Rice farmers
-
‘ప్రకృతి’ వరి దుబ్బుకు 55 పిలకలు!
వరి సాగు చేసే పొలాల్లో కొందరు రైతులు భూసారం పెంపుదలకు పచ్చి రొట్ట ఎరువులు సాగు చేస్తుంటారు. పప్పు జాతి జనుము, జీలుగ, పిల్లిపెసర వంటి ఒకటి, రెండు రకాల పచ్చి రొట్ట పంటలను సాగు చేసి రొటవేటర్‌తో పొలంలో కలియదున్నుతారు. అది కుళ్లిన తర్వాత ఆ పొలంలో వరి సాగుకు ఉపక్రమిస్తుంటారు. అయితే, గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలోని కంచర్లపాలెం గ్రామ కౌలు రైతు జి.విజయకుమారి ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం తోడ్పాటుతో మరింత విభిన్నమైన ప్రయోగాన్ని చేపట్టి అద్భుత ఫలితం సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎకరం మాగాణిలో, ఖరీఫ్‌కు ముందు, వర్షాల రాకకు ముందే మే నెలలో, పచ్చిరొట్ట పంటలు వేశారు (దీన్నే ‘ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ – పీఎండీఎస్’ పద్ధతి అంటున్నారు). అందరిలా ఒక రకానికే పరిమితం కాలేదామె. ఏకంగా 18 రకాల పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలను కలిపి చల్లారు. భూమిలో ఎకరానికి మొదట 200 కిలోల ఘనజీవామృతం, ఆముదం పిండి వేసి కలియదున్ని విత్తనాలు వేశారు. పెరిగిన పచ్చి రొట్ట పైర్లను కూడా అందరిలా రొటవేటర్‌తో భూమిలో కలియ దున్న లేదు. కోసి పశుగ్రాసంగా వినియోగించారు. ఆ పంటల మోళ్లను, వేర్లను తీసెయ్యకుండా అలాగే వదిలేశారు. మళ్లీ దుక్కి దున్నకుండా లేదా దమ్ము చేయకుండానే.. ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం చల్లి వరి సాగుకు ఉపక్రమించారు. ఎదిగిన 18 రకాల పచ్చిరొట్ట పైరు, తాళ్లు పట్టి వరుసలుగా నాటిన వరి పంట తాళ్ల సహాయంతో నేలపై చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ ఎంటీయూ–1262 వరి విత్తనాలను వరుసలుగా మనుషులతో నాటించారు. 10 రోజులకోసారి ఎకరానికి మునగాకు కలిపిన 200 లీటర్ల ద్రవ జీవామృతాన్ని భూమికి అందించడమే కాకుండా పైరుపైన చల్లుతున్నారు. నాము తెగులు కనిపిస్తే వావిలాకు కషాయం రెండు సార్లు పిచికారీ చేశారు. అంతే. తొంభై రోజులు తిరిగే సరికి 55–59 వరకు పిలకలు కలిగిన వరి దుబ్బులను గ్రామస్తులు అబ్బురంగా చూస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్, ప్రకృతి వ్యవసాయ విభాగం గుంటూరు జిల్లా ప్రాజెక్టు మేనేజరు కె.రాజకుమారి ఈ వరి పొలాన్ని ఇటీవల స్వయంగా పరిశీలించి సంతోషాన్ని వ్యక్తపరిచారు. సమీపంలో రసాయన ఎరువులతో సాగయ్యే వరి పొలంతో పోల్చి చూడగా.. రెండు సాగు పద్ధతుల మధ్య ఎంతో వ్యత్యాసం కనిపించింది. విజయకుమారి పొలంలో ఎకరానికి 45–50 బస్తాల దిగుబడి వస్తుందన్న అంచనాకొచ్చారు. ఎక్కువ రకాల పచ్చిరొట్ట పంటలు వేయటం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి వైవిధ్యం పెరిగి భూసారం పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిని దున్నకుండా వరి విత్తనాలు నాటించడం, ఘన, ద్రవ జీవామృతం వాడటం వల్ల వరికి పుష్కలంగా