నోటీసులు సిద్దం చేస్తున్న అధికారులు
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలో సంచలనం సృష్టించిన పసుపు కుంభకోణం కారణంగా పంట పండించిన అసలైన రైతులు నష్టపోతున్నారు. అధికార పార్టీ నాయకులు వారి అనుచరులను కాపాడుకునే పనిలో రైతులకు అన్యాయం చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పొరుగున ఉన్న ప్రకాశం, కడప జిల్లాల రైతులు అందజేసిన ఆధారాలపై సంతృప్తి చెంది నగదు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన మార్క్‌ఫెడ్ అధికారులు జిల్లాలోని రైతుల విషయంలో ఓ స్పష్టతకు రాలేదు. గురువారం నుంచి అసలైన రైతులకు మరోసారి నోటీసులను పంపుతున్నారు.
ప్రకాశం, కడప జిల్లాల రైతులకు క్లియరెన్‌స
జిల్లాతో పాటు పొరుగున ఉన్న ప్రకాశం, కడప జిల్లాలో పండించిన పసుపును ఉదయగిరిలోని మార్క్‌ఫెడ్ కేంద్రంలో విక్రయించారు. పసుపు కుంభకోణం వెలుగుచూడడంతో విచారణలో భాగంగా మార్క్‌ఫెడ్ అధికారులు రైతుల ప్రమేయంపై దృష్టి సారించారు. ప్రకాశం జిల్లాకు చెందిన 23 మంది, కడప జిల్లాకు చెందిన 23 మంది, నెల్లూరు జిల్లాకు చెందిన 183 మంది రైతులకు ఈ నెల 3న నోటీసులు జారీ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన రైతులు ఆధారాలతో సహా మార్క్‌ఫెడ్ అధికారుల నోటీసులకు సమాధానం ఇచ్చారు. పరిశీలించిన మార్క్‌ఫెడ్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆ జిల్లాకు చెందిన 23 మంది రైతులకు రావాల్సిన నగదును అందజేయాలని గురువారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే కడప జిల్లాకు చెందిన 23 మంది రైతుల సమాధానాలను పరిశీలించిన అ«ధికారులు సంతృప్తి చెందినట్లు సమాచారం. త్వరలో వారికి కూడా నగదు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిసింది.
రాజకీయ ఒత్తిళ్లతో పెండింగ్
ప్రకాశం, కడప జిల్లాలలోని రైతులకు నోటీసులు పంపినప్పుడే జిల్లా రైతులకు నోటీసులు అందజేశారు. కానీ జిల్లా రైతుల విషయంలో ఉద్యాన శాఖ అధికారుల నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ రాలేదు. రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు జిల్లా రైతుల విషయంలో నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తన అనచరులను కాపాడుకునేందుకు విచారణ చేస్తున్న అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్తు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుంభకోణంలో ప్రధాన సూత్రదారులు నగదు తీసుకుని మిన్నకుండిపోగా అసలు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మళ్లీ ఇచ్చారు
ఈ నెల 3న జిల్లాలోని 183 మంది పసుపు రైతులకు మార్క్‌ఫెడ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. రైతుల నుంచి వచ్చిన సమాధానం సరిగా లేకపోవడంతో రెండోసారి నోటీసులను గురువారం తయారు చేసి పంపారు. వీరితో పాటు గుర్తింపు లేని రైతుల కింద ఉన్న 51 మందికి నోటీసులు జారీ చేశారు. జిల్లా అధికారుల మధ్యన సమన్వయం లోపించడంతో పాటు రాజకీయ ఒత్తిళ్లతో రైతులకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండోసారి నోటీసులు ఇచ్చాం
పసుపు రైతులకు మరోసారి నోటీసులు జారీ చేస్తున్నాం. ప్రకాశం, కడప జిల్లాల రైతుల విషయంలో స్పష్టత వచ్చింది. జిల్లాలోని రైతుల నుంచి వచ్చిన సమాధానాలపై స్పష్టత లేదు. అందుకే రెండోసారి జిల్లాలోని రైతులకు నోటీసులు పంపుతున్నాం. –ఈమని సంజీవరెడ్డి, మార్క్‌ఫెడ్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment