వర్రి
అనంతపురం సెంట్రల్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా రైతులు దళారులను ఆశ్రయించి నిలువునా మోసపోతున్నారు.
ముఖ్యంగా వరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం ప్రభుత్వం వరికి మద్దతు ధర ప్రకటించింది. ఏ గ్రేడ్ వరి క్వింటా ధర రూ. 1400, సాధారణ రకం 1360గా నిర్ణయించింది. అరుుతే ఇక్కడి అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతుకు ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. సివిల్‌సప్లై, వెలుగు ప్రాజెక్టు అధికారుల నిర్వాకం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది.
అరుుతే అక్కడక్కడ నీటి వసతి ఉన్న రైతులు, తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) కింద మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వరి సాగైంది. హెచ్చెల్సీ కింద 95,196 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో 40,709 ఎకరాల్లో వరి, 54,487 ఎకరాల్లో ఇతర ఆరుతడి పంటలు సాగు చేశారు. బోరు బావుల కింద 15 వేల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది.
పూర్తి కరువు పరిస్థితులు నెలకొన్నా హెచ్చెల్సీ పుణ్యమా అని రైతులకు ధాన్యం గింజలు పండించుకుంటున్నారు. ఈ ఏడాది హెచ్చెల్సీకి ఆలస్యంగా నీరు రావడంతో దిగుబడులు బాగా తగ్గాయి. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో నెల ఆలస్యంగా తుంగభద్ర జలాశయంలోకి నీరు వచ్చి చేరింది. దీంతో పంటలు సాగు కూడా ఆలస్యమైంది. ప్రతి ఏటా ఈ సమయానికి వరి కోతలు ఎప్పుడో పూర్తరుు్య ఉండేవి. ఈ ఏడాది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ముందస్తుగా నీరు విడుదలైన తుంగభద్ర హైలెవల్ మెయిన్ కెనాల్(హెచ్‌ఎల్‌ఎంసీ) కింద కణేకల్లు, బొమ్మనహాల్ తదితర ప్రాంతాల్లో, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, సౌత్‌కెనాల్ కింద వరి అత్యధికంగా సాగైంది. ఇక్కడ వరికోతలు దాదాపు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే పండించిన పంట చేతికందుతోందన్న సంబరం రైతుల్లో కనిపించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా అది ఆచరణలో రైతులకు దక్కడం లేదు. జిల్లాలో ప్రతి ఏటా కణేకల్లు, కళ్యాణదుర్గం, కల్లూరు, బొమ్మనహాళ్, ధర్మవరం, కుండిమద్ది, కేసాపురం తదితర ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి.
ఈ ఏడాది ఒక్క కణేకల్లులో తప్ప ఎక్కడా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఫలితంగా మిగిలిన ప్రాంతాల్లో రైతులు పంటను దళారులు, ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు అడిగిన ధరకు బేరం ఆడకుండా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా బహిరంగ మార్కెట్‌లో రేట్లు నిలకడగా ఉంటారుు. తద్వారా రైతుకు కూడా నష్టం కలగదు.