సాక్షి, అమరావతి : అన్నదాతలకు విత్తు నుంచి విక్రయం వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. ఇందుకు గ్రామాల్లోనే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు, క్షేత్రం వద్దే ధాన్యం కొనుగోళ్లు ఇలా అన్ని విధాలా భరోసా కల్పిస్తోంది. దళారులు, వ్యాపారుల జోక్యం లేకుండా రైతుల పంట ఉత్పత్తులకు మద్దతు ధరలు లభించేలా చేస్తోంది.
ధరలు తగ్గిన ప్రతిసారీ రైతులు నష్టపోకుండా మార్కెట్లో జోక్యం చేసుకుంటూ మంచి ధరకే రైతులు తమ ఉత్పత్తులు విక్రయించుకునేలా చర్యలు చేపడుతోంది. స్వయంగా ప్రభుత్వమే కొనుగోలుకు ముందుకు వస్తుండటంతో వ్యాపారులు సైతం పోటీకి వస్తున్నారు. దీంతో రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తోంది. ధరలు పడిపోతే స్థిరీకరించడానికి రూ.3 వేల కోట్లతో నిధిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఇవేమీ చేయలేదు. అయినా అప్పుడు కళ్లు లేని కబోదిలా వ్యవహరించిన ఈనాడు రామోజీరావు ఇప్పుడు రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తున్నప్పటికీ తనదైన శైలిలో విషం చిమ్మటమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే ‘రైతులకు ఇదేనా మద్దతు’ అంటూ ఒక విష కథనాన్ని వండివార్చారు. దీనిపై నిజనిజాలివే..
బాసటగా నిలవాలనే..
రైతులు తమ పంట ఉత్పత్తులను దారుణ పరిస్థితుల్లో తక్కువకు అమ్ముకోరాదన్న ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పంటలకు గిట్టుబాటు ధరలను ప్రకటించింది. సహజంగా పంటలకయ్యే పెట్టుబడి–రాబడి ఆధారంగా వ్యవసాయ ఖర్చులు–ధరల కమిషన్ సిఫార్సు మేరకు కేంద్రం మద్దతు ధరలు ప్రకటిస్తుంది. అయితే కనీస మద్దతు ధరలను ప్రకటించని పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో ధరలు పతనమైనప్పుడు గతంలో ఆదుకున్న దాఖలాలుండేవి కావు.
అలాంటి పంటలు వేసే రైతులకూ గిట్టుబాటు ధర దక్కాలన్న ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చీ రాగానే రాష్ట్రంలో ఎక్కువగా సాగయ్యే ఆరు ప్రధాన పంటలకు గతంలో ఎన్నడూ లేని విధంగా గిట్టుబాటు ధరలు ప్రకటించింది. అంతకన్నా ఎక్కువ ధర పలికితే రైతులు దర్జాగా మార్కెట్లోనే విక్రయించుకుంటారు.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
కానీ అనుకోని విపత్కర పరిస్థితులు తలెత్తి మార్కెట్లో ధరలు పడిపోతే వారిని ఆదుకోవడానికి ఈ ధరలు బెంచ్‌మార్క్‌గా ఉపయోగపడతాయనేది ప్రభుత్వ ఆలోచన. కాబట్టి బయట ఎవరూ ప్రభుత్వం నిర్దేశించిన ధరకంటే తక్కువకు రైతు నుంచి కొనే సాహసం చేయరు. అయితే ఇలాంటి మంచి ఉద్దేశంతో పెట్టిన ధరపైన కూడా వక్రభాష్యం చెప్పడం ‘ఈనాడు’కే చెల్లింది.
