సాక్షి, హైదరాబాద్ : మాంసం ప్రియులకు శుభవార్త.. ఎముక(బొక్క).. కొవ్వు లేని మాంసం త్వరలో మీ జిహ్వచాపల్యాన్ని తీర్చనుంది. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు ప్రయోగాత్మ కంగా టిష్యూ ఇంజనీరింగ్, జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ ఆధారంగా క్లీన్‌మీట్ తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ సంవత్సరం చివరికి సుమారు టన్ను మాంసం అందుబాటులోకి రానున్నట్లు విశ్వస నీయంగా తెలిసింది. ఈ ప్రయోగం సఫలమై వినియోగదారులకు క్లీన్ మీట్ అందుబాటులోకి వస్తే మాంసం ప్రియులకు పండగేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎలా తయారు చేస్తారంటే..
మేక లేదా కోడి శరీరభాగాల నుంచి కణజాలాన్ని సేకరించి ప్రయోగశాలలో సంరక్షాలను అందజేసి ఈ విధానంలో మాంసాన్ని తయారు చేస్తారు. ఇది సాధారణ మాంసంలానే తాజాగా, రుచిగా ఉంటుందట. ధర కూడా సాధారణ మాంసం ఎంత ధర ఉంటుందో అంతే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మాంసంలో సూక్ష్మ జీవ నాశకాలు(యాంటీ బయాటిక్స్), వృద్ధి హార్మోన్ల ఉనికి ఉండదని, దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా, సీసీఎంబీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మాంసాన్ని ప్రయోగ శాలలో తయారు చేస్తున్నారు. ఈ మాంసంలో బ్యాక్టీరియా ఉనికి కూడా ఉండదని చెబుతుండటం గమనార్హం.
రాజస్తాన్‌లో శాకాహారులే అధికం
రాజస్తాన్‌లో శాకాహారులు అత్యధిక సంఖ్యలో ఉండటం విశేషం. ఆ రాష్ట్రంలో 73.2 శాతం మంది పురుషులు, 76.6 శాతం మంది మహిళలు శాకాహారులే. హరియాణాలో 68.5 శాతం మంది పురుషులు, 70 శాతం మంది మహిళలు.. పంజాబ్‌లో 65.5 శాతం మంది పురుషులు, 68 శాతం మంది స్త్రీలు శాకాహారాన్నే ఇష్టపడుతున్నారు. గ్రామీణ భారతీయుల్లో 6.4 శాతం మంది మటన్.. 21.7 శాతం మంది చికెన్.. 26.5 శాతం మంది చేపలు.. 29.2 శాతం మంది గుడ్లు తింటున్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ డేటా చెబుతోంది. పట్టణాల్లో 21 శాతం మంది మటన్.. 21 శాతం మంది చేపలు.. 27 శాతం మంది చికెన్.. 37.6 శాతం మంది గుడ్లను వినియోగిస్తున్నారట.
జాతీయ స్థాయి సగటు కంటే అధికం..
జాతీయ స్థాయిలో ఏటా సరాసరిన ఒక్కో వ్యక్తి మాంసం వినియోగం 3.2 కిలోలుగా ఉంది. ప్రపంచ సరాసరి మాత్రం 38.7 కిలోలుగా ఉంది. అమెరికాలో అయితే ఏటా ఒక్కో వ్యక్తి 125 కిలోల మాంసాన్ని సరాసరిన వినియోగిస్తున్నట్లు తేలడం విశేషం. జాతీయ స్థాయి సగటు కంటే చికెన్ వినియోగం తెలంగాణలో అధికంగా ఉండటం విశేషం. జాతీయ స్థాయిలో ఏటా ఒక్కో వ్యక్తి సరాసరిన 3.2 కిలోల మాంసం, 65 గుడ్లను వినియోగిస్తుండగా.. తెలంగాణలో 6.5 కిలోల మాంసం.. 90 గుడ్లను వినియోగిస్తున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే ఏటా ఒక్కో వ్యక్తి సగటున 7.5 కిలోల మాంసం, 100 గుడ్లను లాగించేస్తున్నట్లు అంచనా.
కృత్రిమ మాంసంతో ఉపయోగాలివే..
- దేశంలో ఏటా పెరుగుతోన్న మాంసం డిమాండ్‌ను తీర్చవచ్చు.
- కొవ్వు, ఎముకలు లేకపోవడంతో పోషకాహారంలా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.
- తక్కువ భూమి, నీరు వినియోగంతో ఈ మాంసాన్ని తయారుచేయవచ్చు.
- లక్షలాది మూగజీవులను చంపే అవసరం ఉండదు.
గుడ్లు, చికెన్ వినియోగం పెరగాలి
పోషక విలువలు అధికంగా ఉండే గుడ్ల వినియోగం ఏటా ఒక్కో వ్యక్తికి 118కి పెరగాలని జాతీయ పోషకాహార సంస్థ సూచించింది. చికెన్ వినియోగంలో సైతం జాతీయస్థాయి సగటు 15 కిలోలకు పెరగాల్సి ఉంది.
– రంజిత్‌రెడ్డి, తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
దేశంలో మాంసం వినియోగం ఇలా..
మాంసం వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తోంది. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. 2016–17 మధ్యకాలంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో మాంసాహారులు ఉన్నట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ(నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్) అధ్యయనంలో తేలింది. ఇందులోనూ.. పురుషుల్లో 98.8 శాతం, మహిళల్లో 98.6 శాతం మంది మాంసాహారులే. మాంసాహారులు ప్రధానంగా మటన్, చికెన్, చేపల వంటకాలనే ఇష్టపడుతున్నారు. మాంసాహారుల విషయంలో రెండో స్థానంలో నిలిచిన పశ్చిమబెంగాల్లో 98.7 శాతం, ఏపీలో 98.4 శాతం, ఒడిశాలో 97.7 శాతం, కేరళలో 97.4 శాతం మంది పురుషులు మాంసాహారులే. ఏటా తెలంగాణలో 4.47 లక్షల మెట్రిక్ టన్నులు, ఏపీలో 5.27 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment