పర్చూరు, న్యూస్‌లైన్:
శీతల గిడ్డంగులు కోట్ల రూపాయల కుంభకోణాలకు నెలవవుతున్నాయి. జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న మోసాలు సంచలనాలు రేకెత్తిస్తున్నాయి. వ్యవస్థలో ఉన్న లోపాలను అనుకూలంగా మలుచుకొని ఎలా సొమ్ము చేసుకోవచ్చో నిరూపిస్తున్నాయి. ఈ నిర్వాకాల్లో శీతల గిడ్డంగుల యాజమాన్యాలు, బ్యాంకు సిబ్బందే కీలక భూమిక పోషిస్తున్నారు. ఇటీవల పొదిలిలో ఒక శీతల గిడ్డంగిలో సరుకు లేకుండా * 9.30 కోట్ల రుణాలు పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ శీతలగిడ్డంగి నిర్మాణానికి ఒక బ్యాంకు రుణం ఇచ్చింది. లోపల ఉన్న సరుకుకు మాత్రం మరో రెండు బ్యాంకులు రుణాలిచ్చాయి. అలానే ఇంకొల్లు రామతులశమ్మ కోల్డ్ స్టోరేజీలో * 2.30 కోట్లు సరుకు లేకుండానే రైతుల పేరుతో బ్రోకర్, యాజమాన్యం కలిసి రుణాలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో 27 మంది రైతులు జైలుకెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పర్చూరు మండలంలోని ఒక బ్యాంకు నుంచి జిల్లా సరిహద్దులో ఉన్న ఒక శీతల గిడ్డంగి యాజమాన్యం 50 కేజీల బస్తాలను 70 కేజీల బస్తాలుగా రాయించి
బ్యాంకుల వద్ద రుణాలు పొందింది.
దీనికి తోడు రైతులకు చెందిన కోటి రూపాయల విలువైన సరుకు సైతం అమ్ముకున్నట్లు బ్యాంకు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఈ విషయమై సుమారు 140 మంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంకొల్లులో ఒక శీతల గిడ్డంగి యాజమాన్యం చీరాలలోని రెండు ప్రైవేటు బ్యాంకులతో పాటు స్థానికంగా ఉన్న మరో బ్యాంకు వద్ద రుణాలు పొందారు. స్థానిక బ్యాంకులోనే * 5 కోట్ల రుణం పొందినట్లు సమాచారం. గిడ్డంగిలో ఉన్న సరుకు వేలం వేద్దామన్నా యాజమాన్యం సహకరించడం లేదు. వేలం వేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయనే సహకరించడం లేదని తెలుస్తోంది. ఇంకొల్లు సమీపంలోని మరో రెండు శీతల గిడ్డంగుల్లో కూడా సరుకు లేకుండా రుణాలు పొందినట్లు ఆరోపణలున్నాయి.
తాజాగా పర్చూరులోని ఒక శీతల గిడ్డంగిలో * 19 కోట్లకుపైగా పంట ఉత్పత్తులపై రుణాలు పొంది సకాలంలో చెల్లించలేదని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా తరఫున రైతులకు నోటీసులు జారీ చేశారు. మరో రెండు బ్యాంకులు నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం నెల రోజులుగా స్థానికంగా చర్చనీయాంశమైంది. బ్యాంకు నోటీసులిచ్చిన జాబితాలో సరుకుపై తీసుకున్న రుణమెంత..సరుకు లేకుండా తీసుకున్న రుణమెంతో అంతుచిక్కడం లేదు. వీరిలో కొందరు రైతులు నగదు చెల్లించేందుకు గడువు కోరడంతో వేలాన్ని బ్యాంకర్లు వాయిదా వేశారు.
ఇలా శీతల గిడ్డంగుల అక్రమాల వ్యవహారాలు రోజురోజుకూ సంచలనాలు రేకెత్తిస్తున్నాయి. బ్యాంకుల వద్ద నుంచి నోటీసులు అందుకున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మేలు చేస్తారని చెప్పి 33 శాతం రాయితీలిచ్చి ప్రభుత్వం శీతలగిడ్డంగుల నిర్మాణాలను ప్రోత్సహించింది. తీరా చూస్తే శీతలగిడ్డంగుల్ని అక్రమాల పుట్టలుగా మార్చేశారు. ప్రారంభంలో బాగానే పనిచేసినప్పటికీ తర్వాత అక్రమాల బాటపట్టారు. బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై కోట్ల రూపాయలు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల నమ్మకం మీద రైతుల వద్ద నుంచి పర్మిట్లు తీసుకున్నారు.
మరి కొన్ని చోట్ల రైతులకు తెలియకుండానే రుణాలు స్వాహా చేశారు. నిబంధనల ప్రకారం రైతు తీసుకున్న రుణం రైతు బ్యాంకు ఖాతాకు జమచేయాలి. అయితే అలాంటి నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవు.. సరుకుపై రుణం ఇచ్చిన బ్యాంకర్లు ఏటా ఇన్‌స్పెక్షన్ (తనిఖీ) ఫీజు వసూలు చేస్తున్నారు. లేని సరుకుకు రుణాలిచ్చిన బ్యాంకర్లు తనిఖీ ఫీజులు వసూలు చేయడం గమనార్హం.
జిల్లా మొత్తంగా పూర్తి నిబంధనలతో నిర్వహిస్తున్న శీతలగిడ్డంగులు నాలుగైదుకంటే లేవంటే కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా మొత్తం మీద ఈ కుంభకోణం *100కోట్లకు పైగా ఉండవచ్చనేది ప్రాథమిక సమాచారం. రైతుల జీవితాలతో ముడిపడిన అంశం కాబట్టి జిల్లాలోని అక్రమాలకు పాల్పడ్డ శీతల గిడ్డంగులన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపితేనే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.