Cold Storages
-
పండ్లు, కూరగాయల నష్టాలకు ఇక చెక్
సాక్షి, అమరావతి: రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలకు కోత అనంతరం నష్టాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్బీకేల పరిధిలో ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తెలిపారు. ఉద్యాన పంటలు పండించే ప్రాంతాల్లో ప్రతి నాలుగు ఆర్బీకేలకు ఒక ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం, కోల్డ్ స్టోరేజీని నిర్మిస్తామని చెప్పారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లిలో నిర్మించిన ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం, రైతు శిక్షణ కేంద్రాన్ని సోమవారం మంత్రి కాకాణి ప్రారంభించారు. 75 శాతం సబ్సిడీతో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం కోసం వీటిని నిర్మించారు. ఈ సందర్భంగా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీవో) పరిధిలో రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మంత్రి కాకాణి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ ద్వారా నిర్మిస్తున్న ఈ ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రాలను రూ.15 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని తెలిపారు. ఎఫ్‌పీవోలకు 75 శాతం, వ్యక్తిగతంగా నిర్మించుకుంటే రైతులకు 40 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. తాము పండించిన ఉత్పత్తుల నాణ్యతను పెంచుకునేందుకు, మంచి ధరలు పొందడానికి ఇవి దోహదపడతాయని చెప్పారు. వీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్లు, కూరగాయల కోతలు, సరైన పద్ధతిలో రవాణా, గ్రేడింగ్, ప్యాకింగ్ చేయడంపై రైతులకు శిక్షణనిస్తున్నట్టు తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించాలి.. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. సేంద్రియ ఉత్పత్తులకు గుర్తింపు కోసం సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ సంస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇది త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా సేంద్రియ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులు, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం, రైతులకు శిక్షణనివ్వడం వంటి కార్యక్రమాలు చేపడుతున్న గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘాన్ని మంత్రి అభినందించారు. ఉద్యాన శాఖ కమిషనర్ ఎస్ఎస్ శ్రీధర్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటలు అధికంగా పండించే ప్రతి నాలుగు ఆర్బీకేలకు ఒక ఉద్యాన ఉత్పత్తుల సేకరణ కేంద్రం చొప్పున 945 కేంద్రాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 505 కేంద్రాలకు మంజూరు ఉత్తర్వులు ఇవ్వగా.. 171 చోట్ల పనులు చేపట్టామన్నారు. వీటిలో 32 కేంద్రాల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ, అధ్యక్షుడు భూపతిరాజు రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న మిర్చి కొనుగోళ్లు
సాక్షి, అమరావతి బ్యూరో: కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం మిర్చి రైతులకు అండగా నిలుస్తోంది. కరోనా, వేసవి కారణంగా మిర్చి యార్డుకు ఈ నెల 3వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఈ ఏడాది కాలువలకు ఏప్రిల్ వరకు నీరు విడుదల చేయడంతో మిరప దిగుబడులు అనూహ్యంగా పెరిగాయి. యార్డుకు సెలవులు ఇచ్చే సమయానికి రైతుల వద్ద చివరికోత కాయలు మిగిలాయి. పంట దిగుబడి అధికంగా రావడంతో ఇంకా మంచి ధరలు వస్తాయని రైతులు క్వాలిటీ సరుకును కోల్డ్ స్టోరేజీల్లో నిల్వచేశారు. దీంతో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 90 శాతం కోల్డ్‌స్టోరేజీలు నిండిపోయాయి. మిగతా జిల్లాలో సైతం 80 శాతం మేర నిండాయి. కల్లాల్లో 15 లక్షల టిక్కీలపైగా సరుకు ఉండిపోయింది. ఈ సరుకును నిల్వ చేసుకోవటానికి కోల్డ్ స్టోరేజీలు సైతం ఖాళీగా లేకపోవడంతో రైతులకు ఇబ్బంది ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతులు భరోసా ఇచ్చింది. తమ సరుకు అమ్ముకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల పరిధిలో గోడౌన్లు, కోల్డ్‌స్టోరేజీల్లో క్రయవిక్రయాలకు అనుమతి ఇచ్చింది. దీంతో రోజుకు 50 వేల టిక్కీలపైగా మిర్చి లావాదేవీలు జరుగుతున్నాయి. ధరలు సైతం నిలడకగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆసియాలో అతిపెద్దదైన మిర్చి యార్డు కావడంతో తెలంగాణ, కర్ణాటకతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి సరుకు గుంటూరుకు వస్తోంది. కోల్డ్‌స్టోరేజీల్లో భారీగా నిల్వలు గుంటూరు జిల్లాలోని 130 కోల్డ్‌స్టోరేజీల్లో 1.10 కోట్ల టిక్కీల నిల్వ సామర్థ్యం ఉంది. ఇప్పటికే 90 శాతం నిల్వలున్నాయి. ప్రకాశం జిల్లాలోని 72 కోల్డ్‌స్టోరేజీల నిల్వ సామర్థ్యం 20 లక్షల టిక్కీలు. కర్నూలు జిల్లాలోని 12 కోల్డ్‌స్టోరేజీల నిల్వ సామర్థ్యం 8 లక్షల టిక్కీలు. ఈ రెండు జిల్లాల్లో 80 శాతం నిండిపోయాయి. కృష్ణాజిల్లాలోని 26 కోల్డ్ స్టోరేజీల నిల్వ సామర్థ్యం 18 లక్షల టిక్కీలు. వీటిలో 60% నిల్వలు చేరాయి. ప్రభుత్వానికి ధన్యవాదాలు కరోనా కష్టకాలంలో సైతం యార్డు మూతపడినా మా సరుకును అమ్ముకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. నేను 50 బస్తాల సరుకు తెచ్చాను. చివరికోత కాయ అయినా రేట్లు బాగానే ఉన్నాయి. 334 నాటు రకం మిర్చి క్వింటా రూ.9 వేలకు పైగా అమ్మాను. సరుకు నిల్వ చేసుకొందామనుకున్నా కోల్డ్ స్టోరేజీల్లో ఖాళీ లేదు. ఈ తరుణంలో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీల వద్ద కొనుగోళ్లు జరపడం సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి ధన్యవాదాలు. – తిరుపతయ్య, మేడికొండూరు, గుంటూరు జిల్లా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు మార్కెట్ యార్డు మూతపడినా రైతులకు ఇబ్బంది లేకుండా మిర్చి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాం. రోజులు 50 వేల టిక్కీలకు పైగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. యార్డు మూతబడినప్పటి నుంచి ఇప్పటివరకు బయట 3.05 లక్షల టిక్కీల క్రయవిక్రయాలు జరిగాయి. రూ.122.06 కోట్ల వ్యాపారం జరిగింది. చివరికోత మిర్చి రైతుల వద్ద ఉంది. ఆ సరుకును అమ్ముకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ధరలు స్థిరంగా ఉన్నాయి. – వెంకటేశ్వరరెడ్డి, ఉన్నతశ్రేణి సెక్రటరీ, గుంటూరు మార్కెట్ యార్డు మార్కెట్లో గిరాకీ ఉంది చైనాతోపాటు, శ్రీలంక ఇతర దేశాలకు మిర్చి ఎగుమతులకు ఆర్డర్లు బాగానే వస్తున్నాయి. లోకల్లో సైతం డిమాండ్ ఉంది. కరోనా సమయంలో కూడా మార్కెట్లో ధరలు నిలకడగా ఉన్నాయి. క్వాలిటీ సరుకుకు మంచి ధర వస్తోంది. తేజ రకం క్వింటా ధర రూ.15 వేలకు పైగా పలుకుతోంది. చివరికోత కాయలు కావడంతో సరుకు నాణ్యత బట్టి ధర ఉంటోంది. – కొత్తూరు సుధాకర్, ఎగుమతి వ్యాపారి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు జిల్లాలో 130 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఈ ఏడాది పంట దిగుబడుల అధికంగా రా>వడంతో, నాణ్యమైన సరుకును రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నారు. జిల్లాలో ఇప్పటికే 90 శాతంపైగా కోల్డ్ స్టోరేజీలు నిండాయి. రెండేళ్లుగా కోల్డ్‌స్టోరేజీలు నిండుతున్నాయి. రైతులకు ఇబ్బంది లేకుండా అందుబాటు ధరలో, మిర్చి నిల్వ చేస్తున్నాం. – పి.సురేంద్రబాబు, సెక్రటరీ, ది గుంటూరు డిస్ట్రిక్ట్ కోల్డ్ స్టోరేజ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -
కోట్లాదిమందికి వ్యాక్సినేషన్ ఎలా?
న్యూఢిల్లీ: ఆశలు చిగురిస్తున్నాయి, ఎదురు చూపులు ఫలించనున్నాయి. 2021 వస్తూ వస్తూ మంచి శకునాలు మోసుకురాబోతోంది కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది వేసవికి ముందే వస్తుందనే అంచనాలున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వాటి పంపిణీ ఎలా ? 130 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో అందరికీ వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుంది ? కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి వచ్చే ఏడాది వేసవినాటికి 10 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనాలున్నాయి. ఈ రేసులో ఫైజర్, మోడెర్నా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ముందున్నాయి. ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని, సామర్థ్యంగా పని చేస్తాయని తేలితే భారత్‌లో 130 కోట్లకు పైగా ప్రజలకి వ్యాక్సినేషన్ చేయడమే కేంద్ర ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాల్. ఈ సవాళ్లను అధిగమించడానికి చాలా రోజులుగా కేంద్రం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. బ్లాక్ మార్కెట్లు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందాని ఎదురుచూస్తూ ఉండడంతో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. దీంతో బ్లాక్ మార్కెట్లు విజృంభిస్తున్నాయన్న ఆందోళనలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఇచ్చే టీకా చుట్టూ వ్యాపారం జరక్కుండా కేంద్రం చర్యలు తీసుకోవడం అతి పెద్ద సమస్య. వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీలో అవినీతికి తావు లేకుండా చూడడం అతి పెద్ద సవాలని ఆరోగ్య రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోల్డ్ స్టోరేజీలు ప్రపంచదేశాల్లో టీకా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించే దేశం మనదే. టీకా పంపిణీకి పటిష్టమైన వ్యవస్థ ఉంది. భారత్‌లో 27 వేల కోల్డ్ స్టోరేజీ చైన్లు ఉన్నాయి. కానీ కోట్లాది మందికి వ్యాక్సినేషన్ కోసం ఈ కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు సరిపోవు. అందులోనూ మోడెర్నా వ్యాక్సిన్ మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ చేయాలి. మన దేశంలో వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల సెంటీ గ్రేడ్ వద్ద నిల్వ చేస్తూ ఉంటాం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, దేశీయంగా తయారయ్యే భారత్ బయోటెక్ వ్యాక్సిన్లను సాధారణ రిఫ్రిజిరేటర్లలోనూ నిల్వ చేస్తే సరిపోతుంది. అందుకే ప్రభుత్వం ఈ రెండు వ్యాక్సిన్లపైనే దృష్టి సారించింది. టీకా ప్రాధాన్యాలు టీకా అందుబాటులోకి వస్తే తొలుత ఎవరికివ్వాలి అన్న సవాల్ ఎదుర్కోవడం అత్యంత సంక్లిష్టమైనది. ప్రాణాలను పణంగా పెట్టి అహరహం శ్రమిస్తున్న ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ వర్కర్లకు తొలి ప్రాధాన్యమని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఆ తర్వాత 50–65 ఏళ్ల మధ్య వయసున్నవారికి, ఆ తర్వాత 50 ఏళ్లలోపు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. కానీ వీరి జాబితా తయారు చేయడం శక్తికి మించిన పని. అందుకే ఎవరికి ముందు టీకా ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించడానికి నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అధ్యక్షుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. టీకా ఇవ్వడంలో వివక్ష చూపించారన్న విమర్శలు రాకుండా ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కరోనా వ్యాక్సినేషన్‌కి అవసరమయ్యే ఆర్థిక వనరులు మన ముందున్న అతి పెద్ద సవాల్. కరోనా వ్యాక్సిన్ ఏ సంస్థదైనా నెల రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాలి. ఈ రెండు డోసులకి కలిపి భారత్‌లో వెయ్యి రూపాయలుగా ధర నిర్ణయించినట్టుగా ఇప్పటికే ఆక్స్ఫర్డ్ –ఆస్ట్రాజెనెకా టీకాను తయారు చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరి ప్రభుత్వమే ఈ టీకాలను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తుందా ? లేదంటే రాయితీపై అందిస్తుందా అన్నది అది పెద్ద ప్రశ్న. టీకాపై లక్ష కోట్లకు పైగా ఖర్చు చేయడం ప్రభుత్వానికి శక్తికి మించిన భారమే. అందుకే భారత్‌లో రూ.50 లోపు టీకా ధర నిర్ణయించి, ఒక్క డోసు ఇచ్చేలా వ్యాక్సిన్‌ను రూపొందిస్తే అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని ఆరోగ్యరంగ నిపుణుడు గగన్‌దీప్ అభిప్రాయపడుతున్నారు. ఆశలు రేపుతున్న వ్యాక్సిన్లు ఇవే..! ► అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్ 95% సురక్షితంగా పనిచేస్తోంది ► ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ 95% సురక్షితమని తేలింది. దీనికి బ్రిటన్ ప్రభుత్వం ఓకే చెప్పింది. ► యూకేకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ–ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వృద్ధుల్లో కూడా బాగా పని చేస్తోంది. ► రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌గా గుర్తింపు పొందింది. ► భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ కొవాగ్జిన్ పేరుతో అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ ప్రయోగాల్లో ఉంది ► యూకేకి చెందిన నోవావాక్స్ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాల్లో ఉంది. వచ్చే ఏడాది మొదట్లోనే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికా కూడా ఈ వ్యాక్సిన్ కోసం నిధులు అందిస్తోంది. ► అమెరికాకు చెందిన ఇనోవియో ఫార్మాస్యూటికల్ వ్యాక్సిన్ కూడా ఆశాజనక ఫలితాలు ఇస్తోంది. అమెరికా రక్షణ శాఖ ఈ వ్యాక్సిన్ కోసం నిధులు సమకూరుస్తోంది. -
రైతులకు మేలు చేయడమే లక్ష్యం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పీఎం కిసాన్ సీఈవో, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఏఐఎఫ్ మిషన్ డైరెక్టర్ వివేక్ అగర్వాల్‌తో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. (పల్లెకు 104 పరుగులు) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్)కి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివేక్ అగర్వాల్ తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్నతో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్, ఆర్థిక శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. (అమరావతికి నిధుల సమీకరణ) ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఉంటాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను ఆర్బీకేలు పరిష్కరిస్తాయన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తామని వెల్లడించారు. కియోస్క్‌లో ఆర్డర్ చేయగానే 48 గంటల్లోగా ప్రభుత్వం నిర్ధారించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుతాయని తెలిపారు. అలాగే ఈ-క్రాప్ చేస్తామన్నారు. ‘‘గ్రామ సచివాలయంలో ఉన్న రెవెన్యూ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్లు కలిసి ఈ–క్రాపింగ్ చేస్తారు. వాటిలో పంటలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదవుతాయి.ఇంకా జియో లొకేషన్ ట్యాగ్ కూడా చేస్తారు. రుణాలు రాలేదని ఎవ్వరైనా చెబితే.. వెంటనే చర్యలు తీసుకుంటాం. అలాగే బీమా సదుపాయం కూడా కల్పిస్తాం. ఆర్బీకేల్లో కనీస గిట్టుబాటు ధరలను ప్రకటిస్తాం. మార్కెట్లో ధరలు తగ్గితే వెంటనే మార్కెటింగ్‌లో జోక్యం (ఎంఐఎస్) చేసుకుంటామని’’ సీఎం తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరసమైన ధరలు లభించేలా చర్యలు తీసుకుంటామని, దీని కోసం ప్రత్యేక ఫ్లాట్‌ఫాం కూడా తీసుకువస్తున్నామని సీఎం వెల్లడించారు. అంతే కాకుండా గ్రామాల్లో జనతా బజార్లను తీసుకు వస్తామన్నారు. ‘‘ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడమే కాకుండా రైతులకూ మేలే జరుగుతుంది. వీటితోపాటు ప్రతి గ్రామంలో గోడౌన్లను, స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రీ ప్రాసెసింగ్‌తో పాటు, గ్రేడిండ్ కూడా అక్కడే చేస్తాం. అలాగే మండలాల్లో కోల్డ్ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గాల వారీగా అవసరమైన మేరకు క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. రైతుల నుంచి కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడిస్తాం.టమోటా, చీనీ, మొక్కజొన్న, మామిడి, అరటి తదితర పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తాం. ఆర్బీకేల ఆలోచన వచ్చిన దగ్గర నుంచి.. వాటి ఏర్పాటుతో పాటు.. ఈ అంశాలన్నింటిపైనా మేం దృష్టి పెట్టాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలు మా లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఫిషరీస్, ఆక్వాకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. పంట చేతికి వచ్చేసరికి ధరలు తగ్గిపోయే పరిస్థితి. దీనిపై కూడా దృష్టి పెట్టామని’’ సీఎం తెలిపారు. అమూల్‌తో ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నామని, పాడి పరిశ్రమ వృద్దికి ఇది తోడ్పడుతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అణగారిన వర్గాలకు, భూమి లేని నిరుపేదలకు ఇది మంచి ఉపయోగకరమని, పాడి పశువుల పెంపకంతో వీరికి మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు తెలియజేస్తున్నామన్నారు. సీఎం విజన్ బాగుంది: వివేక్ అగర్వాల్ రైతులకు సబ్సిడీలే కాదు.. సదుపాయాలు కల్పించడం అన్నది చాలా ముఖ్యమని వివేక్ అగర్వాల్ అన్నారు. ముఖ్యమంత్రి దార్శినికత రైతులకు మేలు చేస్తుందని ఆయన తెలిపారు. -
అగ్రి మార్కెటింగ్‌తో భరోసా
రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రక్రియలో భాగంగా వాటిని నిల్వ చేయడం కోసం ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీ లేదా కోల్డ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా టమాటా, చీని, అరటి వంటి పంటలను నిల్వ చేసుకునే విధంగా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. దేశ వ్యాప్తంగా ఏయే పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్ ఉందనే వివరాలతో పాటు, అన్ని చోట్ల వ్యాపారులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించాలి. ఆ మేరకు డేటా బేస్ రూపొందించాలి. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు రూ.4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) పరిధిలో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ యంత్ర పరికరాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రైతులకు ఉపయోగపడే విధంగా ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీ లేదా కోల్డ్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గోదాములు, శీతల గిడ్డంగుల ఏర్పాటుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, కోల్డ్ రూమ్‌లు, ఆర్బీకేలలో గ్రేడింగ్, సార్టింగ్ పరికరాలు, యంత్రాల కోసం దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా, ఆ మేరకు వెంటనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్బీకేలు–గోదాములు–సదుపాయాలు ► ఆర్బీకేలకు అనుబంధంగా నిర్మించే గోదాముల్లో సార్టింగ్, గ్రేడింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. వీటి కోసం సుమారు రూ.350 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ► ఆయా ఆర్బీకేల పరిధిలో పండే పంటలను దృష్టిలో ఉంచుకుని ఈ పరికరాలను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ► ప్రతి ఆర్బీకేలో తేమను కొలిచే యంత్రం, వేయింగ్ బాలెన్స్, కాలిపెర్స్, లాబ్‌వేర్‌లు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం దాదాపు రూ.92.2 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. రైతులకు తెలుగులో సమాచారం ► రైతులు తమ ఉత్పత్తుల వివరాలను ఆర్బీకేలలో అందివ్వగానే, ఆ పంటలకు ఎక్కడెక్కడ డిమాండ్ ఉందన్న సమాచారం, వ్యాపారుల వివరాలు వెంటనే తెలుగు భాషలో తెలియజేసేలా సదుపాయం ఉంటుందని అధికారులు చెప్పారు. ఇందు వల్ల రైతుల ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర వస్తుందని వివరించారు. ► సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పంటల అమ్మకాలకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ► రైతులు తమ పంటలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్బీకేలలో అందిస్తారు. అక్కడ నుంచి ఆ సమాచారం సెంట్రల్ సర్వర్‌కు చేరుతుంది. ఈ సమాచారాన్ని అందుకోగానే రైతుల పంట కొనుగోలు జరిగేలా చూడాలి. ► కనీస గిట్టుబాటు ధరకన్నా, తక్కువకు అమ్ముకునే పరిస్థితులు ఉంటే ధరల స్థిరీకరణ ద్వారా ఆదుకోవాలి. ► ఈ మొత్తం ప్రక్రియ సాఫీగా సాగడానికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను సెప్టెంబర్ నాటికి తయారు చేయాలి. ఖరీఫ్ పంట చేతికి వచ్చే నాటికి పూర్తిగా అమల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. -
లాభదాయక సాగుతోనే రైతు బాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రజల ఆహార అవసరాలకు తగినట్టు, మార్కెట్లో డిమాండ్ కలిగిన పంటలను సాగు చేసేలా రైతులకు మార్గదర్శనం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. వరి మాత్రమే కాకుండా ఇంకా ఏ పంటలు సాగు చేస్తే రైతులకు మేలు కలుగుతుందో అధ్యయనంచేసి మే 5లోగా నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించే గోదాముల్లో తప్పకుండా కోల్డ్ స్టోరేజీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో నూతన వ్యవసాయ విధానం రూపకల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా రెండో రోజు బుధవారం కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘తెలంగాణలో గతంలో ప్రాజెక్టులు, కరెంటు సరిగా లేకపోవడం వల్ల సాగునీటి లభ్యత అంతగా లేదు. ప్రభుత్వాలు కూడా వ్యవసాయాన్ని సరిగ్గా పట్టించుకోలేదు. దీంతో రైతులు ఎవరికి తోచినట్టు వారు తమకున్న వనరులకు అనుగుణంగా పంటలు సాగు చేశారు. అందరూ ఒకే పంట వేయడం వల్ల ధరలు కూడా రాలేదు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ప్రతి మూలకూ సాగునీరు అందుతోంది. 24 గంటల కరెంటు వల్ల బోర్ల ద్వారా కూడా జోరుగా వ్యవసాయం సాగుతోంది. కాబట్టి రైతులను సరిగ్గా నిరేశించగలిగితే లాభదాయక వ్యవసాయం చేస్తారు. ఈ దిశగా రాష్ట్రంలో కొత్త వ్యవసాయ విధానం రావాల్సిన అవసరం ఉంది’ అని ముఖ్యమంత్రి అభిలషించారు. సన్నరకాల సాగుకు ప్రోత్సహించండి ‘రాష్ట్రంలో ఎక్కువగా వరి పండిస్తున్నారు. పంటకాలం తక్కువనే కారణంతో దొడ్డు రకాలు పండిస్తున్నారు. ఎక్కువ మంది సన్నరకాలు తింటున్నారు. సన్నరకాలకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో డిమాండ్ ఉంది. ఇప్పుడు సాగునీటి వసతి కూడా ఉంది కాబట్టి రైతులు ఎక్కువగా సన్నరకాలు పండించేలా చైతన్య పరచాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రైతులంతా ఒకే పంట కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలి. అలా అయితేనే అన్ని పంటలకు డిమాండ్ వస్తుంది. తక్కువ శ్రమ, ఎక్కువ దిగుబడి, మార్కెట్ అవకాశాలు, మంచి ఆదాయం పొందగలిగే పంటలను గుర్తించాలి. వాటిని రైతులకు సూచించాలి. ఏ రైతు ఏ పంట వేయాలో నిర్ణయించి, సాగు చేయించాలి. వేరుశనగ, కందులు, పామాయిల్‌లాంటి వాటికి మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇంకా ఇలాంటి డిమాండ్ కలిగిన పంటలను గుర్తించాలి. వాటిని ఎన్ని ఎకరాల్లో పండించాలి? అనే విషయం తేల్చాలి. రాష్ట్రంలో కూరగాయలు, పండ్లకు కొరత ఉంది. అవి ఏ మోతాదులో పండించాలనే దానిపై కూడా అధ్యయనం జరగాలి. నీటి వసతి పెరిగినందున ఫిష్ కల్చర్‌ను కూడా తెలంగాణలో విస్తరించవచ్చా? అనే విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించాలి. ఎరువుల వాడకం ఇప్పటిలాగానే ఉండాలా? మార్పులు అవసరమా? అనేది కూడా పరిశీలించాలి. పూర్తి స్థాయి అధ్యయనంచేసి మే 5లోగా నివేదిక ఇవ్వాలి’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మరో 40లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు నిర్మించాలని నిర్ణయించినందున వెంటనే స్థలాలను గుర్తించాలని, కొత్తగా నిర్మించే గోదాముల్లో కోల్డ్ స్టోరేజ్ సదుపాయం కల్పించాలని సీఎం సూచించారు. -