అన్ని రకాల పోషకాలు అందుతున్నాయని అంటున్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి అంతా ఆశ్చర్యంగా చూశారు! జనుము, జీలుగ, పిల్లిపెసర సహా 18 రకాల విత్తనాలను కలిపి పచ్చి రొట్ట పైరుగా వర్షాలకు ముందే చల్లినపుడు రైతులంతా ఆశ్చర్యంగా చూశారు. పచ్చిరొట్ట పైరును కలియదున్న లేదు. కోసి పశుగ్రాసంగా వాడాం. మోళ్లను అలాగే వదిలేశాం. మళ్లీ దుక్కి చెయ్య లేదు. దమ్ము చెయ్య లేదు. తాడు పట్టి చిన్న చిన్న గుంతలు తీసి వరి విత్తనాలను మనుషులతో నాటించాను. పైరుకు ఎకరానికి 600 కిలోల ఘనజీవామృతంతోపాటు ప్రతి పది రోజులకు జీవామృతం అందించాను. రెండుసార్లు వావిలాకు కషాయం చల్లాను. వరి పైరు బలంగా పెరిగింది. ఆకర్షణీయంగా ఉంది. తొంభై రోజుల్లో 55–59 వరకు పిలకలు వచ్చాయి. 45–50 బస్తాల దిగుబడి వస్తుందని రైతులే చెబుతున్నారు. – జి.విజయకుమారి (91211 47694), మహిళా కౌలు రైతు, కంచర్లపాలెం, గుంటూరు జిల్లా పీఎండీఎస్ గొప్ప ప్రయోగం ప్రపంచంలోనే ప్రప్రథమంగా గత రెండేళ్లుగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) పద్ధతిని ప్రకృతి వ్యవసాయంలో రైతులతో అమలు చేయిస్తు్తన్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో పీఎండీఎస్ విధానంలో 92 వేల రైతులు రకరకాల పంటలు సాగు చేస్తున్నారు. మే నెలలోనే 18 రకాల పచ్చి రొట్ట పంటలు వేసినా ఘనజీవామృతం గాలిలోని తేమను ఆకర్షించటం వల్ల పంటలు పెరగటం విశేషం. పచ్చిరొట్టను భూమిలో కలియదున్నకుండా, మోళ్లను అలాగే ఉంచి భూమిని మళ్లీ దుక్కి చేసి కదిలించకుండా, వరి విత్తనాలను లైన్ సోయింగ్ పద్ధతిలో నాటించటం విజయకుమారి చేసిన గొప్ప ప్రయోగం. మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పీఎండీఎస్‌ను మరో 700 గ్రామాలకు విస్తరించనున్నాం. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్‌ఛైర్మన్, ఏపీ రైతు సాధికార సంస్థ ‘ప్రకృతి సేద్యం –మూలసూత్రాలు, ఆచరణ’పై శిక్షణ ప్రకృతి వ్యవసాయం మూలసూత్రాలు, ఆచరణాత్మక పద్ధతులపై ప్రసిద్ధ శాస్త్రవేత్తలు డా. దేబల్ దేవ్, ప్రొ. స్టీఫెన్ గ్లియెస్మాన్ నవంబర్ 2 నుంచి 8 వరకు ఒడిశా రాయగడ జిల్లా కెరాండిగుడలోని బసుధ సంస్థ పరిశోధనా క్షేత్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం పుట్టుపూర్వోత్తరాలు, మిశ్రమ పంటల సాగు, పంటల మార్పిడి, కలిసి పెరిగే పంటలు, అటవీ జాతి చెట్ల మధ్యలో పంటల సాగు, బహుళ అంతస్థుల ఇంటిపంటల సాగు, దేశీ వరి వంగడాల పరిరక్షణ, శ్రీవరి సాగు, ప్రకృతిసిద్ధంగా కలుపును అదుపు చేయటం, రసాయన రహిత వ్యవసాయంలో పంటల జీవవైవిధ్యం పాత్ర తదితర అంశాలపై అభ్యర్థులకు ఆంగ్లంలో లోతైన అవగాహన కల్పిస్తారు. ఆసక్తి గలవారు ఈ నెల 12 లోగా తమ పూర్తి వివరాలతోపాటు ధరఖాస్తు పంపాలి. బసుధ సంస్థ నిర్వాహకులు పరిశీలన అనంతరం శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు సమాచారం పంపుతారు. ఆ తర్వాత రూ. 16,000 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు.. ఫోన్ నంబర్: 98538 61558/94326 74377 11న రబీలో వరి, కూరగాయల ప్రకృతి సాగుపై శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ విధానంలో రబీలో వరి, కూరగాయల సాగుపై రైతునేస్తం ఫౌండేషన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర్లోని కొర్నెపాడులో రైతులకు ఈ నెల 11(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నారు. గుంటూరు జిలా అత్తోటకు చెందిన ప్రకృతి వ్యవసాయదారుడు బాపన్న, రాజుపాలెం రైతు శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. దేశీ వరి రకాల సాగు, కషాయాలు, ద్రావణాల తయారీపై కూడా శిక్షణ ఇస్తారు. కొవిడ్ నేపథ్యంలో 40 మందిని మాత్రమే శిక్షణకు అనుమతిస్తారు. రిజిస్ట్రేషన్ వివరాలకు.. 97053 83666, 0863–2286255. -
ధాన్యం..దైన్యం
నేలకొండపల్లి: రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు ఏర్పాటు చేసిన ఇందిరాక్రాంతి పథం (ఐకేపీ), వ్యవసాయ సహకార పరపతి సంఘాల (సొసైటీ) కొనుగోలు కేంద్రాల్లో నిబంధనలు ఇబ్బందిగా మారాయి. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో 70,500 హెక్టార్లలో వరి సాగు చేశారు. దోమపోటుతో చాలావరకు వడ్లు తాలుగా మారాయి. ఎకరానికి 30క్వింటాళ్ల దిగుబడి కూడా రావట్లేదు. జిల్లాలో 83 ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేశారు. చేతికొచ్చిన పంట విక్రయించే సమయంలో కేంద్రాల వద్ద నిబంధనల కొర్రీలతో రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా 67, ఐకేపీ సంఘాల ద్వారా 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ–గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1770, బీ–గ్రేడ్‌కు రూ.1750 చెల్లించాలి. అయితే ఈ మద్దతు ధర అందరికీ అందట్లేదు. గింజ రంగు మారిందని, తేమ ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబెట్టాలని..కేంద్రాల్లో కాంటాలు పెట్టకపోవడంతో రైతులు గత్యంతరం లేక వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఐకేపీ, సొసైటీల కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాలు లేవు. ఇక్కడ టార్పాలిన్లు ఉంచలేదు. వడ్లను ఆరబోసేందుకు స్థలం లేదు. రైతులు రోడ్ల వెంట ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. కనీసం పట్టాలు కూడా సరఫరా చేయకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు పెట్టుబడి పెరిగింది. ఎకరానికి రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు వెచ్చించారు. దిగుబడి చూస్తే 30క్వింటాళ్లు కూడా రాలేదు. విక్రయించేందుకు ధాన్యాన్ని తీసుకొస్తే నిబంధనల పేర ఆపేస్తున్నారని అంటున్నారు. పైగా రూ.1770 మద్దతు ధర సరిపోదని చెబుతున్నారు. నిల్వ ఉంచితే మరింత ధర పెరిగిన తర్వాత అమ్ముకోవచ్చని కొందరు ఇళ్లకు తరలిస్తున్నారు. కనీసం క్వింటాకు రూ.2 వేలు వచ్చే వరకు ఆపేస్తామని పలువురు రైతులు చెబుతున్నారు. -
వరి మద్దతు రూ.50 పెంపు!
- రాగికి క్వింటాల్‌కు రూ.100, వేరుశనగకు రూ.30 పెంపు - కేంద్రానికి సీఏసీపీ సిఫార్సులు న్యూఢిల్లీ: వరి రైతులకు శుభవార్త. వరి కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను క్వింటాల్‌కు రూ.50 పెంచాలని కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ ప్రతిపాదించింది. దీంతో వరి ఎంఎస్పీ రూ.1,410కి చేరనుంది. అలాగే రాగికి క్వింటాల్‌కు రూ.100 పెంచి రూ.1,650 చేయాలని, వేరుశనగకు రూ. 30 పెంచి రూ.4,030 చేయాలని వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ (సీఏసీపీ) కేంద్ర వ్యవసాయ శాఖకు సిఫార్సు చేసింది. కమిషన్ 2015-16 ఖరీఫ్ సీజన్‌కు పలు పంటల మద్దతు ధరలను ప్రతిపాదించింది. కమిషన్ ప్రతిపాదనలపై కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను, వివిధ విభాగాలను సంపద్రించి వారి అభిప్రాయాలను సేకరిస్తోందని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. తదనంతరం తుది ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ అనుమతికి పంపుతారన్నారు. ప్రస్తుత 2014-15 (జూలై-జూన్)లో 103.04 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తవుతాయని అంచనా కాగా, గత ఏడాదిలో 106.65 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యాయి. కాగా, 2014-15లో వరికి క్వింటాల్‌కు రూ.50 పెంచారు. బీమా తీసుకున్న రైతులు 20 శాతమే.. భారత్‌లో పంట బీమా తీసుకున్న రైతులు 20 శాతానికి తక్కువగానే ఉన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 19 శాతం మంది రైతులు మాత్రమే వారు పండించే పంటకు బీమా తీసుకున్నట్లు అసోచామ్, స్కైమెట్ వెదర్ల సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం.. దాదాపు 81 శాతం మంది రైతులకు పంట బీమా తీసుకోలేదు. దేశవ్యాప్తంగా పంట బీమా తీసుకున్న వారి సంఖ్య 3.2 కోట్లు. రైతులు పంట బీమా తీసుకోకపోవడానికి క్లెయిమ్ సెటిల్మెంట్ జాప్యాలే కారణం. -
వర్రి
అనంతపురం సెంట్రల్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా రైతులు దళారులను ఆశ్రయించి నిలువునా మోసపోతున్నారు. ముఖ్యంగా వరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం ప్రభుత్వం వరికి మద్దతు ధర ప్రకటించింది. ఏ గ్రేడ్ వరి క్వింటా ధర రూ. 1400, సాధారణ రకం 1360గా నిర్ణయించింది. అరుుతే ఇక్కడి అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతుకు ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. సివిల్సప్లై, వెలుగు ప్రాజెక్టు అధికారుల నిర్వాకం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది. అరుుతే అక్కడక్కడ నీటి వసతి ఉన్న రైతులు, తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) కింద మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వరి సాగైంది. హెచ్చెల్సీ కింద 95,196 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో 40,709 ఎకరాల్లో వరి, 54,487 ఎకరాల్లో ఇతర ఆరుతడి పంటలు సాగు చేశారు. బోరు బావుల కింద 15 వేల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. పూర్తి కరువు పరిస్థితులు నెలకొన్నా హెచ్చెల్సీ పుణ్యమా అని రైతులకు ధాన్యం గింజలు పండించుకుంటున్నారు. ఈ ఏడాది హెచ్చెల్సీకి ఆలస్యంగా నీరు రావడంతో దిగుబడులు బాగా తగ్గాయి. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో నెల ఆలస్యంగా తుంగభద్ర జలాశయంలోకి నీరు వచ్చి చేరింది. దీంతో పంటలు సాగు కూడా ఆలస్యమైంది. ప్రతి ఏటా ఈ సమయానికి వరి కోతలు ఎప్పుడో పూర్తరుు్య ఉండేవి. ఈ ఏడాది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముందస్తుగా నీరు విడుదలైన తుంగభద్ర హైలెవల్ మెయిన్ కెనాల్(హెచ్‌ఎల్‌ఎంసీ) కింద కణేకల్లు, బొమ్మనహాల్ తదితర ప్రాంతాల్లో, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, సౌత్‌కెనాల్ కింద వరి అత్యధికంగా సాగైంది. ఇక్కడ వరికోతలు దాదాపు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే పండించిన పంట చేతికందుతోందన్న సంబరం రైతుల్లో కనిపించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా అది ఆచరణలో రైతులకు దక్కడం లేదు. జిల్లాలో ప్రతి ఏటా కణేకల్లు, కళ్యాణదుర్గం, కల్లూరు, బొమ్మనహాళ్, ధర్మవరం, కుండిమద్ది, కేసాపురం తదితర ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. ఈ ఏడాది ఒక్క కణేకల్లులో తప్ప ఎక్కడా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఫలితంగా మిగిలిన ప్రాంతాల్లో రైతులు పంటను దళారులు, ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు అడిగిన ధరకు బేరం ఆడకుండా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా బహిరంగ మార్కెట్లో రేట్లు నిలకడగా ఉంటారుు. తద్వారా రైతుకు కూడా నష్టం కలగదు.