రైతుకు నోటీసు | Police Department Give Notice To The Farmers | Sakshi
Sakshi News home page

రైతుకు నోటీసు

Published Mon, Mar 4 2019 6:52 AM | Last Updated on Mon, Mar 4 2019 6:53 AM

Police Department Give Notice To The Farmers - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): రైతుల ఉద్యమాన్ని నియంత్రించేందుకు పోలీసులు కొత్త అస్త్రం సంధిస్తున్నారు. ఆందోళనల్లో పాల్గొంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న రైతులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. పోలీసుల వైఖరిపై అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు కోసం పోరాడుతుంటే నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేయడంపై మండి పడుతున్నారు.

పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్నారు. మద్దతు ధర కోసం ఆర్మూర్‌ కేంద్రంగా శాంతియుత నిరసనలు చేపడుతున్నా రు. ధర్నాలు, రాస్తారోకోలు, జాతీయ రహదారు ల దిగ్బంధనంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందు కు యత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఎర్రజొన్నలకు ధర నిర్ణయం తో పాటు కొనుగోలు అంశంపై సర్కారు స్పష్టతనివ్వడం లేదు. దీంతో రైతులు వరుసగా ధర్నాలు, రాస్తారాకోలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు.

‘మద్దతు’ కరువు..

ఆర్మూర్‌ డివిజన్‌లో పసుపు, ఎర్రజొన్నలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాల్లో ఆయా పంటలు పెద్ద విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టి పసుపు పండిస్తున్న రైతులకు ఏటా నష్టాలే మిగులుతున్నాయి. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరానికి సగటున రూ.40 వేల వరకు రైతులు నష్టపోతున్నారు. మరోవైపు, ఎర్రజొన్నల విషయంలోనూ అన్నదాతలకు ఇబ్బందులు తప్పడం లేదు. పండించిన పంటను అమ్ముకునేందుకు ఏటా తిప్పలు పడుతూనే ఉన్నారు. మార్కెట్‌ మాయాజాలంలో మోసపోతూ ప్రతి సంవత్సరం ఆందోళనలకు దిగుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించడమే కాకుండా కొనుగోలు చేసింది. అయితే, ఈ సంవత్సరం మాత్రం మద్దతు ధరతో కొనుగోలుపై సర్కారు నుంచి స్పందన కరువైంది.

వరుస ఆందోళనలు.. 

ఏటా తలనొప్పిగా మారిన ఎర్రజొన్నలతో పాటు పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలని అన్నదాతలు గత నెల రోజులుగా ఉద్యమిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లోని 14 మండలాలకు చెందిన రైతులు ఆర్మూర్‌ కేంద్రంగా ఆందోళనలు చేపడుతున్నారు. గత నెల 12, 16 తేదీల్లో ఆర్మూర్‌లో బైఠాయించిన రైతులు.. 18వ తేదీన కలెక్టరేట్‌ను ముట్టడించారు. గత నెల 25న జాతీయ రహదారులను దిగ్బంధించి, రోడ్లపై వంటావార్పు నిర్వహించారు. ఆ తర్వాతి హైదరాబాద్‌కు పాదయాత్రగా బయల్దేరారు. అయితే, పోలీసులు వారిని జక్రాన్‌పల్లి శివారులో అడ్డుకుని అరెస్టు చేశారు.

పోలీసు తాఖీదులు

 రైతుల ఉద్యమాన్ని చల్లార్చడానికి పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 14 మండలా ల్లో 144 సెక్షన్‌ విధించినా అన్నదాతలు మాత్రం ఆందోళనలను ఆపలేదు. పోలీసులు గ్రామాలకు వెళ్లి ధర్నాలకు వెళ్లొద్దని ప్రచారం చేయడంతో పాటు పికెటింగ్‌ నిర్వహించారు. తాజాగా నోటీసు అస్త్రం సంధించారు. ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటున్న రైతులకు సీఆర్‌పీసీ 149 సెక్షన్‌ ప్రకారం ముందస్తు హెచ్చరికగా నోటీసులు జారీ చేస్తున్నా రు. హైవేలు, జనసమ్మర్థం గల ప్రాంతాల్లో ఆందో ళన నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని నోటీసులో పేర్కొన్నారు.

మున్ముందు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నోటీసులు అందుకున్న రైతులు ఎలాంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధానంగా ఉద్యమానికి నాయక త్వం వహిస్తున్న వారికే ఈ తాఖీదులు జారీ చే స్తుండడం గమనార్హం. మోర్తాడ్, కమ్మర్‌పల్లి, వే ల్పూర్, ఏర్గట్ల, ముప్కాల్, మెండోరా, బాల్కొం డ, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, నందిపేట్‌ తదితర మం డలాల్లోని రైతు నాయకులకు నోటీసులు జారీ చేశారు. ప్రతి గ్రామంలో రైతులను సమన్వయం చేస్తు ఉద్యమానికి ఊతమిస్తున్నట్లుగా గుర్తించిన రైతు నాయకులకు ఈ నోటీసులిచ్చారు.

రైతుల్లో ఆందోళన..

ఇప్పటికే గ్రామాలలో పికెటింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులు.. తాజాగా నోటీసులు జారీ చేయడం వల్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంఘ విద్రోహ శక్తులకు జారీ చేయాల్సిన నోటీసులను శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న తమకు జారీ చేయడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళన కార్యక్రమాలను అడ్డుకోవడంలో భాగంగా ముందస్తు అరెస్టులు చేయడం, గ్రామాలలో పికెటింగ్‌ నిర్వహించడం, తాజాగా నోటీసులను జారీ చేయడంపై మండిపడుతున్నారు. రైతుల ఐక్యతను దెబ్బ తీసి ఉద్యమాన్ని అణచి వేయడానికే పోలీసులు నోటీసులను జారీ చేస్తున్నారని రైతు నాయకులు విమర్శిస్తున్నారు. పోలీసులపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకరావడం వల్లే నోటీసులు జారీ చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మద్దతు ధర ప్రకటించాలని రైతు నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.  

గుణపాఠం తప్పదు
పసుపు, ఎర్రజొన్న రైతుల ఉద్యమాన్ని అణచివేయాలని ప్రభుత్వం చూస్తోంది. అలా చేస్తే రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు. మద్దతు ధర కోసం ఉద్యమం కొనసాగిస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో వెయ్యి మంది వరకు నామినేషన్లు వేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చేస్తాం. రైతులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను విరమించుకోవాలి. 
– అన్వేష్‌రెడ్డి, 
రైతు ఉద్యమ నాయకుడు

ఎవరికైనా ఇవ్వవచ్చు..
సీఆర్‌పీసీ 149 సెక్షన్‌ కింద పోలీసులు ఎవరికైనా నోటీసులు ఇవ్వవచ్చు. ప్రధానంగా సంఘ విద్రోహ శక్తులకు ఈ సెక్షన్‌ కింద నోటీసులు  ఇస్తుంటారు. అయితే, రైతులు సంఘ విద్రోహశక్తులు కాదు. ఈ సెక్షన్‌ కింద వారికి నోటీసులు ఇవ్వకుంటేనే బాగుండేది. పోలీసులకు అధికారం ఉన్నప్పటికీ రైతుల విషయంలో ఆలోచించాల్సింది. రైతుల వరుస ఆందోళనల నేపథ్యంలో పోలీసులు ఈ సెక్షన్‌ను ఉపయోగించుకున్నారు. 
– రాజేశ్వర్, న్యాయవాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement