న్యూఢిల్లీ: వ్యవసాయంలో పెట్టుబడి కూడా తిరిగిరాక తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులకు కాస్తంత ఊరటనిచ్చేలా రబీ పంటల మద్దతు ధరలను కేంద్రం బుధవారం పెంచింది. గోధుమ, బార్లీ, శనగ, ఆవాలు, తెల్ల కుసుమలు, మసూర్ పంటల మద్దతు ధరలు 6 నుంచి 21 శాతం వరకు పెరిగాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై మద్దతు ధరల పెంపుకు ఓకే చెప్పింది. తాజా పెంపు వల్ల రూ.62,635 కోట్ల అదనంగా రైతులకు అందుతాయని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో మరో మూడు నెలల్లో శాసనసభ ఎన్నికలు, ఏడు నెలల్లో దేశమంతటా సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం మద్దతు ధరలను పెంచడం గమనార్హం. మద్దతు ధరల పెంపు, రుణమాఫీ కోరుతూ మంగళవారమే రైతులు ఢిల్లీలోనూ భారీ నిరసనకు దిగడం తెలిసిందే. పెట్టుబడి కన్నా 50 శాతం ఎక్కువగా మద్దతు ధర ఉండేలా చూస్తామని గతంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు హామీనివ్వడం తెలిసిందే.
తాజా పెంపు తర్వాత రబీ పంటలన్నింటికీ మద్దతు ధరలు పెట్టుబడి వ్యయం కన్నా 50 శాతం ఎక్కువగానే ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ చెప్పారు. 2018–19 వ్యవసాయ సంవత్సరానికి వర్తించేలా గోధుమ ఎమ్మెస్పీని కేంద్రం రూ. 105 పెంచడంతో గోధుమ మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 1,840కి చేరింది. అలాగే ప్రతి క్వింటాల్‌కు బార్లీకి రూ. 30 (పెంపు తర్వాత మద్దత ధర రూ. 1,440), శనగలకు రూ. 220 (రూ. 4,620), మసూర్‌కు రూ. 225(రూ. 4,475), ఆవాలకు రూ. 200(రూ. 4,200), తెల్ల కుసుమలకు రూ. 845(రూ. 4,945)ల మద్దతు ధరలను కేంద్రం పెంచింది. గత జూలైలోనే వివిధ ఖరీఫ్ పంటల మద్దతు ధరలను కూడా పెంచి అన్ని పంటలకూ పెట్టుబడి కన్నా మద్దతు ధర 50 శాతం ఎక్కువగా ఉండేలా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment