రాజకీయ సంకల్పంతోనే.. కనీస మద్దతు ధర సాధ్యం | Minimum Support Price Guest Column By Dr Ummareddy Venkateswarlu | Sakshi
Sakshi News home page

రాజకీయ సంకల్పంతోనే.. కనీస మద్దతు ధర సాధ్యం

Published Thu, Dec 23 2021 12:45 AM | Last Updated on Thu, Dec 23 2021 12:45 AM

Minimum Support Price Guest Column By Dr Ummareddy Venkateswarlu - Sakshi

జాతీయ స్థాయిలో వ్యవసాయ రంగం చుట్టూ అల్లుకొన్న వివాదాలు ఇప్పట్లో వీడేట్లు లేవు. పార్లమెంట్‌లో ఆమోదించిన మూడు వివాదాస్పద సాగు చట్టాలను బేషరతుగా రద్దు చేస్తున్నట్లు నవంబర్‌ 19న నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ, ఏడాది కాలంగా దేశ రాజధాని సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతు సంఘాలు ఉద్యమం విరమించలేదు సరికదా... మరో ప్రధాన డిమాం డ్‌పై పట్టుబట్టాయి. అన్ని పంటలకు చట్టబద్దమైన కనీస మద్దతు ధర ప్రకటించాలని, లేదంటే ఉద్యమం విరమించ మని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. పోరాడి తేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నది ప్రజాస్వామ్యంలో నిజమే గానీ అన్ని పంటల ఎంఎస్‌పీకి కేంద్ర ప్రభుత్వం చట్టబద్దత కల్పించినట్లయితే రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయా? వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిషన్‌ 2006లో సూచించిన విధానంలో ప్రధాన పంటలకు సి2+50 శాతంతో కనీస మద్దతు ధర నిర్ణయించాలన్న డిమాండ్‌ను మరుగునపర్చి.. ప్రస్తుతం కొనసాగుతున్న ఎంఎస్‌పీకి చట్టబద్దత కోరడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటి? సాగు చట్టాలను రద్దు చేయడం వరకు ఆహ్వానించదగినదే అయినప్పటికీ.. ఉద్యమాన్ని చల్లార్చడా నికే తప్ప రైతాంగ సమస్యల పరిష్కారానికి కేంద్రం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న దాఖలాలు కనపడటం లేదు.

2014 ఎన్నికల ముందు బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేస్తామనీ, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనీ ప్రకటించింది. కానీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే బాణీ మార్చింది. స్వామినాథన్‌ కమిషన్‌ పేర్కొన్న విధానంలో అమలు చేస్తే వినియోగదారుడిపై అధికభారం పడుతుంది కనుక ఆ పద్ధతితో ‘ఎంఎస్‌పీ ఇవ్వం’ అని కరాఖండీగా చెప్పడమే కాదు... ఆ మేరకు సుప్రీంకోర్టులో ఓ అఫిడవిట్‌  కూడా దాఖలు చేసింది. పైగా, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదించే పంటల ఉత్పత్తి ఖర్చులను కేంద్ర ప్రభుత్వం తక్కువచేసి చూపడమో, తిరస్కరించడమో చేస్తూ... తక్కువ స్థాయిలో మద్దతు ధరలను నిర్ణయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే ఎంఎస్‌పీలో శాస్త్రీయత పాళ్లు 1% కూడా లేవని చెప్పడం అతిశయోక్తి కాబోదు. 

హెక్టారు వ్యవసాయ సాగుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ కూలీల భత్యం, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలకు చెల్లించే అద్దె మొత్తం, రైతు కుటుంబ సభ్యులు భూమిలో చేసిన శ్రమ, భూమి కౌలు ధర, సొంత పెట్టుబడి పెట్టినపుడు దానిపై వచ్చే వడ్డీ... వీటన్నింటిని కలిపి మద్దతు ధర నిర్ణయించాలని స్వామి నాథన్‌ కమిషన్‌ సిఫార్సు చేయగా... వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక సంఘం (సీఏసీపీ) కొన్ని అంశాలనే పరిగణనలోకి తీసుకొని ఆ ధరలనే సిఫారసు చేయడం, వాటినే కేంద్రం ఆమోదించడం ఓ తంతుగా ఇన్నేళ్లూ నడిచి పోతోంది. ఈ విధానం రైతులకే కాదు ఎవరికీ ఆమోద యోగ్యం కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పంటల సాగు వ్యయాలు తీసుకొని వాటిని కలిపి జాతీయ సగటుగా లెక్కించి కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నారు. దీనివల్ల సాగు ఖర్చు ఎక్కువగా ఉండే దక్షిణాది రాష్ట్రాల రైతాంగానికి అన్యాయం జరుగుతోంది. దేశం మొత్తాన్ని 4 లేదా 5 జోన్లుగా విభజించి, జోన్ల వారీగా కనీస మద్దతు ధరలను లెక్కించాలన్న హేతుబద్ధ సూచనను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.

