శుక్ర, శనివారాల్లో పరుగులు పెట్టిన వైనం
బేగంబజార్, మాసబ్‌ట్యాంక్‌ల్లో ఘటనలు
సంయమనం పాటించిన నగర వాసులు
సాక్షి, హైదరాబాద్: నగర పోలీసు విభాగానికి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలు, సామూహిక నిమజ్జనం ఓ సవాల్ లాంటివి. బందోబస్తు నేపథ్యంలో వీటిని అధికారులు ఫైనల్స్‌గా పిలుస్తుంటారు. ఎలాంటి అపశ్రుతులు, వదంతులు షికార్లు చేయడం తదితరాలు చోటు చేసుకోకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తుంటారు. అయినప్పటికీ చిన్న చిన్న ఉదంతాలు, టెన్షన్లు మామూలే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి దుర్గా నవరాత్రులు పోలీసులకు చెమటలు పట్టించాయి. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, మాసబ్‌ట్యాంక్‌ల్లో శుక్ర, శనివారాల్లో చోటు చేసుకున్న ఘటనలతో పోలీసులు పరుగులు పెట్టారు. నగర వాసులు పూర్తి సంమయనం పాటించడంతో ఏ చిన్న అపశ్రుతి లేకుండా ఈ రెండూ గట్టెక్కాయి. దీంతో పోలీసుల ఊపిరి పీల్చుకున్నారు.
డిప్రెషన్ రోగి నిర్వాకం..
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన దేవీమాత విగ్రహం చేతిని శుక్రవారం మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ధ్వంసం చేశాడు. ఈ విషయం తెలియడంతో పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. ఎట్టకేలకు అదే రోజు రాత్రి 8.15 గంటలకు నాగర్ కర్నూలుకు చెందిన కృష్ణయ్యను ఫీల్‌ఖానా చౌరస్తా వద్ద పట్టుకున్నారు. గురువారం రాత్రి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సద్దుల బతుకమ్మ పండగ జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆకలితో ఉన్న కృష్ణయ్య ఆహారం కోసం గ్రౌండ్స్‌లోకి వచ్చాడు. తినేందుకు ఏదైనా దొరుకుతుందేమోనని వెతికే ప్రయత్నాల్లోనే మండపం చిందరవందర కావడంతో పాటు విగ్రహం చేయి ధ్వంసమైందని పోలీసులు తేల్చారు. మండపం వద్ద నిర్వాహకులు ఎవరు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవరించడంతో పోలీసులు వారి పైనా కేసు నమోదు చేశారు. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో వదంతులు షికారు చేశాయి.
వీధికుక్క చేసిన పనికి...
మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి మరో కలకలం రేగింది. ఓ ప్రార్థన స్థలం ఎదురుగా రోడ్డుపై ఓ ప్రాణి మాంసం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం బయటకు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమీపంలో ఉన్న చెత్త పదార్థాల నుంచి ఓ వీధికుక్క మాంసం ముక్కను నోటితో కరుచుకుని రావడం వీటిలో కనిపించింది. కొద్దిదూరం ఆ ముక్కను అలాగే తీసుకువెళ్లిన శునకం నోటి నుంచి ఓ ముక్క ప్రార్థన స్థలం సమీపంలో పడిపోయింది. శునకం తిరిగి ఆ ముక్కను తీసుకోకుండా వదిలేసి వెళ్లిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. వీటిని వెంటనే మీడియాకు విడుదల చేసిన పోలీసులు ఈ అంశంపై వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుర్గా నవరాత్రుల్లో పోలీసులకు ఉత్కంఠ
Comments
Please login to add a commentAdd a comment