వేల దాకా జంతువులను వధిస్తారు. ఇందులో సగంపైనే హైదరాబాద్ వినియోగానికే కేటాయిస్తున్నారు.
స్వయం సమృద్ధి దిశగా...
గొర్రెల ఉత్పత్తిలో మనం తొలిస్థానంలో, మాంసం ఉత్పత్తి, వినియోగం రెండింటిలో మనం ముందున్నాం. దేశంలో బీఫ్ ఎగుమతుల ద్వారా మనకు అత్యధిక ఆదాయం లభిస్తోంది. అదే సమయంలో గొర్రె/మేక మాంసం దిగుమతులు తగ్గించేందుకు, స్వయం సమృద్ధి సాధించే దిశగా పలు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. –డా.బర్బుధ్ది, డైరెక్టర్, నేషనల్ మీట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌ఎమ్‌ఆర్‌ఐ)
ఉత్పాదకత పెంపుపై దృష్టి...
రాష్ట్రంలో మాంస వినియోగం రానురానూ పెరుగుతోంది. డిమాండ్‌ను అందుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం ఒక గొర్రె/మేక ద్వారా వస్తున్న మాంసం పరిమాణాన్ని పెంచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటికి సరైన ఆహారం అందించడం ద్వారా దిగుబడి రెట్టింపు చేసే దిశగా కృషి చేస్తున్నాం. –పి.బస్వారెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్‌ఎమ్‌ఆర్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment