మ్యాచ్‌ ఫిక్సింగ్‌.. అన్నీ చెప్పేస్తా: పాక్‌ మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు | Match Fixing Was At Its Peak In 1990s Will Expose: Claims Ex Pak Captain | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ ఫిక్సింగ్‌.. అన్నీ చెప్పేస్తా: పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ సంచలన వ్యాఖ్యలు

Published Tue, Mar 11 2025 5:17 PM | Last Updated on Tue, Mar 11 2025 5:29 PM

Match Fixing Was At Its Peak In 1990s Will Expose: Claims Ex Pak Captain

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌(Rashid Latif) సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొంభైవ దశకంలో జరిగిన ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ దారుణాలను తాను త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నాడు. తాను రాస్తున్న పుస్తకంలో ప్రతి విషయాన్ని విడమరిచి చెబుతానంటూ 90s ఆటగాళ్లు బెంబేలెత్తిపోయేలా చేశాడు.

‘‘నేను ఒక పుస్తకం రాయడటం మొదలుపెట్టాను. ఇందులో 90వ దశకంలో జరిగిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ గురించి రాయబోతున్నాను. అప్పట్లో ఇది తారస్థాయిలో ఉండేది. ఎవ్వరి గురించి దాచేదిలేదు. అన్ని విషయాలను పూర్తిగా బయటపెట్టేస్తాను.

మ్యాచ్‌ ఫిక్సింగ్‌.. అన్నీ చెప్పేస్తా
అందులో ఎవరెవరి పాత్ర ఏమిటన్నది కూడా చెప్తాను. ఏ మాజీ కెప్టెన్‌ అయితే.. అధ్యక్షుడి క్షమాభిక్ష కోసం ఎదురుచూశాడో.. అతడి గురించి కూడా పూర్తి వివరాలు అందిస్తా’’ అని రషీద్‌ లతీఫ్‌ ‘ది కరెంట్‌ పీకే’కు వెల్లడించాడు.

అంతకు ముందు జియో న్యూస్‌తో మాట్లాడుతూ.. తొంభైవ దశకంలో ఆడిన వాళ్లు పాకిస్తాన్‌ జట్టుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రషీద్‌ లతీఫ్‌ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో పాకిస్తాన్‌ దారుణ ప్రదర్శన నేపథ్యంలో.. ‘‘పాకిస్తాన్‌ క్రికెట్‌ అంటే 90s ఆటగాళ్లకు నచ్చదు. వారి వల్లే వరల్డ్‌కప్‌ గెలవడం ఆలస్యమైంది.

దయచేసి వీరందిని పాక్‌ క్రికెట్‌కు దూరంగా ఉంచండి. అప్పుడే అనుకున్న ఫలితాలు పొందవచ్చు. పాక్‌ క్రికెట్‌కు సేవ చేసీ చేసీ వాళ్లు అలసిపోయారు. కాబట్టి ఇకనైనా వారికి విశ్రాంతినివ్వండి’’ అని రషీద్‌ లతీఫ్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

చాలా వరకు స్క్రిప్టెడ్‌
ఇక క్రిక్‌ఇన్ఫోకు రాసిన కాలమ్‌లోనూ రషీద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు తెలిసి.. క్రికెట్‌ మ్యాచ్‌లలో చాలా వరకు స్క్రిప్టెడ్‌. సినిమాలు, నాటకాల మాదిరే క్రికెట్‌ కూడా!.. టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు రాబట్టాలి. ఎన్ని ఓవర్లు వేయాలి.. ఇలాంటివన్నీ ముందే చెప్తారు.

ప్రతి ఒక్క ఆటగాడు తన భవిష్యత్తు గురించే ఆలోచిస్తారు. దీర్ఘకాలంపాటు జట్టులో కొనసాగలేమని అందరికీ తెలుసు. అందుకే డబ్బులు వచ్చే మార్గం కనిపించినపుడు ఇలా అడ్డదారులు తొక్కడం సహజమే. ఏదేమైనా ఒక ఆటగాడు స్వార్థపరుడైతే అతడు కచ్చితంగా అక్రమార్కుల వలలో చిక్కుకుంటాడు.

తొలి ఐదేళ్లలో ఇది జరుగుతుంది. నా దృష్టిలో ప్రతిభలేని ఆటగాడి కంటే.. టాప్‌ ప్లేయర్‌ మరింత స్వార్థంగా ఉంటాడు’’ అని రషీద్‌ లతీఫ్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. కాగా 1990లో పాక్‌ క్రికెట్‌ను ఫిక్సింగ్‌ ఉదంతం కుదిపేసింది. 

జస్టిస్‌ మాలిక్‌ మొహమద్‌ ఖయ్యూం నేతృత్వంలో ఏర్పాటైన దర్యాప్తు కమిటీ.. సుదీర్ఘ విచారణ అనంతరం మాజీ కెప్టెన్‌ సలీం మాలిక్‌, పేసర్‌ అటా ఉర్‌ రెహ్మాన్‌లను దోషులుగా తేల్చింది. దీంతో వారిపై జీవితకాల నిషేధం పడింది.​  

ఘోర అవమానం 
ఇదిలా ఉంటే.. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ఆతిథ్య దేశంగా వ్యవహరించిన పాకిస్తాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకిదిగిన మెన్‌ ఇన్‌ గ్రీన్‌.. కనీసం ఒక్క మ్యాచ్‌ గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన రిజ్వాన్‌ బృందం.. ఆఖర్లో బంగ్లాదేశ్‌పైనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావించింది. అయితే, వర్షం వల్ల ఆ మ్యాచ్‌ రద్దు కావడంతో విజయమన్నదే లేకుండా ఈ వన్డే టోర్నీని ముగించింది. మరోవైపు.. తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడిన టీమిండియా చాంపియన్‌గా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. 

చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్‌ అయ్యర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement