రైతును ముంచిన ఉల్లి కన్నీరు
♦ నాడు కొనలేక జనానికి చుక్కలు
♦ నేడు ధరలేక రైతు గగ్గోలు
♦ కిలో రూ.4కి పడిపోయిన రేటు
♦ దోచుకుంటున్న దళారులు
♦ నిల్వ సౌకర్యం లేక ఇక్కట్లు
నాలుగు నెలల క్రితం..
‘ఉల్లిగడ్డ’ వ్యాపారుల గోదాముల్లో ఉంది. మార్కెట్ లో ఉల్లి ధర బాంబై పేలింది. కిలో రూ.80 పలికింది. జ నం ఉల్లి కొనలేక.. కోయలేక ‘కన్నీళ్లు’ పెట్టారు. సర్కారు సబ్సిడీ ఉల్లి కేంద్రాలను పెట్టి ఉపశమనం కలిగించింది.
ప్రస్తుతం..
‘ఉలి’్ల రైతన్నల కల్లాల్లో ఉంది. దళారులంతా కుమ్మైక్కై రైతుకు చుక్కలు చూపిస్తున్నారు. మార్కెట్‌కు ఉల్లిగడ్డ తీసుకెళ్తే కిలో రూ.4కి మించట్లేదు. రెక్కల కష్టం దళారీ నక్కల పాలైపోతుంటే ఉల్లి రైతు ‘కన్నీళ్లు’ పెడుతున్నాడు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి నిన్నా మొన్నటి వరకు చుక్కలు చూపించిన ఉల్లి ధర ఇప్పుడు చప్పున చల్లారిపోయింది. గత ఏడాది ధర బాగా పలకటంతో ఈ ఏడాది రైతులు భారీగా ఉల్లి సాగు చేశారు. కలిసిరాని కాలంతో పోటీపటి స్వేదంతో సేద్యం చేసి ఉల్లి పండించారు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. తీరా మార్కెట్‌లో రేటు ఒక్కసారిగా పడిపోయింది. పంట తీసుకొని మార్కెట్‌కు వెళ్తే గిట్టుబాటు ధర దేవుడెరుగు.. రవాణా ఖర్చులు కూడా రావటం లేదు.
జిల్లాలో భారీగా సాగు..
జిల్లాలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈసారి విస్తారంగా ఉల్లి సాగు చేశారు. మనూరు, నారాయణఖేడ్, కల్హేర్, కంగ్టి, పెద్దశంకరంపేట మండలాల్లో కలిపి దాదాపు 15 వేల మంది రైతులు 10 వేల హెక్టార్లలో ఉల్లిసాగు చేసినట్లు అంచనా. ఈ ఏడాది కనీసం లక్ష క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఉద్యాన శాఖ అధికారుల అంచనా. ఇక జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, జోగిపేట, జహీరాబాద్ నియోజకవర్గాల్లోనూ ఉల్లి సాగయింది. ఈ ఏడాది ఉల్లి దిగుబడి గణనీయంగా పెరిగింది. కానీ మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేదు. ప్రస్తుతం కిలో ఉల్లి రూ.4-రూ.6 మధ్య పలుకుతోంది. ఈ ధర గడ్డ తోడే కూలీలు, రవాణా ఖర్చులకే సరిపోతోంది. మరోవైపు ఖేడ్‌లో ఇప్పటి వరకు వ్యవసాయ మార్కెట్ లేకపోవటంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. తరుగు, హమాలీ ఖర్చులూ రైతుల నుంచే గుంజుతున్నారు. ఈ లెక్కలన్నీ పోతే ఉల్లి రైతుకు కిలోకు రూ.3కి మించి గిట్టుబాటు అవడం లేదు.
దిగుబడి భేష్.. గిట్టుబాటే ష్..
ఎకరా ఉల్లి సాగుకు సగటున రూ 60 వేల ఖర్చు వస్తోంది. నారాయణఖేడ్ పరిసర ప్రాంత పల్లెల్లో సగటున ఎకరాకు 45 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. నిజానికిది చాలా మంచి దిగుబడి. కల్లాల నుంచి ఉల్లిగడ్డ మార్కెట్‌కు తరలించాలంటే లోడ్‌కు కనీసం రూ 10 వేలు కిరాయి తీసుకుంటున్నారు. గడ్డ తోడినందుకు కూలీల ఖర్చు రూ 6 వేలు పోతోంది. మార్కెట్‌లో అమ్ముకుంటే క్వింటాలుకు రూ.800 నుంచి 1000 మాత్రమే వస్తున్నాయి. ఇక దళారులైతే రూ 400 నుంచి 600 కట్టిస్తున్నారు.