
టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)ది ప్రత్యేక శైలి. స్వతహాగా ఇంజనీర్ అయిన అశ్విన్ తన స్పిన్ బౌలింగ్ లోనూ అదే మేధస్సును ప్రదర్శించాడు. గత సంవత్సరం జరిగిన ఆస్ట్రేలియా సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించిన 38 అశూ.. ఆటను విశ్లేషించడంలో మాంచి దిట్ట.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంపై కూడా తనదైన శైలిలో స్పందించాడు. ప్రస్తుత భారత్ జట్టు 1990- 2000లలో దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్ ని ఎలా శాసించిందో.. అదే రీతిలో విజయ పరంపర కొనసాగిస్తుందని వ్యాఖ్యానించాడు.
భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)ని గెలుచుకున్న తర్వాత ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అశ్విన్ మాట్లాడుతూ.. ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత్ ఈ విజయం సాధించడం చాలా ప్రత్యేకమైందన్నాడు. ఇది భారత బౌలింగ్ లైనప్ బలాన్ని రుజువు చేసిందని వ్యాఖ్యానించాడు.
బౌలింగ్ వల్లే
టీమిండియా ఈసారి బ్యాటింగ్ వల్ల కాదు, బౌలింగ్ వల్లే ఈ ట్రోఫీ గెలిచిందని. .ఇది అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా గ్రాస్ రూట్ స్థాయిలో బౌలర్లకు మరింత మద్దతు, ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరముందని అశ్విన్ పిలుపునిచ్చాడు. బుమ్రా లేకుండా ఈ టోర్నమెంట్లో విజయం సాధిండానికి భారత్ బౌలర్ల చేసిన కృషి ని ప్రత్యేకంగా అభినందించక తప్పదని అశ్విన్ తెలియజేసాడు.
వచ్చే సంవత్సరం జరిగే టీ20 ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ అశ్విన్ భారత జట్టుకు ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను అశ్విన్ గుర్తించాడు. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు వరుణ్ చక్రవర్తి భారత్ జట్టులో తప్పనిసరిగా ఉండాలని అశ్విన్ సూచించాడు. వారి ముగ్గురితో కూడిన బౌలింగ్ ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు భయంకరంగా ఉంటుందని వ్యాఖ్యానించాడు.
రచిన్ కాదు వరుణ్
ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూ జిలాండ్ అల్ రౌండర్ రచిన్ రవీంద్ర ని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ప్రకటించడం పై అశ్విన్ విభేదించాడు. రచిన్ రవీంద్రకి బదులుగా, భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కి ఆ గౌరవం దక్కాల్సిందని అశ్విన్ పేర్కొన్నాడు. రచిన్ 263 పరుగులతో ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
"ఎవరేమి చెప్పినా, ఏం చేసినా, నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కచ్చితంగా వరుణ్ చక్రవర్తి. అతను ఈ మొత్తం టోర్నమెంట్ ఆడలేదు. కానీ ఆడిన రెండు మూడు మ్యాచ్ లలోనే చాల కీలక భూమిక వహించాడు. వరుణ్ చక్రవర్తి లేకుంటే, ఈ భారత్ కి ఈ టోర్నమెంట్ చాల భిన్నంగా ఉండేదని నేను భావిస్తున్నాను. అతను భారత్ జట్టులో 'ఎక్స్ ఫ్యాక్టర్'.. జట్టు బౌలింగ్ కి వైవిధ్యాన్ని అందించాడు’’ అని అశ్విన్ స్పష్టంచేశాడు .
ఆతిధ్య పాకిస్తాన్‌కి తలవంపులు
ఓ వైపు భారత్ క్రికెటర్లు సంబరాల్లో మునిగిపోగా, ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చి చివరికి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా గ్రూప్ దశ నుంచి నిష్క్రమించిన పాకిస్తాన్ పరిస్థితి చాల దారుణంగా తయారైంది. ఈ టోర్నమెంట్ కి ఆతిధ్యమిచ్చిన గౌరవం దక్కకపోగా, ఆ జట్టు వైఫల్యంతో అవమానంతో తలవంపులు తెచ్చుకుంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోహ్సిన్ నఖ్వీ దుబాయ్ లో భారత్, న్యూ జిలాండ్ ల మధ్య జరిగిన ఫైనల్ కి హాజరుకాకపోవడం మరో దుమారానికి దారితీసింది.
భారత్ అన్ని మ్యాచ్ లను 'హైబ్రిడ్ మోడల్'లో దుబాయ్‌లో ఆడింది. దీనితో పాటు భయానకమైన ఎయిర్ షోలు, ఖాళీ స్టేడియంలు మరియు పేలవమైన డ్రైనేజీ వ్యవస్థలు ఐసీసీ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ అధ్వాన్నస్థితిని బయటపెట్టాయి. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిరసన తెలిజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
దుబాయ్ లో జరిగిన ముగింపు వేడుకలో టోర్నమెంట్ డైరెక్టర్ సుమైర్ అహ్మద్ ను ఆహ్యానించకపోవడం పై పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఐసీసీ వెలిబుచ్చిన కారణాలతో మొహ్సిన్ నఖ్వీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment