ఖమ్మంవ్యవసాయం : మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది.. వ్యాపారులు ఇదే అదనుగా భావించారు.. రైతులకు కుంటిసాకులు చెప్పి.. ధర దోపిడీకి పాల్పడ్డారు.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సరుకు రాక ఎక్కువైనప్పుడల్లా వ్యాపారులు సిండికేట్‌గా మారి దోచుకోవడం నిత్యకృత్యమైంది. నాలుగు రోజుల సెలవుల తర్వాత సోమవారం ఖమ్మం మార్కెట్‌కు మిర్చి భారీగా వచ్చింది. సుమారు 60వేల బస్తాలు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నుంచి విక్రయానికి వచ్చింది. ప్రధాన యార్డు నిండటంతో మరో యార్డును మిర్చి కోసం కేటాయించారు. దీనిని అదనుగా భావించిన వ్యాపారులు కూడపలుక్కొని ధరను పూర్తిగా పతనం చేశారు. గత వారంతో పోలిస్తే ఏకంగా రూ.2వేలు తగ్గించి కొనుగోలు చేశారు. గత వారం క్వింటా రూ.11,275 వరకు పలికిన ధర సోమవారం గరిష్టంగా రూ.10,100 చేరింది. వ్యాపారులు కొనుగోలు చేసింది సగటున రూ.9వేలు మాత్రమే.
జనవరి మూడో వారం నుంచి రోజుకో రకంగా ధర పెరిగింది. డిసెంబర్ చివరి వారంలో రూ.8,800 వరకు ఉన్న ధర 20 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.11,000 దాటింది. జనవరి 27 వరకు రూ.11, 275 ధరను తాకింది. ఈ క్రమంలో స్థానిక వ్యాపారులు ధరను పెంచుకుంటూ పోతే ఇబ్బందులు ఎ దురవుతాయని చర్చించుకొని సిండికేటుగా మారి, తిరిగి ధర తగ్గించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీంతో జనవరి 30న ధరను రూ. 10,800 తగ్గించారు. 31వ తేదీ నాటికి రూ.10,600 చేర్చారు. సోమవారానికి(జనవరి 5న) ఏకంగా గరి ష్ట ధరను రూ.1 0,125 తీసుకొచ్చారు. కానీ. అంతా కూడపలు క్కొని సగటున రూ.9వేలకు మించి ధర పెట్టలేదు. కొందరి పంటను రూ.8వేల వరకు కూడా కొనుగోలు చేశారు. ఇదేమిటంటే.. నాణ్యత లేదని, తేమ అధికంగాఉందని కుంటి సాకులు చెప్పారు.
రూ.2వేలకు పైగా ధర దోపిడీ
గత నెల 27వ తేదీ ధరతో పోలిస్తే క్వింటాల్‌కు రూ.2వేల నుంచి రూ.2,500 వరకు ధర తగ్గించి కొంటున్నారు. విదేశాల్లో తేజ రకం మిర్చికి డిమాండ్ ఉన్నప్పటికీ ఇక్కడి వ్యాపారులు సిండికేటుగా మారి దోపిడీకి గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఇంతగా ధర తగ్గించడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సరుకు పెరుగుతుండటంతో వ్యాపారులు ధరను కృత్రిమంగా పడేసి ధర దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి.
అవసరాన్ని ఆసరా చేసుకొని దగా
రబీ పంటల సాగు అవసరాలు, మిర్చి కోసిన కూలీల చార్జీలు చెల్లించటం కోసం రైతులు పంటను విక్రయానికి తెస్తున్నారు. దీనిని వ్యాపారులు అదనుగా భావించి.. సిండికేటుగా ఏర్పడి ధర దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాపారులు ధరను తగ్గించినా రైతులు ధిక్కరించలేకపోతున్నారు. పంటల సాగుకు పెట్టుబడులు ఇచ్చేది ఆ వ్యాపారులే కావటంతో ఏమీ మాట్లాడలేక పెట్టిన ధరకే పంటను విక్రయించక తప్పటం లేదు. వ్యాపారులు పెట్టే ధరలను చూసి రైతులు బిత్తర చూపులు చూస్తున్నారు.
రూ.11వేలు వస్తుందనుకున్నా..
మిర్చికి ధర ఉందని, క్వింటాల్‌కు రూ.11వేలకు పైగా ధర వస్తుందని ఆశించా. ఎకరం మిర్చి తోట వేశా. 20 బస్తాలు విక్రయానికి తెచ్చా. క్వింటాల్‌కు రూ.9వేల ధర పెట్టారు. ఎంత బతిమిలాడినా వ్యాపారులు ధర పెంచలేదు. ధరలో అన్యాయం చేశారు. ధర దోపిడీ చేస్తున్నారు.
– షేక్ జానీమియా, వనంవారి కిష్టాపురం, ముదిగొండ మండలం
కూలీలకు డబ్బు ఇవ్వాల్సి ఉండి మిర్చి అమ్మకానికి తెచ్చా..
మిర్చి తోట ఏరిన కూలీలు డబ్బుల కోసం ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కుటుంబ అవసరాలు కూడా ఉన్నాయి. అయినా ఖమ్మం మార్కెట్‌లో రూ.11వేలకు పైగా ధర ఉందని 30 బస్తాల మిర్చిని అమ్మకానికి తెచ్చా. రూ.9వేల ధర పెట్టారు. అవసరాన్ని చూసి రైతులకు వాత పెడుతున్నారు.
– ధర్మసోత్ సాగర్, ఎల్లంపేట, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment