నాగంపేట్‌లో జొన్నలు కాంటా వేస్తున్న హమాలీలు
బాల్కొండ: ఎర్రజొన్న రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. వ్యాపారుల మాయాజాలంలో ఘోరంగా మోసపోతున్నారు. మద్దతు ధర కోసం ఓవైపు రైతులు ఉద్యమిస్తుంటే సర్కారు నుంచి స్పందన కరువైంది. ఇదే అదనుగా వ్యాపారులు ధర తెగ్గోసి రైతుల పుట్టి ముంచుతున్నారు. మొన్నటి వరకు ఎర్రజొన్న క్వింటాల్ ధర రూ. 2,100 పలికింది. అయితే, గిట్టుబాటు ధర ప్రకటించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు ఉద్యమించడం, ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో వ్యాపారుల ఆగడాలు రెట్టింపయ్యాయి.
సర్కారు స్పందించక పోవడాన్ని అలుసుగా తీసుకుని ఇష్టమొచ్చిన ధరలు నిర్ణయిస్తున్నారు. మొన్నటివరకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేసిన దళారులు.. ఇప్పుడు ఏకంగా రూ.1,650కి తగ్గించేశారు. పైగా క్వింటాల్‌కు 6 నుంచి 8 కిలోల వరకూ కడ్తా తీసేస్తున్నారు. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుత సంవత్సరం జొన్న విత్తడం ప్రా రంభం నుంచి విక్రయించే వరకు రైతులకు తిప్ప లు తప్పడం లేదు. ఎర్ర జొన్నలను గతేడాది ప్ర భుత్వం కొనుగోలు చేయడంతో, ప్రస్తుత సంవత్సరం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ధీమాతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంట సాగు చేశారు. కానీ సర్కారు చేతులు ఎత్తివేయడంతో జొన్న రైతులు ఉద్యమ బాట పట్టారు.
ప్రస్తుత సీజన్ ప్రారంభంలో ఎర్ర జొన్నలను క్వింటాల్‌కు రూ.2100 చొప్పున వ్యాపారులు కొనుగోళు చే శారు. ఆ తర్వాత వారం వ్యవధిలో ధర తగ్గించేశా రు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.1650 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు నిర్ణయించిన ధర కారణంగా రైతులు ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.450 చొప్పున నష్టపోతున్నారు. గతేడాది ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.2300 రూపాయాల మద్దతు ధర ప్రకటించింది. ఆ లెక్క ప్రకారమైతే రూ.650 చొప్పున నష్టపోతున్నారు.
మరింత తగ్గుతుందని ప్రచారం..
మరోవైపు, ధర మరింత తగ్గుతుందని దళారులు గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. క్వింటాల్ ధర రూ.1500 వరకు పడిపోతుందంటూ వ్యాపారులు ప్రచారం చేయిస్తున్నారు. దీంతో రైతులు ఆందోళనతో వచ్చిన ధరకే తెగనమ్ముకుంటున్నారు. తామంతా ఐక్యంగా ఉండాలని, ఎవరు కూడా జొన్నలను విక్రయించవద్దని తొలుత రైతులు నిర్ణయించుకున్నారు. అయితే, రైతుల ఐక్యతను దెబ్బ తీయడానికి మొదట్లో వ్యాపారులు రూ.2100 ధర చెల్లించి కొనుగోళ్లు ప్రారంభించగా, కొందరు పంట విక్రయించుకున్నారు. దీంతో రైతుల ఐక్యతను క్రమంగా దెబ్బతీసిన వ్యాపారులు ఇప్పుడు ధరను తగ్గించేస్తున్నారు. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు ప్రభుత్వం స్పందించి ఎర్ర జొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ధర తగ్గించేశారు..
ఎర్ర జొన్నలు క్వింటాలుకు 1650 రూపాయాలకు కొనుగోలు చేస్తున్నారు. మొదట్లో 2100 రూపాయాలకు కొనుగోలు చేసిన వ్యాపారులు 15 రోజుల్లో ధరను తగ్గించేశారు. ధర తగ్గించడం, కడ్తా రూపంలో ఆరు కిలోలు తీసేస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. ప్రభుత్వమే ఆదుకోవాలి.
–సతీష్, రైతు, నాగంపేట్
ప్రభుత్వమే ఆదుకోవాలి..
ఎర్ర జొన్నల ధర మరింత తగ్గుతుందని వ్యాపారులు అంటున్నారు. దీంతో వచ్చిన ధరకే పంటను విక్రయించుకుంటున్నాం. ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే రైతులకు మేలు జరిగేది. జొన్న రైతుల గురించి సర్కారు ఆలోచన చేయాలి. ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనాలి.
– గణేష్, రైతు, నాగంపేట్
Comments
Please login to add a commentAdd a comment