- 22 మంది సభ్యులతో సంతకాలు చేయించుకుని రూ.13.20 లక్షల రుణం బొక్కేసిన వైనం
- ఆంధ్రాబ్యాంకు బ్రాంచి మేనేజర్ పాత్రపైనా అనుమానం
కంచుస్తంభంపాలెం (యలమంచిలి) : కంచుస్తంభంపాలెం పంచాయతీ వాకలగరువుకు చెందిన మత్స్యకారులకు వారి సంఘం నాయకుడే రూ.13.20 లక్షల రుణానికి టోకరా వేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు ఇవి.. గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారులు ఏడాది కిందట సంఘంగా ఏర్పడి ఆంధ్రాబ్యాంకు భీమలాపురం శాఖలో ఖాతా తెరిచారు. అనంతరం బీసీ కార్పొరేషన్ నుంచి ఒక్కొక్కరికి రూ.60 వేలు చప్పున రూ.13.20 లక్షల రుణం మంజూరైంది. సంఘం నాయకుడు ఓలేటి రామదాసు సభ్యులకు రుణం మజూరైన విషయం చెప్పలేదు. వారికి బ్యాంకుకు తీసుకెళ్లి మనకు త్వరలో రుణం వస్తుంది, సంతకాలు పెట్టాలని చెప్పడంతో వారంతా సంతకాలు చేశారు. వస్తుందని ఎదురు చూడసాగారు.
రెండు రోజుల క్రితం బ్యాంకు అధికారులు వచ్చి రుణ వాయిదాలు చెల్లించడం లేదేమిటని నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. వారంతా రామదాసును నిలదీయగా రుణం తీసుకున్నామని చెప్పాలని, డబ్బు తాను కడతానని చెప్పగా సభ్యులు అంగీకరించలేదు. ఆ రుణం తాము తీసుకున్నామని చెపితే బ్యాంకు అధికారులు తమను కట్టమంటారని, అయినా మాకు మంజూరైన రుణాన్ని తీసుకోవడం ఏమిటని రామదాసును నిలదీశారు. తాము చాలాసార్లు బ్యాంకుకు వెళ్లి రుణం మంజూరైందా అని అడిగితే అప్పతి బ్రాంచి మేనేజర్ మంజూరు కాలేదని చెప్పేవాడని బాధితులు వాపోయూరు.
ఆ మేనేజర్ గత నెలలో బదలీ కొత్త మేనేజర్ రావడంతో విషయం బయటపడిందని బాధితులు ఓలేటి శ్రీను, కొప్పనాతి చినపెద్దిరాజు తెలిపారు. మత్స్యకారుల సంఘం జిల్లా నాయకుడు అండ్రాజు చల్లారావు సోమవారం ఉదయం ఫోన్‌చేసి ‘మీరు గొడవ చేయకండి, నేను వల్లూరు వచ్చి సమావేశం పెడతాను, బ్యాంకు అధికారులకు మాత్రం లోన్ తీసుకున్నామని చెప్పండి’ అన్నాడని బాధితులు తెలిపారు. దీంతో ఈ విషయంలో అతని పాత్ర కూడా ఉండవచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తామంతా రెక్కాడితే కాని డొక్కాడని నిరు పేదలమని, తమను మోసం చేసిన వారి నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు. తమకు లోను ఇవ్వకపోయినా ఫర్వాలేదుకాని, తెలియకుండా చేసిన సంతకాలను ఎరగా చూపి బాకీ తీర్చమంటే ఆత్మహత్యలే శరణ్యమని గగ్గోలు పెడుతున్నారు.
మత్స్యకారుల రుణాలు మింగేసిన నాయకుడు
Published Tue, Sep 30 2014 12:13 AM | Last Updated on Sat, Aug 18 2018 4:27 PM
Advertisement
Advertisement