రోడ్డుపై ఆరబోసిన ధాన్యం
నేలకొండపల్లి: రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ఏర్పాటు చేసిన ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ), వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సొసైటీ) కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు ఇబ్బందిగా మారాయి. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 70,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. దోమపోటుతో చాలావరకు వడ్లు తాలుగా మారాయి. ఎకరానికి 30క్వింటాళ్ల దిగుబడి కూడా రావట్లేదు. జిల్లాలో 83 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేశారు. చేతికొచ్చిన పంట విక్రయించే సమయంలో కేంద్రాల వద్ద నిబంధనల కొర్రీలతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా 67, ఐకేపీ సంఘాల ద్వారా 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ–గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1770, బీ–గ్రేడ్‌కు రూ.1750 చెల్లించాలి. అయితే ఈ మద్దతు ధర అందరికీ అందట్లేదు. గింజ రంగు మారిందని, తేమ ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబెట్టాలని..కేంద్రాల్లో కాంటాలు పెట్టకపోవడంతో రైతులు గత్యంతరం లేక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
ఐకేపీ, సొసైటీల కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు లేవు. ఇక్కడ టార్పాలిన్లు ఉంచలేదు. వడ్లను ఆరబోసేందుకు స్థలం లేదు. రైతులు రోడ్ల వెంట ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. కనీసం పట్టాలు కూడా సరఫరా చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు పెట్టుబడి పెరిగింది. ఎకరానికి రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు వెచ్చించారు. దిగుబడి చూస్తే 30క్వింటాళ్లు కూడా రాలేదు. విక్రయించేందుకు ధాన్యాన్ని తీసుకొస్తే నిబంధనల పేర ఆపేస్తున్నారని అంటున్నారు. పైగా రూ.1770 మద్దతు ధర సరిపోదని చెబుతున్నారు. నిల్వ ఉంచితే మరింత ధర పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చని కొందరు ఇళ్లకు తరలిస్తున్నారు. కనీసం క్వింటాకు రూ.2 వేలు వచ్చే వరకు ఆపేస్తామని పలువురు రైతులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment