న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 శాతం క్షీణిస్తుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. మూడవ త్రైమాసికంలో ఎకానమీ మైనస్‌లోనే ఉంటుందని, నాల్గవ త్రైమాసికంలోనే వృద్ధి బాటకు వస్తుందని విశ్లేషించింది. మూడవ త్రైమాసికంలో 1.3 శాతం క్షీణ రేటును అంచనా వేసిన ఫిక్కీ, నాల్గవ త్రైమాసికంలో 0.5 శాతం వృద్ధి బాటకు మళ్లుతుందని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం దేశం 9.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని వివరించింది. 7.5 శాతం–12.5 శాతం కనిష్ట, గరిష్ట శ్రేణిలో ఉండే వీలుందనీ సర్వే అంచనా వేసింది.
అదే విధంగా.. దేశ వ్యవసాయ రంగం కరోనా ప్రేరిత సవాళ్లను విజయవంతంగా అధిగమించగలిగినట్లు ఫిక్కీ సర్వే పేర్కొంది. కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య 23.9 శాతం క్షీణించిన ఆర్థిక వ్యవస్థ జారుడు రెండవ త్రైమాసికంలో 7.5 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరిలో పరిశ్రమ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగాల ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రాతిపదికన రూపొందించిన అవుట్‌లుక్ సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
♦ 2020–21లో వ్యవసాయ, అనుబంధ విభాగాల వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంటుంది.
♦ కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ రంగం మంచి పనితీరును కనబరచింది. రబీ పంట విస్తీర్ణం, తగిన వర్షపాతం, భారీ రిజర్వాయర్ స్థాయిలు, ట్రాక్టర్ అమ్మకాల్లో పటిష్ట వృద్ధి తత్సంబంధ అంశాలు ఈ రంగంలో గణనీయమైన పురోగతికి సూచికగా ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగం పురోగతికి పెట్టుబడులు మరింతగా పెరగాలి. ప్రత్యేకించి గిడ్డంగి సౌలభ్యతలు మెరుగుపడాలి.
♦ కరోనా వల్ల పరిశ్రమ, సేవల రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ 2 రంగాలూ 2020–21లో వరుసగా 10%, 9.2% నష్టపోతాయి.
♦ పారిశ్రామిక రంగంలో రికవరీ ఉన్నా, ఇంకా విస్తృత ప్రాతిపదికన ఇది కనిపించడంలేదు. పండుగల సీజన్‌లో పెరిగిన డిమాండ్ రికవరీకి దారితీసినా, దీర్ఘకాలంలో సానుకూలతలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది.
♦ పర్యాటకం, ఆతిథ్యం, వినోదం, విద్యా, ఆరోగ్య రంగాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఆయా విభాగాల పురోగతికి ప్రభుత్వం నుంచి సహాయ ప్యాకేజీలు ఉండాలి.
♦ 2020–21లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 10.7% క్షీణతలో ఉంటుంది. కనిష్ట–గరిష్ట స్థాయిల శ్రేణి మైనస్ 9.5%– మైనస్ 12.5 శాతంగా ఉంటుంది.
♦ 2020–21లో 6.5 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. కనిష్ట–గరిష్ట స్థాయిలు 5.8 శాతం – 6.6 శాతం శ్రేణిలో ఉంటాయని అంచనా.
♦ ఇక ప్రభుత్వ ఆదాయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21లో 7.4%గా (జీడీపీలో) ఉండవచ్చు. 7–8.5% శ్రేణిలో ఉండే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment