సాక్షి,ఆగ్రా: రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బంగాళాదుంప హోల్‌సేల్ ధరలు దిగజారడంతో రైతులకు కన్నీళ్లు మిగిలాయి. ఆలు ధర కిలోకు 20 పైసలే పలకడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ ఏడాది జూన్‌లో 50 కిలోల ఆలు బ్యాగ్ రూ 400 పలికితే ఇప్పుడది రూ 10కి దిగివచ్చింది. నామమాత్ర ధరకు పడిపోవడంతో రైతులు తమ సరుకును కోల్డ్ స్టోరేజ్‌ల ముందే రోడ్లపై పడవేసి జీవాలకు ఆహారంగా వాడుతున్నారు.
ధరలు దారుణంగా దిగజారడంతో కేవలం ఆగ్రాలోనే 2.5 లక్షల టన్నుల బంగాళాదుంపలు రోడ్లపాలయ్యాయి. ఆలూ కిలో 20 పైసలకు పడిపోవడంతో రైతులకు సరుకును మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు అయిన రవాణా ఖర్చూ గిట్టుబాటు కాకపోవడంతో సరుకును వీధులపైనే వదిలివేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్‌లో సరుకును నిల్వ చేద్దామంటే ఒక్కో ప్యాకెట్‌కు రూ 110 స్టోరేజ్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. 50 కిలోల ప్యాకెట్ అమ్మితే రైతుకు దక్కేది కేవలం రూ 10 కావడం గమనార్హం.
ధరలు పడిపోవడంతో ఇప్పటికే నిల్వ ఉంచిన సరుకును బయటకు తీసేందుకు రైతులు సాహసించడం లేదు. మరోవైపు విద్యుత్ ఖర్చులైనా ఆదా చేయాలని యోచిస్తున్న కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు తమ ప్రిజర్వేటివ్ మిషన్లను స్విచ్‌ఆఫ్ చేశారు. దీంతో ఆగ్రా జిల్లాలోని 240 కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆయా కోల్ట్ స్టోరేజ్‌లో నిల్వచేసిన బంగాళాదుంపలు పాడై నేలపాలవుతున్నాయి. వేలాది టన్నుల ఆలు వ్యర్ధమవుతూ పారవేస్తున్నారు. ఆలు ధరలు పడిపోవడం రైతులతో పాటు కోల్డ్ స్టోరేజ్‌లకూ తీవ్ర ఇబ్బందులను మిగిల్చింది.
Comments
Please login to add a commentAdd a comment