ఆరోపణ: కొన్ని పంటలకే మద్దతు ధరలు
వాస్తవం: కేంద్రం మద్దతు ధరలు ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి, చిరుధాన్యాలు, అరటి, బత్తాయి పంటలకు దేశంలోనే తొలిసారి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించింది. కొన్ని పంటలకే మద్దతు ధర ప్రకటించారని విమర్శిస్తున్న రామోజీ.. చంద్రబాబు తన హయాంలో ఒక్క పంటకు కూడా మద్దతు ధర ప్రకటించకపోయినా ఎందుకు ప్రశ్నించలేదు? దీనిపై తన పత్రిక ఈనాడులో ఏనాడూ చిన్న వార్త రాసిన పాపాన పోలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చీ రాగానే రాష్ట్రంలో విస్తారంగా సాగయ్యే మిరప, పసుపు, అరటి, బత్తాయి, ఉల్లితో పాటు చిరు ధాన్యాలకు సైతం గిట్టుబాటు ధరలను ప్రకటించడమే కాదు.. మార్కెట్‌లో ధర దక్కని ప్రతిసారీ అండగా నిలుస్తోంది.
ఆరోపణ: మొక్కుబడి కొనుగోలు
వాస్తవం: ధరల స్థిరీకరణ కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. నిర్దేశిత పంటలకు ఒకవేళ ధర పడిపోతే.. మార్కెట్‌లో జోక్యం చేసుకుని ఈ నిధి సాయంతో వాటిని కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుంది. సీఎం యాప్ ద్వారా రోజూ గ్రామ స్థాయిలో మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తూ.. ధరలు పడిపోయిన వెంటనే రంగంలోకి దిగుతోంది. ఇలా పొగాకుతో సహా ప్రధాన వ్యవసాయ, వాణిజ్య పంటల ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్‌లో జోక్యం చేసుకుని మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ప్రస్తుత సీజన్‌లో మార్కెట్‌లో మద్దతు ధర దక్కని శనగలు, మొక్కజొన్న, పసుపును మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొంటోంది.
28,112 మంది రైతుల నుంచి రూ.336.83 కోట్ల విలువైన 63,135 టన్నుల శనగలు, 9,027 మంది రైతుల నుంచి రూ.148.88 కోట్ల విలువైన 72,315.85 టన్నుల మొక్కజొన్న, 312 మంది రైతుల నుంచి 413 టన్నుల పసుపు కొనుగోలు చేసింది. ఇలా ఇప్పటి వరకు రూ.7,712 కోట్ల విలువైన 21.55 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మరోవైపు టీడీపీ ఐదేళ్ల పాలనలో కొనుగోలు చేసింది.. అన్నీ కలిపి కేవలం రూ.3,322 కోట్ల విలువైన 9 లక్షల టన్నుల ఉత్పత్తులు మాత్రమే.
అంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉత్పత్తులు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని అర్థమవుతోంది. కనీసం ధాన్యం రైతులకైనా చంద్రబాబు మేలు చేశాడా అంటే.. అదీ లేదు. ఐదేళ్లలో ధాన్యం కొనుగోలు కోసం చంద్రబాబు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం రూ.40,236.91 కోట్లయితే... ఈ నాలుగేళ్లలోనే జగన్ ప్రభుత్వం వెచ్చించిన మొత్తం ఏకంగా రూ.58,626.88 కోట్లు. దీన్ని మొక్కుబడి కొనుగోలు, నామమాత్రపు కొనుగోలు అంటారా.. రామోజీ?
ఆరోపణ: చిరుధాన్యాలపై చిత్తశుద్ధి ఏదీ?
వాస్తవం: చిరుధాన్యాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులకు పెద్ద ఎత్తున రాయితీలను అందిస్తోంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా క్వింటాకు రూ.2,500 చొప్పున ప్రకటించింది. వాస్తవానికి ఈ పంటల సాగు రాష్ట్రంలో చాలా తక్కువ. అయినా వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కనీస మద్దతు ధరలతో సంబంధం లేకుండా బహుళ జాతి సంస్థలే పోటీç³డి క్వింటా రూ.4 వేలకుపైగా చెల్లించి పొలాల నుంచే కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది 3.80 లక్షల ఎకరాల్లో సాగుచేయాలన్న లక్ష్యంతో ఆర్బీకేల స్థాయిలో ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది.
ఆరోపణ: ఈ ధరలకు అమ్ముకుంటే రైతులు గల్లంతే..