డిమాండ్‌ను బట్టి ..పుంజుకుంటున్న ధర
ఖమ్మంవ్యవసాయం : పెరుగుతున్న డిమాండ్‌తో మిర్చి ధర పుంజుకుంటోంది. కొత్త మిర్చి ధర రూ.10వేల అంచుకు చేరింది. గత ఏడాది పంటకు ధర లేకపోవడంతో రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేయగా.. ప్రస్తుతం ఆ పంట రూ.11వేలు పలుకుతోంది. ఇక్కడ పండించిన ‘తేజా’ రకం మిర్చికి విదేశాల్లో డిమాండ్ పెరుగుతుండడంతో ధర పెరుగుతోంది. తేజా మిర్చికి చైనాతోపాటు మరికొన్ని దేశాల్లో కూడా డిమాండ్ ఉంటుంది. దీనికి ఘాటు.. కారం కూడా ఎక్కువే. దీంతో ఈ మిర్చిని విదేశాల్లో వివిధ రకాలుగా వినియోగిస్తుంటారు. కొందరు వ్యాపారులు కొనుగోలు చేసి తొడిమలు తీయించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ రకం మిర్చి ఆధారంగా చైనీయులు జిల్లాలోని ముదిగొండ మండలంలో ఓ ఫ్యాక్టరీని కూడా నెలకొల్పారు. మిల్లు ద్వారా పెద్ద ఎత్తున తేజా రకం మిర్చి కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేజా రకం మిర్చిని రైతులు సాగు చేస్తున్నారు. దీనికి విదేశాల్లో డిమాండ్ ఉండడంతో రైతులు ఈ రకం మిర్చి సాగుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ఏడాది ఈ పంటకు రైతులు ఆశించిన స్థాయిలో ధర పలకలేదు. క్వింటాల్‌కు సగటున రూ.7వేలకు మించి ధర పలకలేదు. అయినప్పటికీ రైతులు మిర్చి సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 80వేల ఎకరాల్లో పంట సాగు చేసినప్పటికీ ఆది నుంచి పంటకు ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. ఆరంభంలో అధిక వర్షాలు కురవడం ఓ ప్రతికూల అంశం కాగా.. ఆ తర్వాత అసలు వర్షాలు లేకుండా పోయాయి. దీంతో పైరు ఆశాజనకంగా లేకుండా పోయింది. దీనికి తోడు వాతావరణంలో వచ్చిన మార్పులతో చీడపీడలు ఆశించాయి. ప్రధానంగా జెమినీ వైరస్ ప్రభావం అధికంగా ఉండడంతో దిగుబడులపై ప్రభావం చూపుతోంది. ముందుగా వేసిన మిరప తోటల నుంచి ఉత్పత్తి కొంత మేరకు వస్తోంది. తొలి దశలో వచ్చే పంట ఉత్పత్తి మైలకాయను రైతులు నిల్వ ఉంచరు. దీనిని కోసిన వెంటనే విక్రయిస్తారు. ఈ పంటకు మార్కెట్లో కొంత మేరకు ధర పలుకుతోంది. కాయ నాణ్యత సామాన్యంగా ఉన్నా.. ధర మాత్రం రూ.9,500 నుంచి రూ.9,800 వరకు పలుకుతోంది. ధర రూ.10వేల అంచుకు చేరడంతో రైతులు కోసిన పంటను వెంటనే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. గడిచిన 10 రోజులుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు కొత్త మిర్చి విక్రయానికి వస్తోంది. ఆశించిన స్థాయిలో మిరప తోటలు లేవని గుర్తించిన వ్యాపారులు, చైనా ఫ్యాక్టరీ యాజమాన్యం మార్కెట్‌కు విక్రయానికి వచ్చే పంటకు ధర పెడుతున్నారు. తొలితీత మైలకాయకే రూ.10వేల వరకు ధర పలుకుతుండడంతో రెండోతీత కాయకు మరింత డిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయని రైతులు ఎంతో ఆశగా ఉన్నాయి. గత ఏడాది రూ.7వేల నుంచి రూ.8వేల వరకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన మిర్చికి మంచి రోజులొచ్చాయి. ఒక దశలో ఈ మిర్చి ధర రూ.6వేల వరకు కూడా పడిపోయింది. దీంతో కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన వ్యాపారులు, çరైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం మిర్చి ధర బాగా పుంజుకుంది. క్వింటాల్‌కు ఏకంగా రూ.11వేలకు చేరింది. జిల్లాలో ఉన్న 33 కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్న మొత్తం బయటకు వస్తోంది. ఒక్కో కోల్డ్ స్టోరేజీలో కెపాసిటీనిబట్టి లక్ష క్వింటాళ్ల వరకు నిల్వ ఉంటుంది. ఆ సరుకంతా ఇప్పుడు విక్రయిస్తున్నారు. అధిక మొత్తంలో వ్యాపారుల సరుకే ఎక్కువగా ఉంది. సరుకు నిల్వ చేసిన వ్యాపారులకు మాత్రం మంచి లాభాలు వస్తున్నాయి. అయితే కోల్డ్ స్టోరేజీలతోపాటు రైతులు పండించిన పంట ఒక్కసారిగా విక్రయానికి వస్తే మాత్రం ధర మందగించే ప్రమాదం కూడా లేకపోలేదని రైతు ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం మిర్చి ధర కొంత మేరకు ఆశాజనకంగానే ఉందని.. మరికొంత పుంజుకుంటే ప్రస్తుత పంట పరిస్థితికి కనీసం పెట్టుబడులు పూడే అవకాశం ఉందని అంటున్నారు. -
రైతు మార్కెట్లలో కోల్డ్ స్టోరేజీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కూరగాయలు, పండ్ల హోల్‌సేల్ మార్కెట్లలో చిన్నపాటి శీతల గిడ్డంగుల ఏర్పాటుకు తాము సిద్ధమని చాంబర్ ఆఫ్ కోల్డ్ స్టోరేజెస్ ఇండస్ట్రీ వెల్లడించింది. ప్రభుత్వం స్థలం సమకూరిస్తే కోల్డ్ స్టోరేజీలను తాము సొంత ఖర్చుతో నిర్మిస్తామని చాంబర్ తెలంగాణ ప్రెసిడెంట్ గుబ్బ నాగేందర్ రావు చెప్పారు. ఇక్కడి హైటెక్స్‌లో నవంబరు 16–17 తేదీల్లో జరుగనున్న ఇండియా కోల్డ్ చైన్ ఎక్స్పో, ట్రేడ్ షో(ఐసీఈ) వివ రాలను సోమవారం మీడియాకు ఆయన వెల్లడిం చారు. ‘రైతు తీసుకొచ్చిన పంటను ఈ గిడ్డంగుల్లో నిల్వ చేయవచ్చు. మార్కెట్లో మంచి ధర ఉన్నప్పడే విక్రయించుకోవచ్చు. రైతులకు అతి తక్కువ ధరకే కోల్డ్ స్టోరేజ్ సేవలు అందుబాటులో ఉంటాయి’ అని వివరించారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలు తగ్గిస్తే పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందన్నారు. కొత్త గిడ్డంగులొస్తున్నాయ్..: దేశవ్యాప్తంగా సు మారు 6,000 కోల్డ్ స్టోరేజ్‌లు ఉన్నాయి. వీటిలో 90% యూపీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఉన్నాయి. తెలంగాణలో 150, ఆంధ్రప్రదేశ్‌లో 200 దాకా ఉన్నాయి. కొత్త గిడ్డంగికి రూ.1.5 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. 180 ప్రాజెక్టులు 2018–19లో సబ్సిడీ అందుకోనున్నాయని గ్లోబల్ కోల్డ్ చైన్ అలయన్స్ భారత ప్రతినిధి అతుల్ ఖన్నా వెల్లడించారు. మల్టీ కమోడిటీ స్టోరేజ్ సెంటర్లకు డిమాండ్ ఉంటోందని అలయాన్స్ మార్కెటింగ్ మేనేజర్ పూర్ణిమా రావత్ చెప్పారు. గుబ్బ కోల్డ్ స్టోరేజ్ విస్తరణ ♦ పౌల్ట్రీ, ఫార్మాలకు గిడ్డంగులు ♦ 2019లో 5 కేంద్రాల ఏర్పాటు ♦ సంస్థ ఎండీ గుబ్బ నాగేందర్ రావు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శీతల గిడ్డంగుల నిర్మాణం, నిర్వహణలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గుబ్బ కోల్డ్ స్టోరేజ్ భారీగా విస్తరిస్తోంది. పౌల్ట్రీ కోసం మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో రెండు గిడ్డంగులను ఏర్పాటు చేయనుంది. ప్రముఖ పౌల్ట్రీ కంపెనీకోసం వీటిని నిర్మించనున్నట్టు గుబ్బ కోల్డ్ స్టోరేజ్ ఎండీ గుబ్బ నాగేందర్ రావు సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఒక్కొక్కటి రూ.9 కోట్ల వ్యయంతో 2 కోట్ల కోడిగుడ్లను నిల్వ చేసే సామర్థ్యంతో ఇవి ఉంటాయన్నారు. ఫార్మా రంగాల కోసం ప్రత్యేకంగా వైజాగ్, గుజరాత్, మహారాష్ట్రలో నిల్వ కేంద్రాలను స్థాపిస్తామన్నారు. ఒక్కో సెంటర్‌కు రూ.10 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పారు. సంస్థ ఇప్పటికే హైదరాబాద్ సమీపంలో ఫార్మా కోసం రెండు గిడ్డంగులు, సీడ్ కంపెనీల కోసం జెర్మ్‌ప్లాసం బ్యాంక్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. పెట్టుబడి పెడితే చాలు.. కమాడిటీ ట్రేడింగ్‌లో 139 ఏళ్లుగా ఉన్న గుబ్బ గ్రూప్ 1987లో తొలి గిడ్డంగిని నెలకొల్పింది. ప్రస్తుతం 17 సెంటర్లను నిర్వహిస్తోంది. ఇందులో 14 మల్టీ కమాడిటీ గిడ్డంగులు. వీటన్నిటి సామర్థ్యం 1,20,000 టన్నులు. సంఖ్య, సామర్థ్యం పరంగా దేశంలో గుబ్బ గ్రూప్ అతి పెద్దది. హైదరాబాద్ సమీపంలోని అన్నారం వద్ద 7,000 టన్నుల సామర్థ్యంతో రూ.7 కోట్లతో నిర్మిస్తున్న మల్టీ కమాడిటీ స్టోరేజ్ సెంటర్ నవంబరులో ఆరంభమవుతుందని నాగేందర్ రావు తెలిపారు. ‘ఔత్సాహిక వ్యాపారులు పెట్టుబడి పెడితే చాలు. గిడ్డంగులను నిర్మించి మేమే నిర్వహిస్తాం. భాగస్వామికి ప్రతినెలా ఆదాయం సమకూరుతుంది’ అని చెప్పారు. పాత గిడ్డంగులను కొనుగోలు చేసేందుకూ సిద్ధమన్నారు. కంపెనీలో 230 మంది ఉద్యోగులున్నారు. -
రైతుల దుస్థితి: కిలో ఆలూ 20 పైసలు
సాక్షి,ఆగ్రా: రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బంగాళాదుంప హోల్‌సేల్ ధరలు దిగజారడంతో రైతులకు కన్నీళ్లు మిగిలాయి. ఆలు ధర కిలోకు 20 పైసలే పలకడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ ఏడాది జూన్‌లో 50 కిలోల ఆలు బ్యాగ్ రూ 400 పలికితే ఇప్పుడది రూ 10కి దిగివచ్చింది. నామమాత్ర ధరకు పడిపోవడంతో రైతులు తమ సరుకును కోల్డ్ స్టోరేజ్‌ల ముందే రోడ్లపై పడవేసి జీవాలకు ఆహారంగా వాడుతున్నారు. ధరలు దారుణంగా దిగజారడంతో కేవలం ఆగ్రాలోనే 2.5 లక్షల టన్నుల బంగాళాదుంపలు రోడ్లపాలయ్యాయి. ఆలూ కిలో 20 పైసలకు పడిపోవడంతో రైతులకు సరుకును మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు అయిన రవాణా ఖర్చూ గిట్టుబాటు కాకపోవడంతో సరుకును వీధులపైనే వదిలివేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్‌లో సరుకును నిల్వ చేద్దామంటే ఒక్కో ప్యాకెట్‌కు రూ 110 స్టోరేజ్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. 50 కిలోల ప్యాకెట్ అమ్మితే రైతుకు దక్కేది కేవలం రూ 10 కావడం గమనార్హం. ధరలు పడిపోవడంతో ఇప్పటికే నిల్వ ఉంచిన సరుకును బయటకు తీసేందుకు రైతులు సాహసించడం లేదు. మరోవైపు విద్యుత్ ఖర్చులైనా ఆదా చేయాలని యోచిస్తున్న కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు తమ ప్రిజర్వేటివ్ మిషన్లను స్విచ్ఆఫ్ చేశారు. దీంతో ఆగ్రా జిల్లాలోని 240 కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆయా కోల్ట్ స్టోరేజ్‌లో నిల్వచేసిన బంగాళాదుంపలు పాడై నేలపాలవుతున్నాయి. వేలాది టన్నుల ఆలు వ్యర్ధమవుతూ పారవేస్తున్నారు. ఆలు ధరలు పడిపోవడం రైతులతో పాటు కోల్డ్ స్టోరేజ్లకూ తీవ్ర ఇబ్బందులను మిగిల్చింది. -
కోల్డ్ స్టోరేజీలపై విజిలెన్స్ దాడులు
మధిర : ఖమ్మం జిల్లాలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మధిర మండలం ఇల్లందుపాడులో కోల్డ్‌స్టోరేజీలపై జరిపిన దాడుల్లో సుమారు 509 టన్నుల నకిలీ కారం బస్తాల నిల్వలను పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అక్రమాల గిడ్డంగులు
పర్చూరు, న్యూస్‌లైన్: శీతల గిడ్డంగులు కోట్ల రూపాయల కుంభకోణాలకు నెలవవుతున్నాయి. జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న మోసాలు సంచలనాలు రేకెత్తిస్తున్నాయి. వ్యవస్థలో ఉన్న లోపాలను అనుకూలంగా మలుచుకొని ఎలా సొమ్ము చేసుకోవచ్చో నిరూపిస్తున్నాయి. ఈ నిర్వాకాల్లో శీతల గిడ్డంగుల యాజమాన్యాలు, బ్యాంకు సిబ్బందే కీలక భూమిక పోషిస్తున్నారు. ఇటీవల పొదిలిలో ఒక శీతల గిడ్డంగిలో సరుకు లేకుండా * 9.30 కోట్ల రుణాలు పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ శీతలగిడ్డంగి నిర్మాణానికి ఒక బ్యాంకు రుణం ఇచ్చింది. లోపల ఉన్న సరుకుకు మాత్రం మరో రెండు బ్యాంకులు రుణాలిచ్చాయి. అలానే ఇంకొల్లు రామతులశమ్మ కోల్డ్ స్టోరేజీలో * 2.30 కోట్లు సరుకు లేకుండానే రైతుల పేరుతో బ్రోకర్, యాజమాన్యం కలిసి రుణాలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో 27 మంది రైతులు జైలుకెళ్లడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పర్చూరు మండలంలోని ఒక బ్యాంకు నుంచి జిల్లా సరిహద్దులో ఉన్న ఒక శీతల గిడ్డంగి యాజమాన్యం 50 కేజీల బస్తాలను 70 కేజీల బస్తాలుగా రాయించి బ్యాంకుల వద్ద రుణాలు పొందింది. దీనికి తోడు రైతులకు చెందిన కోటి రూపాయల విలువైన సరుకు సైతం అమ్ముకున్నట్లు బ్యాంకు విజిలెన్స్ విచారణలో వెల్లడైంది. ఈ విషయమై సుమారు 140 మంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంకొల్లులో ఒక శీతల గిడ్డంగి యాజమాన్యం చీరాలలోని రెండు ప్రైవేటు బ్యాంకులతో పాటు స్థానికంగా ఉన్న మరో బ్యాంకు వద్ద రుణాలు పొందారు. స్థానిక బ్యాంకులోనే * 5 కోట్ల రుణం పొందినట్లు సమాచారం. గిడ్డంగిలో ఉన్న సరుకు వేలం వేద్దామన్నా యాజమాన్యం సహకరించడం లేదు. వేలం వేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయనే సహకరించడం లేదని తెలుస్తోంది. ఇంకొల్లు సమీపంలోని మరో రెండు శీతల గిడ్డంగుల్లో కూడా సరుకు లేకుండా రుణాలు పొందినట్లు ఆరోపణలున్నాయి. తాజాగా పర్చూరులోని ఒక శీతల గిడ్డంగిలో * 19 కోట్లకుపైగా పంట ఉత్పత్తులపై రుణాలు పొంది సకాలంలో చెల్లించలేదని స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా తరఫున రైతులకు నోటీసులు జారీ చేశారు. మరో రెండు బ్యాంకులు నోటీసులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం నెల రోజులుగా స్థానికంగా చర్చనీయాంశమైంది. బ్యాంకు నోటీసులిచ్చిన జాబితాలో సరుకుపై తీసుకున్న రుణమెంత..సరుకు లేకుండా తీసుకున్న రుణమెంతో అంతుచిక్కడం లేదు. వీరిలో కొందరు రైతులు నగదు చెల్లించేందుకు గడువు కోరడంతో వేలాన్ని బ్యాంకర్లు వాయిదా వేశారు. ఇలా శీతల గిడ్డంగుల అక్రమాల వ్యవహారాలు రోజురోజుకూ సంచలనాలు రేకెత్తిస్తున్నాయి. బ్యాంకుల వద్ద నుంచి నోటీసులు అందుకున్న రైతులు ఆందోళనలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మేలు చేస్తారని చెప్పి 33 శాతం రాయితీలిచ్చి ప్రభుత్వం శీతలగిడ్డంగుల నిర్మాణాలను ప్రోత్సహించింది. తీరా చూస్తే శీతలగిడ్డంగుల్ని అక్రమాల పుట్టలుగా మార్చేశారు. ప్రారంభంలో బాగానే పనిచేసినప్పటికీ తర్వాత అక్రమాల బాటపట్టారు. బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కై కోట్ల రూపాయలు స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా చోట్ల నమ్మకం మీద రైతుల వద్ద నుంచి పర్మిట్లు తీసుకున్నారు. మరి కొన్ని చోట్ల రైతులకు తెలియకుండానే రుణాలు స్వాహా చేశారు. నిబంధనల ప్రకారం రైతు తీసుకున్న రుణం రైతు బ్యాంకు ఖాతాకు జమచేయాలి. అయితే అలాంటి నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు లేవు.. సరుకుపై రుణం ఇచ్చిన బ్యాంకర్లు ఏటా ఇన్స్పెక్షన్ (తనిఖీ) ఫీజు వసూలు చేస్తున్నారు. లేని సరుకుకు రుణాలిచ్చిన బ్యాంకర్లు తనిఖీ ఫీజులు వసూలు చేయడం గమనార్హం. జిల్లా మొత్తంగా పూర్తి నిబంధనలతో నిర్వహిస్తున్న శీతలగిడ్డంగులు నాలుగైదుకంటే లేవంటే కుంభకోణం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా మొత్తం మీద ఈ కుంభకోణం *100కోట్లకు పైగా ఉండవచ్చనేది ప్రాథమిక సమాచారం. రైతుల జీవితాలతో ముడిపడిన అంశం కాబట్టి జిల్లాలోని అక్రమాలకు పాల్పడ్డ శీతల గిడ్డంగులన్నింటిపై పూర్తిస్థాయి విచారణ జరిపితేనే నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.