వరుణ్ చక్రవర్తి (PC: BCCI)
ఇంగ్లండ్‌తో గురువారం నాగ్‌పూర్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్(India vs England) కోసం సంసిద్ధమవుతున్న భారత జట్టుతో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి(Varun Chakravarthy) కూడా చేరడం ఆశించిన పరిణామమే. చక్రవర్తి వన్డే జట్టులోకి చేరడంపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా అధికారిక ప్రకటన చేసింది.
ఈ క్రమంలో.. మరి కొద్దీ రోజుల్లో పాకిస్తాన్-దుబాయ్‌లలో ప్రారంభం కానున్న చాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తిని కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం అవుతోంది.
అరంగేట్రం ఖాయమే
ఇక ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుణ్ రాణించిన విషయం తెలిసిందే. వరుణ్ వన్డే టోర్నమెంట్లో కూడా అరంగేట్రం చేయడం ఖాయమనిపిస్తోంది. మంగళవారం విదర్భ క్రికెట్ స్టేడియం లో వరుణ్ ఒక గంటకు పైగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు.
ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో గెలిచిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చక్రవర్తి భారత బౌలర్లలో ప్రధాన ఆకర్షణ అయ్యాడు. కర్ణాటకకు చెందిన ఈ స్పిన్నర్ ఏకంగా 14 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల ముగిసిన దేశవాళీ 50 ఓవర్ల విజయ్ హజారే ట్రోఫీ టోర్నమెంట్లో కూడా బాగా రాణించిన స్పిన్నర్లలో చక్రవర్తి మొదటి స్థానాన్ని ఆక్రమించాడు. వరుణ్ ఈ టోర్నమెంట్లో 12.16 సగటుతో మొత్తం 18 వికెట్లు పడగొట్టాడు.
అయితే వరుణ్ ఎవరి స్థానంలో భారత్ జట్టులో వస్తాడన్నది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన ముందస్తు జట్టులో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లతో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. అయితే వీరిలో ఎవరి స్థానంలో వరుణ్ జట్టులోకి వస్తాడన్నది ఆసక్తికర అంశం. ఫిబ్రవరి 12లోగా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ తన తుది జట్టు ని ప్రకటించాల్సిన అవసరం ఉంది.
ఇక వరుణ్‌కి ఇప్పటికే తమిళనాడుకు చెందిన భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మద్దతు ప్రకటించాడు. చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టులో అతనిని చేర్చాలని కూడా విజ్ఞప్తి చేశాడు.ఇంగ్లండ్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుణ్ చక్రవర్తిని ఆడించే అవకాశం ఉందని అశ్విన్ ముందే ప్రకటించాడు. "ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో వరుణ్‌కు ఆడే అవకాశం లభిస్తుందని నేను భావిస్తున్నాను.
పేలవమైన బ్యాటింగ్ రికార్డ్
ఈ టోర్నమెంట్ లో అతని ప్రదర్శన ఆధారంగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకి ఎంపిక చేసే అవంకాశముందని" అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే వరుణ్ పేలవమైన బ్యాటింగ్ రికార్డ్ అతనికి అడ్డంకిగా పరిణమించే అవకాశం ఉంది. కొద్దో గొప్పో బ్యాటింగ్ వచ్చిన వారికే భారత్ జట్టు ఎంపికలో ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటె అవసరమైన పక్షంలో వారు తమ బ్యాటింగ్ తో జట్టు ని ఆదుకునే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.
ఇప్పటికే జట్టులో ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ లు లోయర్ మిడిల్ ఆర్డర్‌లో సమర్థులైన బ్యాటర్లుగా గుర్తింపు పొందారు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఒక మోస్తరుగా బ్యాటింగ్ లో రాణించగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు.
ఈ నేపథ్యంలో తన బౌలింగ్ ప్రతిభతో నిలకడ గా రాణించగలిగితేనే వరుణ్ చక్రవర్తికి ఛాంపియన్స్ ట్రోఫీ తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఇందుకు గురువారం నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లండ్ వన్డే సిరీస్ కీలకం కానుంది.
అయితే భారత్ బౌలింగ్ మార్పులు చేర్పులు అంతా జట్టు ప్రధాన పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్ నెస్ పైనే ఆధారపడి ఉంటుంది. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడే విషయం పై స్పష్టం వచ్చినట్లయితే జట్టులో మరో స్పిన్నర్ కి స్థానం లభించే అవకాశం ఉంది. బుమ్రా తన వెన్ను సమస్యల నుండి సకాలంలో కోలుకో లేకపోతే, భారత్ తన బౌలింగ్ ని పునః పరిశీలించాల్సిన ఆవరసం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment