కొన్ని వారాల కొందట టొమాటో ధరలు ఏ స్థాయిని చేరుకున్నాయో చూశాం. కేజీ రూ.250 వరకు పలికిన వాటి ధరలు తిరిగి సాధారణ స్థితికి వచ్చాయి. ఇప్పుడు ఉల్లి రేట్లు పెరగడం ప్రారంభమైంది. దాంతో వీటి ఎగుమతులను నియంత్రించడం ద్వారా దేశంలో ఉల్లి ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.
నిత్యం వంటల్లో వాడే ఉల్లి ధరలు ఇప్పుడు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురిశాయి. దాంతో ఉల్లి పంట దెబ్బతింది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో వాటికి కొరత ఏర్పడింది. దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కొన్నిచోట్ల కిలో నాణ్యమైన ఉల్లిపాయలు రూ.40-50 మధ్య విక్రయిస్తున్నారు.
(ఇదీ చదవండి: ఆదాయపుపన్ను శాఖ సంచలన నిర్ణయం..అపర కుబేరులకు ఝలక్)
దీపావళి పండగ సీజన్ కావడంతో మున్ముందు ఈ ధరలు మరింత పెరగవచ్చనే అంచనాలున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ధరల కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఉల్లి ఎగుమతులపై విధించే పన్నును ఆగస్టులో 40శాతం మేర పెంచింది. ఈ పన్ను ఏడాది చివరివరకు అమలవుతుంది. ఈ చర్యతో ఉల్లి ఎగుమతులు భారీగా తగ్గి, వాటి ధరలు నిలకడగా ఉంటాయన్నది ప్రభుత్వ యోచన.
మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరుగుతున్నా దాన్ని గరిష్ఠస్థాయిలో పండించే రాష్ట్రాల్లో గతంలో వర్షాభావం వల్ల దిగుబడి తగ్గింది. వర్షాకాలంలో కర్ణాటకలోని రైతులు ఉల్లిని అధికంగా పండిస్తుంటారు. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఉల్లి సాగుపై ఆసక్తి చూపించలేదు. కొన్ని చోట్లు ఉల్లిసాగు చేసినా తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేల హెక్టార్లలో నేలకొరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
దేశీయంగా ప్రతి నెలా సగటున 13లక్షల టన్నుల ఉల్లి వినియోగమవుతుంది. దేశంలో ఉల్లి ఎక్కువగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పండుతుంది. 65శాతం పంట ఒక్క రబీలోనే వస్తుంది. అది ఏప్రిల్-మే మధ్య మార్కెట్లోకి వచ్చి అక్టోబరు-నవంబరు వరకు ఉంటుంది. అయితే, నిల్వ ప్రక్రియలోనే ఉల్లిపాయలు ఉత్పత్తి బరువులో 30-40శాతం కోల్పోతాయి. కుళ్ళిపోవడంవల్ల కొన్ని వృథా అవుతాయి. అలా పరిమాణంతో పాటు నాణ్యతపరంగానూ నష్టం వాటిల్లుతుంది. దేశంలో ఉల్లిపాయలను నిల్వ చేసేందుకు నాణ్యమైన ఏర్పాట్లు లేకపోవడంవల్ల ఏటా రూ.11వేల కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని అంచనా.
ఇదే సమయంలో దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆహార ధరలు నియంత్రణలో ఉండాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఉల్లి ధర కేజీకి రూ.50కి మించకుండా ఉండాలని చూస్తుంది. ఈ సారి ఖరీఫ్ పంట ఆలస్యంగా చేతికి రావటంతో పాటు పంట దిగుబడి తగ్గడంతో ప్రస్తుత పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరుగుతున్న ఉల్లిపాయల ధరలను అరికట్టడానికి కేంద్రం మరింత జోక్యం చేసుకోవాలనే వాదనలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment