reasonable
-
నీ భావికి విధాతవు నీవే..
వ్యక్తి ఆస్థిత్వాన్నీ, గుర్తింపును నిర్వచించేవాటిలో మొదటిది అతనికి తనపై తనకున్న అవగాహన. వర్తమానంలో తానే స్థితిలో ఉన్నాడు, భవిష్యత్తులో తాను చేరాలనుకునే ఉన్నత స్థానం ఏమిటి అన్నది స్థిరంగా నిర్ణయించుకుని ముందుకు సాగాలి. ఆవిధంగా తనను తాను ముందుగా అంచనా వేసుకోవడం ప్రతివారికీ అవసరం. స్వీయ పరిశీలన చేసుకుని తన భవిష్యత్తును నిర్ణయించుకోవడం వ్యక్తి పురోగతి సాధించడంలో తీసుకోవవలసిన అత్యంత సమంజసమైన విధి.విద్యలోనూ, విషయగ్రాహ్యతలోనూ అంతగా రాణించే శక్తిలేని మనిషి, తాను ఎంత దృఢమైన రీతిలో ఉన్నతస్థానాన్ని అధిరోహించాలని భావించినా, సాధారణ పరిస్థితుల్లో అది కుదరకపోవచ్చు. ఎందుకంటే, అతనికున్న మానసిక బలం, శారీరిక బలం కార్యసాధనకు సహకరించాలి కదా..!! అయితే, ఇది దుస్సాధ్యమైన విషయంగా పరిగణించ వలసిన పనిలేదు. మనం అనుకున్నదానికంటే, మన అవగాహన గుర్తించినదానికంటే, ఎంతో అధికమైన శక్తి ప్రతి మనిషిలో దాగి ఉంటుంది. కృతనిశ్చయంతో ‘‘నేను నా రంగంలో ఉన్నత స్థానాన్ని సాధించగలను’’ అని భావించి, ఉద్యమిస్తే, ఉత్తమ ఫలితాలను సాధించడం కష్టమైన విషయమేమీ కాదు. అంతే కాదు.. అదే కృషిని త్రికరణశుద్ధిగా కొనసాగిస్తే, ఉన్నతస్థానంలో నిలకడను సాధించి నిలబడ గలగడమూ కష్టమైన పనేమీ కాదు.స్వీయనియంత్రణ అనుకున్నప్పుడు ప్రతివ్యక్తీ తాను రోజుకు ఎంత సమయాన్ని కార్యసాధన కోసం సద్వినియోగం చేసుకోగలుగుతున్నాడనేది ముఖ్యమైన భూమికను పోషిస్తుంది. కాసేపు మొక్కుబడిగా పనిచేసి, అనుకున్న ఫలితం రాలేదని భావించడంవల్ల ప్రయోజనం లేదుకదా..!! ఉన్నతలక్ష్యాలను నిర్దేశించుకున్నవ్యక్తి ఎటువంటి దురలవాట్లకూ బానిసకాకుండా ఉండడమూ స్వీయనియంత్రణలో అంతర్భాగమే..!!భరతజాతి ముద్దుబిడ్డల్లో ఒకరై ప్రకాశించిన రామకృష్ణ పరమహంస వ్యక్తిత్వవికాసానికి సంబంధించిన అంశాల్లో అందరికీ ప్రయోజనకరంగా భాసించేలా ప్రభోధించిన అద్భుతమైన వాక్యం ‘‘ముందుగా నిన్ను నీవు తెలుసుకో’’. భవిష్యత్తు బంగరుబాటకావాలంటే, ఎవరైనా సరే, ముందుగా తనలో ఉన్న లోపాలమీద, బలహీనతలమీద, చేసే తప్పులమీద దృష్టి పెట్టాలి. ఆ తప్పులను లేదా లోపాలను సరిదిద్దుకునే క్రమాన్ని గుర్తెరిగి, అత్యంత శీఘ్రంగా వాటిని తొలగించుకుని, అప్పుడు భావి కార్యాచరణకు నడుం బిగించాలి. తనను తాను సరిచేసుకుని ముందుకు సాగే విధానంలో సాధకుడు సానుకూలమైన ఆలోచనా ధోరణిని అలవరచుకోవాలి. మనసులో ఎటువంటి వ్యతిరేక భావాలకూ చోటు యివ్వకూడదు. ప్రతిమనిషీ తన లక్ష్యాన్ని సాధించడానికి కొందరినుంచి స్ఫూర్తిని పొందుతూ ముందుకు సాగుతాడు. తనకు స్ఫూర్తిదాతయైన వ్యక్తి ఆధ్యాత్మికంగా శక్తిమంతుడు కావచ్చు, లేదా ఒక జనహితం కోసం కృషి చేసే నాయకుడో, సమాజ సేవకుడో లేక క్రీడాకారుడో కావచ్చు. అపూర్వమైన విజయాలను సొంతం చేసుకున్న వారో, తమ చేతల ద్వారా చరిత్రలో నిలిచిపోయిన ఏ వ్యక్తి నుంచైనా స్ఫూర్తిని పొందవచ్చు. తాను పొందిన అమేయమైన స్ఫూర్తిని, అమలుపరచడంలో ఎడతెగని ఆర్తిని కనబరచి, త్రికరణశుద్ధిగా కృషి చేస్తే, భవిత సాధకునికి తప్పనిసరిగా దీప్తివంతమవుతుంది.తన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే క్రమంలో ప్రతివ్యక్తీ స్వీయ క్రమశిక్షణ పాటించడం అత్యంత అవసరం. ఆత్మనియతితో తమపై తాము విధించుకుని అమలుపరచే జీవన విధానమే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో అనుకున్న రీతిలో విజయం సాధించాలంటే నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవితాన్ని అనుసరించాలి. జీవితంలో లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎంతోమంది ఓటమి పాలవ్వడం లేదా ఆశించిన గమ్యాన్ని అందుకోకపోవడానికి కారణం స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. జనించినప్పుడు జీవులందరూ ఒకేరకమైన రీతిలో జనించినా, అందులో కొంతమంది వ్యక్తులు మాత్రమే అసాధారణమైన విజయాలను సాధించడానికి, తాము అనుకున్న ఎత్తుకు ఎదగడానికి కారణం వారు నిత్యమూ పాటించే స్వీయ నియంత్రణ లేక క్రమశిక్షణ అని చెప్పవచ్చు.– వ్యాఖ్యాన విశారద, వెంకట్ గరికపాటి -
‘విజవర్ధిని’ కి పునర్జీవం
సాక్షి, అలంపూర్:బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్‌మిల్‌కు పునర్జీవం రానుంది. ఏళ్ల తరబడిగా మూతబడిన పరిశ్రమ త్వరలోనే కళకళ లాడనుంది. ఫ్యాక్ట రీ తిరిగి ప్రారంభించడానికి ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ఆయిల్‌ఫెడ్ ఎండీ నిర్మల, సీనియర్ మేజర్ సుధాకర్‌రెడ్డితో బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్‌మిల్ పునరుద్ధరణపై సమావేశం జరిగింది. దీంతో మిల్లు పునఃప్రారంభంపై ఆశలు చిగురిస్తున్నాయి. ఎన్డీడీ బీ నుంచి తీసుకున్న అప్పును చెల్లించి తిరిగి ఆయిల్ మిల్ పునఃప్రారంభానికి చర్యలు చేపట్టారు. విజయవర్ధిని ఆయిల్‌మిల్ తిరిగి తెరచుకోనుండటంతో స్థానికంగా హర్షం వ్యక్తం అవుతోంది. ఉద్యోగావకాశాలు కలగనుండటంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో మూడు నెలల్లో విజయవర్ధినికి పునర్జీవం కలగే అవకాశం ఉంది. మిల్లులను తెరుచుకుంటే బీచుపల్లి ప్రాంతంలో వ్యాపార లావాదేవీలు జోరందుకునే అవకాశం ఉంటుంది. బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్ మిల్లు 2003లో మూతపడింది. మిల్లులో ఉత్పత్తయిన నూనె, ఇతర పదార్థాల అమ్మకాల్లో అధికారుల చేతివాటం అక్రమాలు తోడై అప్పుల ఊబిలోకి వెళ్లింది. అప్పులను తీర్చి మళ్లీ ప్రారంభించేందుకు ఎన్డీడీబీ (నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు) ఆర్థిక సాయం అందించింది. అయినప్పటికీ అక్రమాలు ఆగక వచ్చిన ఆర్థికసాయం కూడా నష్టాల్లోకి వెళ్లడంతో 2003లో పూర్తిగా ఫ్యాక్టరీ మూతపడింది. మిల్లు మూతపడడంతో గద్వాల, వనపర్తి వ్యవసాయ మార్కెట్లలో వేరుశనగ ఉత్పత్తులకు కేవలం వ్యాపారులు మాత్రమే ధర నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఆయిల్‌మిల్లు పనిచేసినంత కాలం ఈ మార్కెట్లో మిల్లుకు సంబంధించిన అధికారులు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయడం వల్ల గిట్టుబాటు ధర లభించింది. ప్రస్తుతం మార్కెట్లలో ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. అనంతపురం జిల్లా తర్వాత గద్వాల, వనపర్తి జిల్లాలో వేరుశనగను ఎక్కువగా పండిస్తున్నందున ఇక్కడ ఏర్పాటు చేసిన ఆయిల్‌మిల్ మూత పడడం రైతులకు శాపంగా మారింది. ఏళ్ల తరబడిగా మిల్లు మూతపడి ఉండటంతో ఉమ్మడి రాష్ట్రంలోనే కొంత సామగ్రి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి తరలించారు. ఉన్న సామగ్రి తుప్పుపడుతున్నాయి. బీచుపల్లి విజయవర్ధిని ఆయిల్మిల్ను 1990లో ప్రారంభించారు. ఇటిక్యాల మండలం తిమ్మాపురం శివారులోని 410,411,412,413,401 సర్వే నంబర్లలో దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌మిల్ ఏర్పాటు చేశారు. అప్పట్లో దాదాపు రూ.18కోట్ల వ్యయంతో దీన్ని ప్రారంభించారు. 1983లో వేరుశనగ రైతులకు మరింత ఆదాయం కల్పించడానికి, తక్కువ ధరకే వేరుశనగ నూనె ప్రజలకు అందించడానికి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి బీజాలు పడ్డాయి. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కర్నూలు జిల్లాలో నూనె గింజలను సేకరించి రైతులకు మద్దతు ధర కల్పించడం కూడా ఒక ఉద్దేశంతో దీన్ని నిర్మించారు. ప్రభుత్వం బీచుపల్లి వద్ద విజయబ్రాండ్ ఆయిల్ మిల్లును ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసింది. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో వేరుశనగ రైతులకు గిట్టుబాటు ధరను కల్పించడంతోపాటు, విజయ బ్రాండ్ నూనెలను ఉత్పత్తి చేసి వచ్చే ఆదాయంలో రైతులకు వాటా ఇచ్చే లక్ష్యంతో బీచుపల్లి ఆయిల్ మిల్‌ను ప్రభుత్వం నిర్మించింది. వేలాదిమంది కార్మికులతోపాటు, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించడం, రైతులకు వాటా ఇవ్వడం బీచుపల్లి మిల్లు నిర్మాణం లక్ష్యం. అప్పట్లోనే ఈ మిల్లు ద్వారా 1400 మందికి ఉద్యోగావకాశాలను కల్పించారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ 2వేల మందికి పైగానే ఉపాధి కల్పించిన ఆయిల్‌మిల్లు కొన్నేళ్లపాటు విజయవంతం కొనసాగింది. పునరుద్ధరణకు సన్నాహాలు దాదాపు 16ఏళ్ల పాటు మూతపడిన విజయర్ధిని ఆయిల్ ఫ్యాక్టరీ పురుద్ధరణకు ఆయిల్‌ఫెడ్ కంపెనీవారు సన్నాహాలు చేస్తున్నారు. మరో మూడు నెలల్లో ఫ్యాక్టరీ తెరవడానికి చర్యలు చేపడుతుంది. అప్పట్లో వేరుశనగ నూనె, కేక్ ఆయిల్ తయారీ జరిగేది. ఇందుకోసం జాతీయ పాడి అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ) నుంచి అప్పు తీసుకుంది. ప్రస్తుతం ఈ అప్పు చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ అప్పును వన్ టైం సెటిల్మెంట్తో చెల్లించే విధంగా ఒప్పందం చేసుకోవాలని ఆయిల్‌ఫెడ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్డీడీబీ రూ.7.5 కోట్లు కావాలని కోరుతుండగా ఆయిల్‌ఫెడ్ రూ.3 నుంచి రూ.5 కోట్లతోనే సెటిల్ చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆయిల్‌ఫెడ్ ఎండీ సమావేశం నిర్వహించింది. గతంలో 200 మెట్రిక్ టన్నులు వేరుశనగ, ఇతరత్రా నూనెలను ఉత్పత్తి చేయడం జరిగేది. ఫ్యాక్టరీ తెరిచాక వేరుశనగ నూనెలతోపాటు పామాయిల్, ఇతరాత్ర నూనెలు ఉత్పత్తి చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిచేసి రెండు లేక మూడు నెలల్లో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ పునఃప్రారంభం అయితే జోగుళాంబ జిల్లాలో కీలకంగా మారనుంది. ఉద్యోగ, వ్యాపారాలతో కళకళ లాడనుంది. -
రైతులకు గిట్టుబాటు ధర
– జిల్లాలో ఐదు మినుముల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు –ఏపీ మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ పరిమళ జ్యోతి వెల్లడి నూనెపల్లె: రైతులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని ఏపీ మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ పరిమళ జ్యోతి అన్నారు. భారతీయ ఆహార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక టెక్కె మార్కెట్ యార్డులోని డీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాౖటెన పెసలు కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిమళ జ్యోతి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5 మినుములు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె, శిరివెళ్ల, పగిడ్యాలలో కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఈ కేంద్రాల్లో పెసలకు12 శాతం తేమశాతం ఉంటే క్వింటా రూ. 5225 ప్రకారం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. విక్రయానికి వచ్చే రైతులు ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా, పట్టాదారు పాస్‌పుస్తకం తెచ్చుకోవాలని సూచించారు. ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు తెచ్చినా తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌సీఐ మేనేజర్ వినీల్ కుమార్, డీఎస్ఎంఎస్ ఏరియా మేనేజర్ రాఘవేంద్ర అప్ప, నంద్యాల మేనేజర్ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు.