
భారత క్రికెట్ జట్టు.. 12 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) ను సొంతం చేసుకున్న టీమిండియా.. న్యూజిలాండ్‌పై పాతికేళ్ల నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్‌కు ఇది మూడో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం. 2002లో తొలిసారిగా ఈ మెగా టోర్నీ టైటిల్‌ను భారత్‌కు సౌరవ్ గంగూలీ అందించగా.. ఆ తర్వాత 2013 ఎంస్ ధోని సారథ్యంలో తిరిగి మళ్లీ ఛాంపియన్స్‌గా నిలిచింది.
మళ్లీ ఇప్పుడు పన్నెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ ట్రోఫీ భారత్ సొంతమైంది. టీమిండియా ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardhik Pandya)ది కీలక పాత్ర. ఈ టోర్నీ అసాంతం తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్‌కు వెన్నముకగా నిలిచాడు.
ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో హార్దిక్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికి అభిమానులకు గుర్తుండిపోతుంది. అంతేకాకుండా పాకిస్తాన్‌పై కూడా సంచలన స్పెల్‌ను పాండ్యా బౌల్ చేశాడు. ఇక ఈ విజయాన్ని తన దివంగత తండ్రికి హార్దిక్ పాండ్యా అంకితమిచ్చాడు. తను సాధించిన ప్రతీ విజయం వెనుక తన తండ్రి దీవెనలు ఉన్నాయి పాండ్యా చెప్పుకొచ్చాడు.
"నేను, నా సోదరుడు ఏ స్ధాయి నుంచి ఇక్కడికి చేరుకున్నామో మాకు బాగా తెలుసు. ఇప్పటికీ మాకు ఇది ఒక కలలానే ఉంది. కానీ ఈ విషయం గురుంచి మేము ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించలేదు. ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, కష్టపడి పనిచేయడమే మా లక్ష్యంగా పెట్టుకున్నాము. మేము సాధించిన విజయాలను చూసి మా తల్లిదండ్రులు సంతోషించారు. మా నాన్న బౌతికంగా మాకు దూరమైనప్పటికి.. ఆయన ఆశీర్వాదాలు మాకు ఎప్పటికి ఉంటాయి. ఆయన పై నుంచి అన్ని చూస్తున్నారు" అంటూ హార్దిక్ ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా హార్దిక్, కృనాల్ తండ్రి 2021లో గుండెపోటుతో మరణించారు.
అదేవిధంగా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఓటమిపై కూడా హార్దిక్ మాట్లాడాడు. "ఈ ఎనిమిదేళ్ల కాలంలో భారత క్రికెట్ జట్టు చాలా విజయాలు సాధించింది. ఏదేమైనప్పటికి ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీని సొంతంచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ స్వదేశానికి తిరిగి వెళ్లి సంబరాలు చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. భారత జట్టులో సీనియర్లు, జూనియర్లు అంటూ తారతామ్యాలు ఉండవు.. డ్రెసింగ్ రూమ్‌లో అందరం కలిసిమెలిసి ఉంటాము.
నా పదేళ్ల కెరీర్‌లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇప్పటివరకు నేను నేర్చుకున్నది, నా అనుభవాలను కొత్తగా వచ్చిన ఆటగాళ్లతో పంచుకుంటూ ఉంటాను. అది అతడికి మాత్రమే కాకుండా జట్టుకు కూడా ఉపయోగపడుతుందని పాండ్యా పేర్కొన్నాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2017 ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓటమి చూసిన సంగతి తెలిసిందే.
339 పరుగుల భారీ లక్ష్య చేధనలో టీమిండియా చతికలపడింది. హార్దిక్ పాండ్యా 76 పరుగులతో ఫైటింగ్ నాక్ ఆడినప్పటికి జట్టును మాత్రం ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్‌ను చిత్తు చేసి గత ఓటమికి భారత్ బదులు తీర్చుకుంది.
చదవండి: IPL 2024: ట్రోఫీ గెలిచినా.. కోరుకున్న గుర్తింపు దక్కలేదు: శ్రేయస్ అయ్యర్
Comments
Please login to add a commentAdd a comment