
సాక్షి, హైదరాబాద్: ఎర్రజొన్న కొనుగోలుకు మొదటిదశలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, అవసరాన్ని బట్టి వాటి సంఖ్య పెంచుతామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, వేల్పూర్, కమ్మరపల్లి, బాల్కొండ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయని తెలిపారు. ఎర్రజొన్నల కొనుగోలుకు అనుసరించాల్సిన విధివిధానాలపై శనివారం ఆయన వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ ఎం.జగ న్మోహన్, అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్, మార్క్‌ఫెడ్ జీఎం రాములుతో సమావేశమయ్యారు.
పోచారం మాట్లాడుతూ మార్క్‌ఫెడ్ ద్వారా సోమవారం నుంచి ఎర్రజొన్నలను క్వింటాకు రూ.2,300తో కొనుగోలు చేస్తామని, రైతులు ఎర్రజొన్నలను మార్కెట్‌కు తీసుకురావడానికి టోకెన్ పద్ధతిని అమలు చేస్తామని చెప్పారు. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో పర్యటించి పంట విస్తీర్ణం, దిగుబడి ఆధారంగా టోకెన్లను జారీ చేస్తామని, టోకెన్‌లో ఉన్న తేదీ ఆధారంగా రైతులు తమ సరుకును కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు చూపాలన్నారు.
రైతులు మధ్యవర్తులను, బ్రోకర్లను నమ్మొద్దని, వారికి సహకరించొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది పండిన పంటను మాత్రమే కొనుగోలు చేస్తామని, గోదాములు, కోల్డ్ స్టోరేజీల్లోని గత ఏడాది నిల్వలను కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు. ఎవరైనా పాత నిల్వలను అమ్మడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి ఎర్రజొన్నల దిగుమతులను అనుమతించబోమన్నారు.