పంటల ఉత్పత్తి ఖర్చులను అంచనా వేయడానికి, వాటికి మద్దతు ధరలు నిర్ణయించడానికి 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రమేష్‌చంద్‌ కమిటీని నియమించింది. ఆ కమిటీ దాదాపు ఏడాది తర్వాత, కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక 23 సూచనలతో ఓ నివేదిక సమర్పించగా దానిని బుట్టదాఖలా చేశారు. 2018–19 నుంచి ఎఫ్‌2+50 శాతం విధానంలో మద్దతు ధరను అమలు చేస్తూ... అదే స్వామినాథన్‌ సూచించిన ఎంఎస్‌పీ అంటూ నమ్మబలికారు. దేశంలో 51 రకాల ప్రధాన పంటలు పండుతోంటే కేంద్ర ప్రభుత్వం 14 నుంచి 23 రకాల పంటలకు మాత్రమే అరకొరగా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తోంది. కనీస మద్దతు ధరలు సక్రమంగా లభించని కారణంగా దేశ రైతాంగానికి సాలీనా రెండున్నర లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోందని వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 

అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయోత్పత్తుల విలువలో గరిష్టంగా 25 శాతం మేర వివిధ సబ్సిడీల రూపంలో రైతులకు అందిస్తుండగా, భారతదేశంలో అన్ని రకాల సబ్సిడీలు 4 శాతం మించడం లేదు. కనీస మద్దతు ధరలు కూడా మిగతా దేశాలతో పోలిస్తే ప్రపంచ మార్కెట్‌లో 17 శాతం తక్కువగా ఉన్నట్లు ఓఈసీడీ (ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) వ్యవసాయ నివేదిక  తెలియజెప్పింది. ఈ నేపథ్యంలో స్వామినాథన్‌ కమిషన్‌ కనీస మద్దతు ధరలను సి2+50 శాతం ప్రకారం ఇవ్వాలని, అప్పుడే రైతులకు ప్రయోజనం కలుగుతుందని దాదాపు 15 ఏళ్ల క్రితమే స్పష్టం చేసింది. ఆహార ధాన్యాల దీర్ఘకాల విధానంపై ప్రొఫెసర్‌ అభిజిత్‌సేన్‌ కమిటీ 2002లో అందించిన నివేదిక సైతం ఇదే సూచనను బలపర్చింది.

స్వామినాథన్‌ కమిషన్‌ సూచనల మేరకు వాస్తవ సాగువ్యయానికి 50% కలిపి (సి2+50 శాతం) కనీస మద్దతు ధరను అందిస్తే ప్రభుత్వంపై పడే అదనపు భారం రూ. 2,28,000 కోట్లు మాత్రమేనని కిసాన్‌ స్వరాజ్‌ స్థాపకుడు ప్రొఫెసర్‌ యోగేంద్ర యాదవ్‌ లెక్కగట్టారు. ఈ మొత్తం కేంద్ర బడ్జెట్‌లో దాదాపు 8%. పారిశ్రామిక రాయితీల రూపంలో, బ్యాంకుల మొండి బకాయిల రద్దు రూపంలో ఏటా లక్షలాది కోట్ల ఆదాయాన్ని వదులుకొంటున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ మొత్తం పెద్ద లెక్క కాదు. పంటలకు మద్దతు ధర పెరిగితే రైతు కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మెరుగుపడతాయి.

రైతుల ఆత్మహత్యలు తగ్గు తాయి. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీ, నీతి ఆయోగ్‌ ఆశించేటట్లు రైతు ఆదాయం రెట్టింపు కావడానికి ఆస్కారం కలుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ ఏడున్నర దశాబ్దాలలో అతిపెద్ద రాజకీయ సంకల్పానికి సంబంధించిన అంశం ఇది. గట్టి రాజకీయ సంకల్పంతోనే అనేక చారిత్రా త్మక మార్పులు జరిగాయి. 2004లో వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని తీసుకొన్న నిర్ణయం దేశ వ్యవసాయ రంగ ముఖ చిత్రాన్ని మార్చివేసింది. అందువల్ల స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ గట్టి రాజకీయ సంకల్పం తీసుకోవాలి. అది చేయ గలిగితే ఆయన చరిత్రలో నిలిచిపోతారు.

-డాక్టర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త శాసన మండలి సభ్యులు, ఆంధ్రప్రదేశ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement