
సాక్షి, హైదరాబాద్ : ఎర్రజొన్న రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మార్క్‌ఫెడ్ ద్వారా ఎర్రజొన్నలు కొనుగోలు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. క్వింటాలుకు రూ.2,300 ధరకు కొనుగోలు చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో సోమవారం (18వ తేదీ) నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
గురువారం సాయంత్రం సచివాలయంలో పోచారం, ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎర్రజొన్న రైతులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఎర్రజొన్నలకు తగిన ధర లేకపోవటం, వ్యాపారులు కొనేందుకు ముందుకు రాకపోవటంతో నిజామాబాద్, నిర్మల్, జగి త్యాల జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్న విషయాన్ని కవిత, వేముల, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి ఢిల్లీలో ఉన్న సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దానిపై సీఎం వెం టనే స్పందించారు.
ఎర్రజొన్న రైతులను ఆదుకునే బాధ్య త ప్రభుత్వానిదేనని, వెంటనే కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎర్రజొన్న రైతుల తరఫున తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్‌ఎస్ పోరాడిందని పోచారం అన్నారు. ‘‘ఎర్ర జొన్న రైతులను 2014కు ముందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.12 కోట్ల బకాయిలను చెల్లించింది. కాంగ్రెస్ నేతలు సొల్లు మాటలు చెబుతున్నారు. కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. అక్కడ ఎర్రజొన్నలను క్వింటా రూ.1,600కే కొంటున్నారు. ఇక్కడ మాత్రం రైతులకు కాంగ్రెస్ నేతలు తప్పుడు సమాచారమిచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు.
ఆఖరి బస్తా వరకూ కొంటాం: కవిత
ఆఖరి బస్తా వరకు ఎర్రజొన్నలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతు లు దిగులు పడాల్సిన అవసరమే లేదని కవిత భరోసా ఇచ్చారు. ‘రెండు రోజుల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నాం. కాం గ్రెస్ నాయకులది అనవసర రాద్ధాంతం. గతంలో కనీస మద్దతు ధర కోసం నిజామాబాద్‌లో ఆందోళన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కడుపుల్లో తూటాలు దింపింది’ అంటూ మండిపడ్డారు. ఎర్ర జొన్నలనుకొనాలని నిర్ణయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment