
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంట్లో పెళ్లి భజాలు మోగనున్నాయి. అతడి సోదరి సాక్షి పంత్ పెళ్లి పీటలు ఎక్కనుంది. సాక్షి పంత్.. వ్యాపారవేత్త అంకిత్ చౌదరిని వివాహం చేసుకోబోతోంది. ఈ వివాహ వేడుకలు మంగళవారం, బుధవారం ముస్సోరీలో జరగనున్నట్లు తెలిసింది.
ఈ వివాహానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హాజరు కానున్నట్లు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా 9 ఏళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట.. గతేడాది నిశ్చితార్థం చేసుకున్నారు. లండన్‌లో జరిగిన వారి నిశ్చితార్థానికి ఎంఎస్ ధోని హాజరయ్యాడు.
లక్నో కెప్టెన్‌గా..
ఇక ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలుచుకున్న భారత జట్టులో పంత్ సభ్యునిగా ఉన్నాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం పంత్‌కు రాలేదు. కేఎల్ రాహుల్ ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ఉండడంతో పంత్‌కు తుది జట్టులో చోటుదక్కలేదు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్‌పైనే పడింది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకుని ఆటగాళ్లంతా తమ తమ జట్లలో చేరనున్నారు. ఇప్పటికే రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ ప్లేయర్లు తమ ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలతో కలిశారు. ఈ ఏడాది సీజన్ ఐపీఎల్‌లో రిషబ్ పంత్ లక్నో సూపర్‌జెయింట్స్ తరపున ఆడనున్నాడు.
గత డిసెంబర్‌లో జరిగిన మెగా వేలంలో పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డులెక్కాడు. ఈ సీజన్‌లో లక్నో కెప్టెన్‌గా పంత్ వ్యవహరించనున్నాడు.
చదవండి: అక్షర్, రాహుల్ కాదు..? ఢిల్లీ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్!?
Comments
Please login to add a commentAdd a comment