
ఛండీగడ్: తమ డిమాండ్ల సాధన కోసం పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ ఛలో కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు సంఘాల నాయకులతో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాలుగోసారి చర్చలు జరుపనుంది. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానందరాయ్‌లు నేడు ఛండీగడ్‌లో రైతులతో భేటీ కానున్నారు.
మరోవైపు.. రైతుల ఆందోళనల నేపథ్యంలో హర్యానాలో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఫిబ్రవరి 19 వరకు పొడిగించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటి వరకు ఫిబ్రవరి 8, 12, 15 తేదీల్లో రైతులతో జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. పంటల కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, స్వామినాథన్ సిఫార్సుల అమలు, రైతు కూలీలకు పింఛను, వ్యవసాయ రుణాల మాఫీ వంటివి రైతుల ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. నాలుగు రోజులుగా కొనసాగుతున్న రైతుల ఉద్యమాన్ని సోషల్ మీడియాలో ప్రసారం చేస్తున్న 70 యూట్యూబ్ చానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ భద్రతా దళాలను కవ్విస్తున్నారంటూ పోలీసులు వీడియోలను విడుదల చేశారు. ఇక, శంభు సరిహద్దుల వద్దే రైతులు బస చేశారు.
Comments
Please login to add a commentAdd a comment