వాస్తవం: మిర్చి పంటకు ప్రభుత్వం క్వింటా రూ.7 వేలు కనీస మద్దతు ధర ప్రకటించింది. వాస్తవానికి రాష్ట్రంలో మిరప సాధారణ విస్తీర్ణం 5 లక్షల ఎకరాలు కాగా, 2021–22లో 5.62 లక్షల ఎకరాలు, 2022–23లో 5.77 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 6 లక్షల ఎకరాలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఓ వైపు తామర ప్రభావం పూర్తిగా సమసిపోనప్పటికీ మిరప సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గుంటూరు యార్డులో క్వింటా రూ.30 వేలు, వరంగల్ యార్డులో రూ.50 వేలకు పైగా ధర పలకడమే ఇందుకు కారణం.
వాస్తవం ఇలా ఉంటే రైతులేదో క్వింటా రూ.7 వేలకే అమ్ముకుని నష్టపోతున్నట్టుగా విషప్రచారం చేస్తుండడం ‘ఈనాడు’కే చెల్లింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా ప్రస్తుతం ఎమ్మెస్పీ ధరల కంటే మిన్నగా మిరప, పత్తి, వేరుశనగ, మినుము, పంటలకు మార్కెట్‌లో ధర పలుకుతోంది. ధరలు పడిపోయినప్పుడు గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఈ రకమైన భరోసా ఇవ్వడంతో మార్కెట్లో ధరలు స్థిరపడ్డాయి. విశేషమేంటంటే ధరల స్థిరీకరణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, మార్కెట్ జోక్యంతో చేసిన కొనుగోళ్లు కానీ ఎన్నడూ రామోజీకి కనిపించలేదు.
పెట్టుబడి పెరిగిందని వాదిస్తున్న రామోజీ అదే సమయంలో రైతుకు ఏటా వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.13,500 చొప్పున ఇస్తోన్న పెట్టుబడి సాయాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రమే కొన్ని పంటలకు ధరలు నిర్ణయించినప్పుడు దేశంలో ఏ రాష్ట్రం చేయని పనిచేశారంటూ ‘ఈనాడు’ ప్రశంసించనూ లేదు. రైతుల్ని ఆదుకోవటానికి ఉదారంగా వ్యవహరించారంటూ ఒక్క అక్షరమూ రాయలేదు. ఇప్పుడు మాత్రం ఆ ధరలను కేంద్రం మాదిరిగా పెంచడం లేదంటూ వాపోతుండడం విస్మయానికి గురిచేస్తోంది.
ప్రభుత్వానిదే ‘జీఎల్టీ’ భారం
రైతుల ప్రయోజనార్థం ఆర్బీకేలను కొనుగోలు కేంద్రాలుగా గుర్తించడమే కాదు.. రైతు పొలం నుంచే నేరుగా పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అందుకయ్యే జీఎల్టీ (గన్నీ బ్యాగ్‌లు, కూలీలు, రవాణా) ఖర్చులను సైతం ప్రభుత్వమే భరిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో టన్నుకు రూ.2,523 చొప్పున (గోనె సంచులకు రూ.1,750, కూలీలకు రూ.220, రవాణా చార్జీలు రూ.468లతో పాటు ఒకసారి వాడిన గోనె సంచులకు రూ.85) చెల్లిస్తుండగా, ఇతర పంట ఉత్పత్తుల సేకరణ సందర్భంలో క్వింటాకు రూ.418 చొప్పున భరిస్తోంది.
ఇటీవలే మార్కెట్‌లో ధర పడిపోవడంతో మొక్కజొన్న క్వింటా కనీస మద్దతు ధర రూ.1,962 చొప్పున కొనుగోలు చేసింది. కానీ రైతులకు క్వింటాకు రూ.2,370 చొప్పున చెల్లించింది. పైగా గన్నీ బ్యాగ్స్, లోడింగ్, అన్‌లోడింగ్, రవాణా చార్జీల కోసం ఈ అదనపు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేసింది. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రైతులను ఇలా ఆదుకున్న సందర్భమే లేదు. అయినా రామోజీకి ఒక్క అక్షరం రాస్తే ఒట్టు.
Comments
Please login to add a commentAdd a comment