పైసా ఇస్తే ఒట్టు | farmers not getting money | Sakshi
Sakshi News home page

పైసా ఇస్తే ఒట్టు

Published Wed, Jan 24 2018 3:17 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

farmers not getting money - Sakshi

మదనాపురం : ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతన్నకు అడుగడుగునా కష్టాలే.. పంటల సాగు సమయంలో ఎరువులు, విత్తనాల కొరత.. తీరా చేతికొచ్చిన పంటను విక్రయించగా డబ్బుల కోసం చెప్పులరిగేలా తిరగాల్సిన వ్యథ.. ఈ పరిస్థితినే జిల్లాలో కంది రైతులు ఎదుర్కొంటున్నారు. నెలరోజుల క్రితం ధాన్యం అమ్మినా చిల్లిగవ్వా చేతికందని దైన్యం. జిల్లాలోని వనపర్తి, మదనాపురం వ్యవసాయ మార్కెట్‌ కేంద్రాల్లో డిసెంబర్‌ 27న మార్కెటింగ్‌ శాఖ సహకారంతో హాకా ఆధ్వర్యంలో అట్టహాసంగా కందుల కొనుగోలు కేంద్రాన్ని  ప్రారంభించారు. ఆరంభం ఆర్భాటంగా మొదలైంది.. ఇదిచూసి సంబురపడిన రైతులు తండోపతండాలుగా తరలొచ్చి పండించిన కందులను మార్కెట్‌లో విక్రయించారు. మద్దతు ధర వచ్చినా రాకున్నా అమ్ముకున్నారు.  

రూ.4.67కోట్ల బకాయిలు
కొత్తకోట, మదనాపురం, మూసాపేట, అడ్డాకుల మండలాలకు చెందిన 493 మంది రైతులు 4,913 క్వింటాళ్ల కందు లను క్వింటాలుకు రూ.5,450చొప్పున మదనాపురం మార్కెట్‌లో విక్రయిం చారు. వీరికి సుమారు రూ.2.67కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే వీపనగండ్ల, పాన్‌గల్, ఖిల్లాఘనపురం గోపాల్‌పేట, ఎర్రవల్లి, వనపర్తి తదితర మండలాలకు చెందిన సుమారు 281 మంది రైతులు వనపర్తి మార్కెట్‌లోని కొనుగోలు కేంద్రంలో రూ.3,788క్వింటాళ్ల కందులు విక్రయించారు. వీరికి సుమారు రూ.2కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులకు డబ్బులు అకౌంట్లలో వేస్తామని 25రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అప్పుచేసి పంట పండిస్తే వచ్చే డబ్బులు వడ్డీలకే సరిపోతున్నాయని ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు.  

ఆలస్యం ఎందుకంటే..!
మార్కెట్‌ యార్డుల్లో కందులు కొనుగోలుచేసే సమయంలో రైతుల నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి. సంబంధిత గ్రామ వీఆర్వోతో పాటు పొలం పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, జిరాక్స్‌ కాపీలను తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని ఒక నమూనాలో పొందుపరిచి లారీలో కందుల ధాన్యం తరలించే సమయంలో ప్రభుత్వానికి పంపిస్తారు. ఈ క్రమంలో ఏ ఒక్క రైతు వివరాలను పొందుపర్చకపోయినా అందరికీ  బిల్లుల చెల్లింపు ప్రక్రియ ఆగిపోతుంది. ముందుగా ధాన్యం కొనుగోలుచేసిన అధికారులు 20రోజుల తర్వాత రైతుల నుంచి బ్యాంకుల ఖాతాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలను సేకరిస్తున్నట్లు తెలిసింది.    
 

అడుగడుగునా కష్టాలే!
రైతులు భూమి చదును చేసే నాటి నుంచి పంటకోసే వరకు కష్టాలు తప్పడం లేదు. కంది పంట సాగుకు ఎక రా దుక్కి దున్నేందుకు రూ.2వేలు విత్తనాల ఖర్చు రూ.500, అచ్చులతో విత్తనాలు వేసేందుకు రూ.వెయ్యి, కలుపుతీతకు కూలీల ఖర్చు రూ.ఐదువేలు, ఎరువుల ఖర్చు రూ.ఐదువేలు, పంటకోత కూలీ రూ.రెండువేలు, ఇలా ఎకరాకు రూ.15వేలు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. రైతు కంది పంట ను సాగుచేస్తే దిగుబడి రాకపోతే అప్పులపాలు కాకతప్పదని వాపోతున్నారు. ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తూ అన్నంపెట్టే రైతన్నల కు మాత్రం మొండిచేయి చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ధాన్యం అమ్మిన రూ.4.67కోట్ల డబ్బులు చెల్లించాలని కోరుతున్నారు.

10క్వింటాళ్ల కందులు తీసుకొచ్చా
10 క్వింటాళ్ల కందులను మదనాపురం మార్కెట్‌ యార్డుకు విక్రయించేందుకు తీసుకొచ్చాను. ఇంతకుముందు కందులు అమ్మిన రైతులకు డబ్బులు రాలేదని తెలిసింది. రైతులకు త్వరగా డబ్బులు చెల్లించే విధంగా చూడాలి.
 – నాగరాజు, రైతు, గట్లఖానాపురం

రైతులను ఇబ్బంది పెట్టొద్దు  
మేం ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చి విక్రయించాం. గత నెలలో కందులు అమ్మిన రైతులకు డబ్బులు ఇంకా రాలేదు. తక్షణమే అధికారులు స్పందించి డబ్బులు చెల్లించాలి.   
– బాలస్వామి, రైతు, కొత్తకోట  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement