పంటలకు కనీస మద్దతు ధర కల్పించాల్సిందే
పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, రైతన్నలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శన చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్) తదితర పార్టీల సభ్యులు పార్లమెంట్ మకర ద్వారం మెట్లపై గుమికూడారు. ఉల్లిపాయలు, కూరగాయల దండలను మెడపై ధరించి కేంద్ర ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ‘పంటలకు కనీస మద్దతు ధర కల్పించండి’, ‘రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోండి’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు.
శివసేన(ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ... ‘‘తెలుగుదేశం పార్టీ, జేడీ(యూ)లకు బీజేపీ ప్రభుత్వం కనీస మద్దతు ధర(స్పెషల్ ప్యాకేజీ) అందించింది. అదే తరహాలో రైతులకు కూడా కనీస మద్దతు ధర అందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ సమానమేనని గుర్తించుకోవాలి. రైతులు దేశంలో ప్రధాన వాటాదార్లు. అందుకే వారికి మద్దతు ప్రకటిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర నుంచి విదేశాలకు ఉల్లిపాయల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని కేంద్రానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా చూడడమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment