బీసీ కార్పొరేషన్‌లో లోన్‌లు ఇప్పిస్తామంటూ దళారులు సహకార సంఘాల సభ్యులను మాయ చేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా రుణాలు పొందే అవకాశం ఉన్నా..ఇది తెలియని అమాయకులు వారి బుట్టలో పడుతూనే ఉన్నారు. ఈ ఏడాది రుణాలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటనే చేయలేదు. అయినా బ్రోకర్లు ఈ ఏడాది లోన్‌లతోపాటు గతేడాది రుణాలూ ఇప్పిస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు. ఎవరికీ ఒక్క పైసా ఇవ్వాల్సిన పనిలేదని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నా కొందరు దళారుల మాయమాటలను నమ్ముతూనే ఉన్నారు.
ఖమ్మం సంక్షేమ విభాగం : వెనుకబడిన తరగతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. బీసీల్లో వివిధ రకాల కులవృత్తులు, ఇతర పనులు చేసుకునేవారికి చేయూతనిచ్చేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం 50 శాతం రాయితీతో బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తోంది. దీనిలో భాగంగా రజక, నాయీబ్రాహ్మణ, వడ్డెర, వాల్మీకిబోయ, సాగర ఉప్పర, బట్రాజు, కృష్ణబలిజ పూసల, విశ్వబ్రాహ్మణ, మేదర, శాలివాహనకుమ్మరి అనే 10 రకాల కులాల వారు సంఘాలుగా ఏర్పడితే రుణాలు అందజేస్తారు.
ఆయా కులాలకు చెందిన 11 నుంచి 15 మంది సహకార సంఘంగా ఏర్పడాలి. తరువాత ఆ సంఘం నమోదు కోసం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సదరు సహకార సంఘం మొత్తానికి కలిపి రూ.50 చెల్లించాలి. సంఘం సభ్యులందరికీ కుల, ఆదాయ ధ్రువీకరణపత్రాలు మాత్రం కచ్చితంగా ఉండాలి. వీటితో పాటు బై లా వివరాలు ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అనంతరం బీసీ సంక్షేమశాఖ అధికారి విచారణ నిర్వహించి నమోదు చేస్తారు. అక్కడ నమోదు అయిన సంఘం బీసీ కార్పొరేషన్‌లో గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఇందుకు రూ.195 (డి.డి.చార్జీలతో కలిపి)రుసుం చెల్లించాలి. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి సంఘానికి గుర్తింపు పత్రం వస్తుంది. సంఘం రుణానికి అర్హత సాధిస్తుంది. అనంతరం సహకార సంఘం వారు బ్యాంక్ నుంచి కాన్సెంట్ తెచ్చుకుంటే బీసీ కార్పొరేషన్ రుణం ఇస్తుంది. జిల్లాలో ఎస్‌బీహెచ్, ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంక్, ఏపీజీవీబీ, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకోవచ్చు.
50 శాతం రాయితీతో రుణాలు
సంఘంలోని ఒక్కో సభ్యునికి రూ.50వేల చొప్పున 15 మంది సభ్యులు ఉన్న సంఘానికి గరిష్ఠంగా రూ.7.50 లక్షలు రుణంగా ఇస్తారు. ఇందులో ప్రభుత్వం నుంచి 50 శాతం రాయితీ వస్తుంది. ఒక్కో సభ్యునికి రూ.25వేలు రాయితీ ఉంటుంది. మిగతా సగం బ్యాంకు నుంచి రుణంగా అందిస్తారు. రుణం మంజూరైన సంఘాలు కులవృత్తి లేదా ఇతర చిన్నతరహా వ్యాపారాలు చేసుకోవచ్చు.
బీసీ సంక్షేమశాఖలో ఒక్కో సహకార సంఘం నమోదుకు రూ.50, బీసీ కార్పొరేషన్ గర్తింపు కోసం రూ.195 మాత్రమే చెల్లించాల్సి ఉన్నా కొందరు దళారులు సంఘాల సభ్యుల నుంచి భారీగా దండుకుంటున్నారు. దీనివల్ల అనేకమంది సభ్యులు ఆర్థికంగా నష్టపోవడమేకాకుండా కొంతమంది సంఘాలుగా ఏర్పడేందుకే విముఖత చూపుతున్నారు. జిల్లావ్యాప్తంగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ విభాగాలకు సంబంధించి 197 సహకార యూనిట్లు మంజూరు కాగా చివరకు 8 సంఘాలు మాత్రమే రుణాలకు అర్హత సాధించాయి.
రాయితీ పేరుతో మరో రకం మోసం
2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా వ్యక్తిగత, సహకార యూనిట్లు 951 మంజూరయ్యాయి. వాటికి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ రాలేదు. బ్యాంక్ రుణాలూ రాక ఒక్క యూనిట్ కూడా గ్రౌండ్ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అన్ని జిల్లాలకు సంబంధించి ఒకేసారి నేరుగా లబ్ధిదారుడి ఖాతాలో రాయితీ జమ అవుతుంది.
2014-15 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. విషయం తెలియని లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న దళారులు గత ఏడాది సబ్సిడీతో పాటు, ప్రస్తుత సంవత్సర రుణాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు గుంజుతున్నట్లు పలువురు చెబుతున్నారు.
దళారులు బాబోయ్..!
Published Tue, Dec 23 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM
Advertisement