ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
మోర్తాడ్ :
రైతులు పండిస్తున్న ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా రైతాంగ సమస్యల పరిశీలనలో భాగంగా ఆయన ఆదివారం మోర్తాడ్‌లో రైతులను కలిసి వారి సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్మూర్ డివిజన్‌లో రైతులు అధికంగా ఎర్రజొన్నలను సాగు చేస్తున్నారని తెలిపారు. ఉత్తర భారతదేశంతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక తదితర దేశాలకు ఎర్రజొన్నల ఎగుమతి సాగుతుందని వివరించారు. ఈ వాణిజ్య పంటను ప్రభుత్వం బ్రోకర్లకు అప్పగించడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆర్మూర్ డివిజన్‌లో 50 వేల ఎకరాల్లో ఎర్రజొన్న పంట సాగు అవుతుందని, 7 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి సాగుతుందని తెలిపారు. దళారులు ఈ పంటను కొనుగోలు చేస్తూ రైతులకు సరైన ధర చెల్లించడం లేదన్నారు. గత సంవత్సరం ఎర్రజొన్న పంటను విక్రయించిన రైతులకు ఇంకా డబ్బులు అందాల్సి ఉందన్నారు. అలాగే మొక్కజొన్న పంటకు క్వింటాలుకు రూ.1,410 మద్దతు ధరగా ప్రకటించడం శోచనీయమని తెలిపారు. మక్కలకు మార్కెట్‌లో ధర అధికంగా ఉండగా, ప్రభుత్వం మద్దతు ధరను పెంచకపోవడం సరికాదన్నారు. రైతు కూలీ సంఘం నాయకులు దేవారాం, భూమయ్య, గంగాధర్, రామకృష్ణ, డాక్టర్ సత్యనారాయణ, సురేశ్, రాజేశ్వర్, కిషన్, భాజన్న, అశోక్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్‌పల్లి : ఎర్రజొన్నలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. జిల్లా రైతాంగ సమస్యలపై పరిశీలన కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామంలో ఏఐకేఎంఎస్ నేతలు ఆదివారం పర్యటించారు. రైతులను కలిసి మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. అనంతరం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడారు. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రూ. 2 వేలు మద్దతు ధర ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. నేతలు దేవరాం, భూమయ్య, గంగాధర్, రామకృ ష్ణ, సత్యనారాయణ, సురేశ్, రాజేశ్వర్, భాజన్న తదితరులు పాల్గొన్నారు.