వరి మద్దతు రూ.50 పెంపు!
- రాగికి క్వింటాల్‌కు రూ.100, వేరుశనగకు రూ.30 పెంపు
- కేంద్రానికి సీఏసీపీ సిఫార్సులు
న్యూఢిల్లీ: వరి రైతులకు శుభవార్త. వరి కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను క్వింటాల్‌కు రూ.50 పెంచాలని కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ ప్రతిపాదించింది. దీంతో వరి ఎంఎస్‌పీ రూ.1,410కి చేరనుంది. అలాగే రాగికి క్వింటాల్‌కు రూ.100 పెంచి రూ.1,650 చేయాలని, వేరుశనగకు రూ. 30 పెంచి రూ.4,030 చేయాలని వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ (సీఏసీపీ) కేంద్ర వ్యవసాయ శాఖకు సిఫార్సు చేసింది. కమిషన్ 2015-16 ఖరీఫ్ సీజన్‌కు పలు పంటల మద్దతు ధరలను ప్రతిపాదించింది.
కమిషన్ ప్రతిపాదనలపై కేంద్ర వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను, వివిధ విభాగాలను సంపద్రించి వారి అభిప్రాయాలను సేకరిస్తోందని మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పారు. తదనంతరం తుది ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ అనుమతికి పంపుతారన్నారు. ప్రస్తుత 2014-15 (జూలై-జూన్)లో 103.04 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తవుతాయని అంచనా కాగా, గత ఏడాదిలో 106.65 మిలియన్ టన్నులు ఉత్పత్తి అయ్యాయి. కాగా, 2014-15లో వరికి క్వింటాల్‌కు రూ.50 పెంచారు.
బీమా తీసుకున్న రైతులు 20 శాతమే..
భారత్‌లో పంట బీమా తీసుకున్న రైతులు 20 శాతానికి తక్కువగానే ఉన్నారు. దేశవ్యాప్తంగా కేవలం 19 శాతం మంది రైతులు మాత్రమే వారు పండించే పంటకు బీమా తీసుకున్నట్లు అసోచామ్, స్కైమెట్ వెదర్‌ల సర్వేలో వెల్లడైంది. సర్వే ప్రకారం.. దాదాపు 81 శాతం మంది రైతులకు పంట బీమా తీసుకోలేదు. దేశవ్యాప్తంగా పంట బీమా తీసుకున్న వారి సంఖ్య 3.2 కోట్లు. రైతులు పంట బీమా తీసుకోకపోవడానికి క్లెయిమ్ సెటిల్‌మెంట్ జాప్యాలే కారణం.