Middle men
-
మద్దతు మాటే మరిచారు
భూమి మనదే... కష్టం మనదే... దానిపై పండే పంటకు మద్దతుధర మాత్రం మనది కాదు. ఎక్కడో నాలుగు గోడల మధ్య అధికారులే నిర్ణయిస్తారు. అదైనా క్షేత్రస్థాయిలో అమలవుతుందా అంటే దానికీ లేనిపోని సాంకేతిక కారణాలు చూపి వర్తింపజేయట్లేదు. ఏటా సాగు వ్యయం పెరుగుతోంది. ఎరువులు... విత్తనాలు... పురుగుమందుల ధరలతోపాటు కూలిమొత్తాలూ పెరుగుతున్నాయి. కానీ పండించిన పంటకు ఆ స్థాయిలో ధర నిర్థారించకపోవడమే ఇక్కడున్న సమస్య. ఫలితం ఏటా రైతాంగం అప్పుల్లో కూరుకుపోతోంది. వారి కష్టం మట్టిపాలవుతోంది. గరుగుబిల్లి(కురుపాం): దేశానికి రైతే వెన్నెముక అంటారు. వారిని ఆదుకోవడమే తమ ప్రధాన కర్తవ్యం అంటారు. కానీ వారు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించరు. ప్రకృతి విపత్తులవల్లో... మరే కారణాలవల్లో పంట నష్టపోతే కనీసం పరిహారం న్యాయబద్ధంగా అందించరు. అలా రైతు వెన్ను విరిచేస్తున్నారు. ఆరుగాలం కష్టించి... ఎన్నో సమస్యలకు ఎదురీది... ఎలాగోలా పండించిన పంటకు మద్దతు ధర పెంచాలని వేడుకుంటున్నా సర్కారు మా త్రం చేతులు విదల్చడం లేదు. ఈ ఏడాదైనా మద్దతుధర పెరుగుతుందని ఆశగా ఎదురుచూసే అన్నదాతకు తీవ్ర నిరాశే మిగిలింది. క్వింటాలుకు రూ.200లు మాత్రమే పెంచి చేతులు దులుపు కున్నారు. అమలు కాని ఎన్నికల హామీలు 2014 ఎన్నికల్లో రైతులు పండించే పంట ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనంగా చెల్లిస్తామని తెలు గుదేశం నాయకులు హామీలు గుప్పించారు. వరి పంట ఉత్పత్తి చేసేందుకు క్వింటాలుకు రూ.2వేల వరకు వ్యయం అవుతుందని ప్రభుత్వం చెబుతున్న లెక్క. కానీ ప్రభుత్వమే కేవలం రూ.1,770లుగా మద్దతు ధర నిర్ణయించి విశేషం. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా రైతుకు క్వింటాలుకు రూ.300వరకు నష్టం వస్తోంది. ఉత్పత్తి వ్యయంకన్నా 50 శాతం పెంచడం అటుంచితే పెట్టిన వ్యయం కూడా తిరిగిరాని పరిస్థితి నెలకొంది. వరికి కనీస మద్దతుధర క్వింటాలుకు రూ.2,800లు ఉంచాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నా పట్టించుకోనే నాథుడే కరువయ్యారు. ’రైతులను పట్టించుకోని ప్రభుత్వం ధాన్యం మద్దతు« ధరన పెంచాలని రైతులు, సంఘాలుచేసిన పోరాటాలు ప్రభుతాన్ని కదిలించలేకపోతున్నాయి. కంటితుడుపుగా మద్దతు ధరను ప్రకటించి ప్రభుత్వాలు మమ అనిపించాయి. ఎరువుల ధరలను పెంచిన ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచకపోవడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీల ధరలు రెట్టింపు అవడంతో పెట్టుబడులకోసం అధిక వడ్డీలకు అప్పుచేయాల్సి వస్తోంది. ఇంత జరిగినా ప్రకృతి సహకరించకపోతే ఆశించిన దిగుబడి కూడా రావడం లేదు. తీరా వచ్చిన పంటను సైతం గిట్టుబాటు ధరకు అమ్ముకోలేకపోతున్నారు. దళారీల దందా ప్రభుత్వం తరఫున సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆర్థిక అవసరాల నిమిత్తం రైతులు ముందుగా కళ్లాల్లో వాలిపోతున్న ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. వారు ప్రభుత్వ ధరతో నిమిత్తం లేకుండా వారు తమ ఇష్టానుసారం రేటు నిర్ణయించి రైతాంగాన్ని దోచుకుంటున్నారు. పల్లెల్లో సాగుతున్న ఈ దందాను అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక సాగు చేయడమంటేనే భయంగా మారి సాగుకు విరామం ప్రకటించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన సర్వత్రా వినిపిస్తోంది. రైతు వ్యతిరేక ప్రభుత్వాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకులుగా ముద్రవేసుకున్నాయి. ఇన్నేళ్లలో ఏ ప్రభుత్వం కూడా రైతుల కష్టాలను పట్టించుకున్న పాపాన పోలేదు. వరికి కనీసం రూ.2,500 మద్దతు ధరవుంటే రైతుకు నష్టాలు తగ్గుతాయి. ప్రభుత్వాలు రైతులపై చిన్నచూపు వల్ల తీరని అన్యాయం చేస్తున్నాయి. – గొట్టాపు త్రినాథస్వామి, కొత్తపల్లి, గరుగుబిల్లి మండలం కార్పొరేట్లకే రాయితీలు ఏటా లాభనష్టాలను ఆలోచించకుం డా సాగుచేస్తున్న అన్నదాతలకు వివిధ రకాల సాకులు చూపి కనీస మద్దతు ధర కల్పించని కేంద్రం బ డా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్లకు రకరకాల రాయితీలు కల్పిస్తోంది. కేవలం రైతుల విషయానికి వచ్చేసరికే ఆర్థిక సంక్లిష్టతలను చూపి గొంతు నొక్కేస్తోంది. ప్రభుత్వాలు రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. – కె.రవీంద్ర, సీపీఎం నాయకుడు, గరుగుబిల్లి -
వర్రి
అనంతపురం సెంట్రల్ : ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫలితంగా రైతులు దళారులను ఆశ్రయించి నిలువునా మోసపోతున్నారు. ముఖ్యంగా వరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతోంది. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం ప్రభుత్వం వరికి మద్దతు ధర ప్రకటించింది. ఏ గ్రేడ్ వరి క్వింటా ధర రూ. 1400, సాధారణ రకం 1360గా నిర్ణయించింది. అరుుతే ఇక్కడి అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో రైతుకు ఏమాత్రం ప్రయోజనం చేకూరడం లేదు. సివిల్సప్లై, వెలుగు ప్రాజెక్టు అధికారుల నిర్వాకం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటల సాగు విస్తీర్ణం పడిపోయింది. అరుుతే అక్కడక్కడ నీటి వసతి ఉన్న రైతులు, తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) కింద మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో వరి సాగైంది. హెచ్చెల్సీ కింద 95,196 హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో 40,709 ఎకరాల్లో వరి, 54,487 ఎకరాల్లో ఇతర ఆరుతడి పంటలు సాగు చేశారు. బోరు బావుల కింద 15 వేల ఎకరాల్లో వరి సాగులోకి వచ్చింది. పూర్తి కరువు పరిస్థితులు నెలకొన్నా హెచ్చెల్సీ పుణ్యమా అని రైతులకు ధాన్యం గింజలు పండించుకుంటున్నారు. ఈ ఏడాది హెచ్చెల్సీకి ఆలస్యంగా నీరు రావడంతో దిగుబడులు బాగా తగ్గాయి. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కూడా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో నెల ఆలస్యంగా తుంగభద్ర జలాశయంలోకి నీరు వచ్చి చేరింది. దీంతో పంటలు సాగు కూడా ఆలస్యమైంది. ప్రతి ఏటా ఈ సమయానికి వరి కోతలు ఎప్పుడో పూర్తరుు్య ఉండేవి. ఈ ఏడాది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ముందస్తుగా నీరు విడుదలైన తుంగభద్ర హైలెవల్ మెయిన్ కెనాల్(హెచ్ఎల్ఎంసీ) కింద కణేకల్లు, బొమ్మనహాల్ తదితర ప్రాంతాల్లో, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్, సౌత్కెనాల్ కింద వరి అత్యధికంగా సాగైంది. ఇక్కడ వరికోతలు దాదాపు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే పండించిన పంట చేతికందుతోందన్న సంబరం రైతుల్లో కనిపించడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా అది ఆచరణలో రైతులకు దక్కడం లేదు. జిల్లాలో ప్రతి ఏటా కణేకల్లు, కళ్యాణదుర్గం, కల్లూరు, బొమ్మనహాళ్, ధర్మవరం, కుండిమద్ది, కేసాపురం తదితర ప్రాంతాల్లో డ్వాక్రా సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి. ఈ ఏడాది ఒక్క కణేకల్లులో తప్ప ఎక్కడా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఫలితంగా మిగిలిన ప్రాంతాల్లో రైతులు పంటను దళారులు, ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వారు అడిగిన ధరకు బేరం ఆడకుండా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా బహిరంగ మార్కెట్లో రేట్లు నిలకడగా ఉంటారుు. తద్వారా రైతుకు కూడా నష్టం కలగదు. -
ధరలతో సామాన్యులకు దడ
- నషాలాన్ని అంటుతున్న పచ్చిమిరప ఘాటెక్కిన ఉల్లిపాయ - మార్కెట్లో వ్యాపారుల, దళారుల మాయాజాలం - నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తున్న ధరల మానిటరింగ్ కమిటీ కడప అగ్రికల్చర్ : మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూలిజనానికి ఈ ధరలు కలవరం పుట్టిస్తున్నాయి. నెల క్రితం 10-12 రూపాయాల్లోపు ధర ఉన్న కూరగాయలు నేడు రూ.20 నుంచి 60కి చేరుకున్నాయి. ధరలు రెట్టింపు అవుతుండటంతో మధ్య తరగతి కుటుంబాల వారు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి తగ్గడమే కారణం చలిగాలులు పెరగడంతో పురుగులు, తెగుళ్లు విజృంభణ ఎక్కువై కూరగాయల దిగుబడి తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. దీనికి తోడు అడుగంటిన భూగర్భజలాల వల్ల నీటి తడులు సక్రమంగా అందకపోవడంతో దిగుబడులు తగ్గాయని చెబుతున్నారు. అలాగే కూరగాయల నాణ్యత కూడా సరిగా ఉండటం లేదు. బోరుబావుల్లో నీరు రోజురోజుకు తగ్గిపోతోందని, ఈనేపథ్యంలో కొత్తగా కూరగాయల సాగు చేపట్టలేక పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ధరలు ఇలా.. ప్రధానంగా 10 రోజుల కిందట టమాట కిలో రూ.5 నుంచి రూ.10, పచ్చిమిరప రూ.12 ఉండగా నేడు రూ.24 పలుకుతోంది. వంకాయ (నాటు రకం) కిలో రూ.10 ఉండగా నేడు రూ.18, కాకర కిలో రూ.15 నుంచి రూ.20కి చేరుకుంది. చిక్కుడు కిలో 20 రూపాయల నుంచి 35 రూపాయలకు చేరుకుంది. బెండ కిలో రూ.16 నుంచి రూ. 20కు చేరింది. అలాగే క్యాబేజి కిలో రూ.18 నుంచి రూ.24 పలుకుతున్నాయి. అదే విధంగా క్యారెట్ కిలో రూ.20 నుంచి 32కి చేరింది. బంగాళదుంప కిలో రూ.20 ఉండగా నేడు రూ.30, ఉల్లిపాయలు కిలో రూ.15 పలుగా నేడు కిలో. 20-30 మధ్య ధరలున్నాయి. అలాగే బీన్స్ రూ. 20 నుంచి 36, అల్లం రూ. 48 ఉండగా ఇప్పుడు రూ.60 ధర పలుకుతున్నాయి. దళారుల మాయాజాలం.. మార్కెట్కు స్టాకు తక్కువగా చూపుతూ వ్యాపారులు, దళారులు వినియోగదారులను నిలువునా మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో 29 లక్షల మంది ప్రజలు ఉండగా రోజుకు వినియోగదారులు అన్ని రకాల కూరగాయలను కలిపి 40 టన్నుల కూరగాయలను వాడుతున్నారని అధికారుల అంచనాలు చెబుతున్నాయి. చలిగాలుల వల్ల, అడుగంటిన భూగర్భజలాల వల్ల మార్కెట్కు కూరగాయలు సరిగా రాలేదని సాకు చూపుతూ ధరలను అమాంతగా పెంచుతూ మాయాజాలం ప్రదర్శిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కూరగాయలు దొరకనందున పొరుగున ఉన్న కర్నూలు, చిత్తూరు జిల్లాలకు, పొరుగు రాష్ట్రం కర్నాటక నుంచి కూడా కూరగాయలు తెప్పిస్తున్నందున కూరగాయ ధరలు కాస్త పెరుగుతాయని వ్యాపారులు అంటున్నారు. రవాణా, కమీషన్లు, ఇతర ఖర్చులు మీద పడతాయని వాటిని ఈ ధరల్లో కలుపుతామని చెబుతున్నారు. ఈ ధరలు ఇంకాస్తా పెరుగుతాయని అంటున్నారు. -
దళారులు బాబోయ్..!
బీసీ కార్పొరేషన్లో లోన్లు ఇప్పిస్తామంటూ దళారులు సహకార సంఘాల సభ్యులను మాయ చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా రుణాలు పొందే అవకాశం ఉన్నా..ఇది తెలియని అమాయకులు వారి బుట్టలో పడుతూనే ఉన్నారు. ఈ ఏడాది రుణాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటనే చేయలేదు. అయినా బ్రోకర్లు ఈ ఏడాది లోన్లతోపాటు గతేడాది రుణాలూ ఇప్పిస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు. ఎవరికీ ఒక్క పైసా ఇవ్వాల్సిన పనిలేదని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నా కొందరు దళారుల మాయమాటలను నమ్ముతూనే ఉన్నారు. ఖమ్మం సంక్షేమ విభాగం : వెనుకబడిన తరగతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. బీసీల్లో వివిధ రకాల కులవృత్తులు, ఇతర పనులు చేసుకునేవారికి చేయూతనిచ్చేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం 50 శాతం రాయితీతో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తోంది. దీనిలో భాగంగా రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, వాల్మీకిబోయ, సాగర ఉప్పర, బట్రాజు, కృష్ణబలిజ పూసల, విశ్వబ్రాహ్మణ, మేదర, శాలివాహనకుమ్మరి అనే 10 రకాల కులాల వారు సంఘాలుగా ఏర్పడితే రుణాలు అందజేస్తారు. ఆయా కులాలకు చెందిన 11 నుంచి 15 మంది సహకార సంఘంగా ఏర్పడాలి. తరువాత ఆ సంఘం నమోదు కోసం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సదరు సహకార సంఘం మొత్తానికి కలిపి రూ.50 చెల్లించాలి. సంఘం సభ్యులందరికీ కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు మాత్రం కచ్చితంగా ఉండాలి. వీటితో పాటు బై లా వివరాలు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అనంతరం బీసీ సంక్షేమశాఖ అధికారి విచారణ నిర్వహించి నమోదు చేస్తారు. అక్కడ నమోదు అయిన సంఘం బీసీ కార్పొరేషన్లో గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు రూ.195 (డి.డి.చార్జీలతో కలిపి)రుసుం చెల్లించాలి. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి సంఘానికి గుర్తింపు పత్రం వస్తుంది. సంఘం రుణానికి అర్హత సాధిస్తుంది. అనంతరం సహకార సంఘం వారు బ్యాంక్ నుంచి కాన్సెంట్ తెచ్చుకుంటే బీసీ కార్పొరేషన్ రుణం ఇస్తుంది. జిల్లాలో ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఏపీజీవీబీ, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవచ్చు. 50 శాతం రాయితీతో రుణాలు సంఘంలోని ఒక్కో సభ్యునికి రూ.50వేల చొప్పున 15 మంది సభ్యులు ఉన్న సంఘానికి గరిష్ఠంగా రూ.7.50 లక్షలు రుణంగా ఇస్తారు. ఇందులో ప్రభుత్వం నుంచి 50 శాతం రాయితీ వస్తుంది. ఒక్కో సభ్యునికి రూ.25వేలు రాయితీ ఉంటుంది. మిగతా సగం బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు. రుణం మంజూరైన సంఘాలు కులవృత్తి లేదా ఇతర చిన్నతరహా వ్యాపారాలు చేసుకోవచ్చు. బీసీ సంక్షేమశాఖలో ఒక్కో సహకార సంఘం నమోదుకు రూ.50, బీసీ కార్పొరేషన్ గర్తింపు కోసం రూ.195 మాత్రమే చెల్లించాల్సి ఉన్నా కొందరు దళారులు సంఘాల సభ్యుల నుంచి భారీగా దండుకుంటున్నారు. దీనివల్ల అనేకమంది సభ్యులు ఆర్థికంగా నష్టపోవడమేకాకుండా కొంతమంది సంఘాలుగా ఏర్పడేందుకే విముఖత చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాలకు సంబంధించి 197 సహకార యూనిట్లు మంజూరు కాగా చివరకు 8 సంఘాలు మాత్రమే రుణాలకు అర్హత సాధించాయి. రాయితీ పేరుతో మరో రకం మోసం 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత, సహకార యూనిట్లు 951 మంజూరయ్యాయి. వాటికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాలేదు. బ్యాంక్ రుణాలూ రాక ఒక్క యూనిట్ కూడా గ్రౌండ్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అన్ని జిల్లాలకు సంబంధించి ఒకేసారి నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో రాయితీ జమ అవుతుంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. విషయం తెలియని లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న దళారులు గత ఏడాది సబ్సిడీతో పాటు, ప్రస్తుత సంవత్సర రుణాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు గుంజుతున్నట్లు పలువురు చెబుతున్నారు.