విజయవర్ధిని ఆయిల్‌మిల్లు ప్రధాన ద్వారం, ఆయిల్‌మిల్లులోని ఆయిల్ ట్యాంకర్లు
సాక్షి, అలంపూర్:బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్‌మిల్‌కు పునర్జీవం రానుంది. ఏళ్ల తరబడిగా మూతబడిన పరిశ్రమ త్వరలోనే కళకళ లాడనుంది. ఫ్యాక్ట రీ తిరిగి ప్రారంభించడానికి ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ఆయిల్‌ఫెడ్ ఎండీ నిర్మల, సీనియర్ మేజర్ సుధాకర్‌రెడ్డితో బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్‌మిల్ పునరుద్ధరణపై సమావేశం జరిగింది. దీంతో మిల్లు పునఃప్రారంభంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్‌డీడీ బీ నుంచి తీసుకున్న అప్పును చెల్లించి తిరిగి ఆయిల్ మిల్ పునఃప్రారంభానికి చర్యలు చేపట్టారు. విజయవర్ధిని ఆయిల్‌మిల్ తిరిగి తెరచుకోనుండటంతో స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఉద్యోగావకాశాలు కలగనుండటంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు నెలల్లో విజయవర్ధినికి పునర్జీవం కలగే అవకాశం ఉంది. మిల్లులను తెరుచుకుంటే బీచుపల్లి ప్రాంతంలో వ్యాపార లావాదేవీలు జోరందుకునే అవకాశం ఉంటుంది.
బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్ మిల్లు 2003లో మూతపడింది. మిల్లులో ఉత్పత్తయిన నూనె, ఇతర పదార్థాల అమ్మకాల్లో అధికారుల చేతివాటం అక్రమాలు తోడై అప్పుల ఊబిలోకి వెళ్లింది. అప్పులను తీర్చి మళ్లీ ప్రారంభించేందుకు ఎన్‌డీడీబీ (నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు) ఆర్థిక సాయం అందించింది. అయినప్పటికీ అక్రమాలు ఆగక వచ్చిన ఆర్థికసాయం కూడా నష్టాల్లోకి వెళ్లడంతో 2003లో పూర్తిగా ఫ్యాక్టరీ మూతపడింది. మిల్లు మూతపడడంతో గద్వాల, వనపర్తి వ్యవసాయ మార్కెట్లలో వేరుశనగ ఉత్పత్తులకు కేవలం వ్యాపారులు మాత్రమే ధర నిర్ణయించే పరిస్థితి వచ్చింది.
ఆయిల్‌మిల్లు పనిచేసినంత కాలం ఈ మార్కెట్‌లో మిల్లుకు సంబంధించిన అధికారులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల గిట్టుబాటు ధర లభించింది. ప్రస్తుతం మార్కెట్లలో ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా తర్వాత గద్వాల, వనపర్తి జిల్లాలో వేరుశనగను ఎక్కువగా పండిస్తున్నందున ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయిల్‌మిల్ మూత పడడం రైతులకు శాపంగా మారింది. ఏళ్ల తరబడిగా మిల్లు మూతపడి ఉండటంతో ఉమ్మడి రాష్ట్రంలోనే కొంత సామగ్రి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తరలించారు. ఉన్న సామగ్రి తుప్పుపడుతున్నాయి.
బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్‌మిల్‌ను 1990లో ప్రారంభించారు. ఇటిక్యాల మండలం తిమ్మాపురం శివారులోని 410,411,412,413,401 సర్వే నంబర్లలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌మిల్ ఏర్పాటు చేశారు. అప్పట్లో దాదాపు రూ.18కోట్ల వ్యయంతో దీన్ని ప్రారంభించారు. 1983లో వేరుశనగ రైతులకు మరింత ఆదాయం కల్పించడానికి, తక్కువ ధరకే వేరుశనగ నూనె ప్రజలకు అందించడానికి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి బీజాలు పడ్డాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కర్నూలు జిల్లాలో నూనె గింజలను సేకరించి రైతులకు మద్దతు ధర కల్పించడం కూడా ఒక ఉద్దేశంతో దీన్ని నిర్మించారు.
ప్రభుత్వం బీచుపల్లి వద్ద విజయబ్రాండ్ ఆయిల్ మిల్లును ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడంతోపాటు, విజయ బ్రాండ్ నూనెలను ఉత్పత్తి చేసి వచ్చే ఆదాయంలో రైతులకు వాటా ఇచ్చే లక్ష్యంతో బీచుపల్లి ఆయిల్ మిల్‌ను ప్రభుత్వం నిర్మించింది. వేలాదిమంది కార్మికులతోపాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించడం, రైతులకు వాటా ఇవ్వడం బీచుపల్లి మిల్లు నిర్మాణం లక్ష్యం. అప్పట్లోనే ఈ మిల్లు ద్వారా 1400 మందికి ఉద్యోగావకాశాలను కల్పించారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 2వేల మందికి పైగానే ఉపాధి కల్పించిన ఆయిల్‌మిల్లు కొన్నేళ్లపాటు విజయవంతం కొనసాగింది.
పునరుద్ధరణకు సన్నాహాలు
దాదాపు 16ఏళ్ల పాటు మూతపడిన విజయర్ధిని ఆయిల్ ఫ్యాక్టరీ పురుద్ధరణకు ఆయిల్‌ఫెడ్ కంపెనీవారు సన్నాహాలు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఫ్యాక్టరీ తెరవడానికి చర్యలు చేపడుతుంది. అప్పట్లో వేరుశనగ నూనె, కేక్ ఆయిల్ తయారీ జరిగేది. ఇందుకోసం జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్‌డీడీబీ) నుంచి అప్పు తీసుకుంది. ప్రస్తుతం ఈ అప్పు చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ అప్పును వన్ టైం సెటిల్‌మెంట్‌తో చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవాలని ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్‌డీడీబీ రూ.7.5 కోట్లు కావాలని కోరుతుండగా ఆయిల్‌ఫెడ్ రూ.3 నుంచి రూ.5 కోట్లతోనే సెటిల్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయిల్‌ఫెడ్ ఎండీ సమావేశం నిర్వహించింది.
గతంలో 200 మెట్రిక్ టన్నులు వేరుశనగ, ఇతరత్రా నూనెలను ఉత్పత్తి చేయడం జరిగేది. ఫ్యాక్టరీ తెరిచాక వేరుశనగ నూనెలతోపాటు పామాయిల్, ఇతరాత్ర నూనెలు ఉత్పత్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిచేసి రెండు లేక మూడు నెలల్లో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ పునఃప్రారంభం అయితే జోగుళాంబ జిల్లాలో కీలకంగా మారనుంది. ఉద్యోగ, వ్యాపారాలతో కళకళ లాడనుంది.
Comments
Please login to add a commentAdd a comment