potato farmers
-
ఆలుగడ్డల సాగులో నూతన విధానం
-
UP Assembly Election 2022: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!
UP Assembly Election 2022: ఎన్నికల్లో కీలకం కావడానికి ఏవో పెద్ద పెద్ద అంశాలే ఉండనక్కర్లేదు. ఆకాశాన్నంటే ఉల్లిపాయ ధరలు ప్రభుత్వాన్ని దించేయగలవు. పాతాళాన్ని తాకే బంగాళ దుంప ధరలు అధికార పార్టీలో దడ పుట్టించగలవు. ఉత్తరప్రదేశ్‌లో శ్రీకృష్ణుడు జన్మించిన మథురలో ఎన్నికల కాక ఆలూ చుట్టూ రాజుకుంది. వీటి ధరలు రాత్రికి రాత్రి పడిపోయి రైతుల్ని కష్టాల్లోకి నెట్టేసాయి. యూపీలోని ఆగ్రా–మథుర నుంచి కాన్పూర్–ఇటావా వరకు ఆలూ ఎక్కువగా పండుతుంది. (దేశవ్యాప్తంగా పండే ఆలూలో 30% ఇక్కడే పండిస్తారు). హోల్‌సేల్ మార్కెట్లో కొన్నాళ్ల క్రితం వరకు కేజీకి రూ.8, 9 పలికే ధరలు ఇప్పుడు హఠాత్తుగా రూ.5 , 6కి పడిపోయాయి. డీజిల్, ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోవడం, కోల్డ్‌స్టోరేజీల్లో ఉంచడానికయ్యే ఖర్చులతో రైతులకు పంట వ్యయం తడిసిమోపెడవుతోంది. కేజీ ఆలూ పండించడానికి రూ.10 వరకు ఖర్చు అవుతుంటే, మార్కెట్లో 50 కేజీలున్న బస్తాకి రూ.200–250 ధర మాత్రమే పలుకుతోంది (అంటే కేజీకి రూ.5 కంటే తక్కువ). దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు. ‘‘ఇక్కడ మాకు మరే పని చెయ్యడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఎలాంటి ఉపాధి సదుపాయాలు కల్పించలేదు.పరిశ్రమలేవీ రాలేదు. బంగాళ దుంపల ధరలు పడిపోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈసారి మా ఓటు సమాజ్‌వాదీ పార్టీకే’’ అని మహమ్మద్ అన్వర్ అనే రైతు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మథుర పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కూడా రైతాంగ సమస్యలు పట్టించుకోని కమలనాథులు మథురలో శ్రీకృష్ణుడికి ఆలయం కట్టిస్తామంటూ హిందుత్వ ఎజెండానే అందుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
విత్తన హక్కులలో... రైతు విజయం
ప్రపంచం మొత్తంలో ఒక్క మన దేశ రైతులకు మాత్రమే విత్తనాలకు సంబంధించి విశిష్ట హక్కులు ఉన్నాయి. రైతులకు మేధోసంపత్తి హక్కు కల్పించడం కోసం మన పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి 20 ఏళ్లయ్యింది. విత్తనాలను ఇచ్చి పుచ్చుకోవడానికి సంబంధించి భారతీయ రైతులకున్న విశిష్ట హక్కుల చరిత్రలో మైలురాయి వంటి ఓ తీర్పు ఇటీవల వెలు వడింది. ఓ బహుళ జాతి కంపెనీకి చెంప పెట్టులాంటి తీర్పు ఇది. వేప, పసుపు, బాస్మతి బియ్యంపై అనాదిగా మన దేశానికి ఉన్న మేధో సంపత్తి హక్కుల తస్కరణకు గతంలో వివిధ కంపెనీల ఆధ్వ ర్యంలో ప్రయత్నాలు జరిగాయి. వాటిని ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థలో డా. వందనా శివ వంటి ఉద్యమకారిణులు సమర్థ వంతంగా తిప్పికొట్టిన ఘన చరిత్ర మనకుంది. ఈ నేపథ్యంలో చట్టబద్ధ రైతాంగ విత్తన హక్కుల పరిరక్షణ కృషిలో తాజా తీర్పు గుజరాత్ రైతులకు సంబంధించిందే కానీ.. దేశంలో రైతులందరికీ గొప్ప విజయం అనటంలో సందేహం లేదు. గుజరాత్ రైతులపై పెప్సీ కేసులు గుజరాత్ బంగాళదుంప రైతులకు వ్యతిరేకంగా మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కేసులు పెట్టిన బహుళ జాతి కంపెనీ పెప్సికో ఇండియా హోల్డింగ్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. బంగాళదుంప వంగడంపై పెప్సికో కంపెనీకి గతంలో ఇచ్చిన మేధో సంపత్తి హక్కులను కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ‘పంట వంగడాల పరిరక్షణ మరియు రైతుల హక్కుల ప్రాధికార సంస్థ (పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ.)’ ఇటీవల రద్దు చేయటంతో రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇరవయ్యేళ్ల క్రితం పంట వంగడాల పరిరక్షణ మరియు రైతుల హక్కుల చట్టం–2001 ప్రకారం పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. ఏర్పాటైంది. (చదవండి: రైతాంగ సమస్యలే రాజకీయ ఎజెండా) విత్తన శాస్త్రవేత్తలు/ కంపెనీలు రూపొందించే కొత్త వంగడాలతో పాటు.. రైతులు సంప్రదాయ విజ్ఞానంతో రూపొందించే కొత్త వంగడాలకు కూడా ఈ చట్టం మేధో సంపత్తి హక్కులను కల్పిస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తుంది. ఇలా ధ్రువీకరణ పొందిన కంపెనీల వంగడాలను సాగు చేసే రైతులు తమ పంట దిగుబడులను విత్తనాల కోసం వాడుకోవటంతోపాటు.. ఇతరులకు విక్రయించుకోవ టానికి కూడా ఈ చట్టం రైతులకు విశిష్ట హక్కును కల్పిస్తోంది. ప్రత్యే కంగా బ్రాండ్ పేరు ముద్రించిన సంచుల్లో పోసి విక్రయించకూడదు. అయితే, భారతీయ రైతులకున్న ఈ విశిష్ట హక్కును కాలరాసిన పెప్సికో కంపెనీకి చెంపపెట్టు లాంటి తీర్పును పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. వెలు వరించింది. లేస్ చిప్స్ తయారీకి వాడే ప్రత్యేక బంగాళదుంప వంగ డానికి గతంలో ఈ కంపెనీకి ఇచ్చిన మేధాహక్కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ ఈ తీర్పు వెలువడింది. పి.పి.వి. అండ్ ఎఫ్.ఆర్.ఎ. ఏర్పాటైన తర్వాత ఇలా ఒక వంగడంపై ధ్రువీకరణను రద్దు చేయటం ఇదే మొదటి సారి కావటంతో జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, వాణిజ్య వర్గాల్లో తీవ్ర సంచలనం రేగింది. (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!) అసలేం జరిగిందంటే.. లేస్ చిప్స్ తయారీ కోసం ఉపయోగించేందుకు ఉద్దేశించిన ఎఫ్.ఎల్. 2027 అనే రకం బంగాళదుంప వంగడంపై పెప్సికో ఇండియా హోల్డింగ్ కంపెనీ ‘పంట వంగడాల పరిరక్షణ, రైతుల హక్కుల ప్రాధికార సంస్థ’లో 2016లో రిజిస్ట్రేషన్ చేయించి మేధో సంపత్తి హక్కులను పొందింది. గుజరాత్లో 12,000 మంది రైతులతో కొనుగోలు ఒప్పందం చేసుకొని ఎఫ్.ఎల్.2027 రకం బంగాళదుంపలను పెప్సికో కంపెనీ సాగు చేయించింది. అయితే, ఈ రైతుల వద్ద నుంచి ఈ రకం బంగాళదుంప విత్తనాలు పొంది అక్రమంగా సాగు చేయడం ద్వారా 9 మంది గుజరాత్ రైతులు మేధో సంపత్తి ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొంటూ 9 మంది గుజరాత్ రైతులపై కేసులు పెట్టింది. ఒక్కో రైతు నుంచి తమకు రూ. కోటి పరిహారం ఇప్పించాల్సిందిగా కూడా పెప్సికో కంపెనీ వ్యాజ్యంలో కోరింది. రైతులపై కేసులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనోద్యమం పెల్లుబకటంతో కంపెనీ వెనక్కి తగ్గి, కేసులు ఉపసంహరించుకుంది. (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?) కవిత దరఖాస్తు ‘పంట వంగడాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం–2001’ మన దేశంలో రైతులకు రిజిస్టరైన విత్తనాలను విత్తుకోవటం, దాచుకోవటం, ఇతరులతో పంచుకోవటం, బ్రాండ్ ముద్ర వేయకుండా ఇతరులకు విక్రయించుకునే హక్కులను కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆ వంగ డంపై పెప్సికో కంపెనీకి మేధో సంపత్తి హక్కుల ధ్రువీకరణ ఇవ్వటం సమంజసం కాదని, ఆ ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ ప్రముఖ రైతు హక్కుల ఉద్యమకారిణి, కురుగంటి కవిత 2019 జూన్ 11న పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ.కు దరఖాస్తు చేశారు. 30 నెలల సుదీర్ఘ విచా రణ తర్వాత పెప్సికో కంపెనీకి ఎఫ్.ఎల్. 2027 బంగాళదుంప వంగ డంపై ఇచ్చిన మేధాహక్కుల ధ్రువీకరణను రద్దు చేస్తూ డిసెంబర్ 3న పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ. చైర్పర్సన్ కె.వి. ప్రభు తీర్పు ఇచ్చారు. ప్రజాప్రయోజనాలకు విఘాతం ధ్రువీకరణ కోసం కంపెనీ తప్పుడు సమాచారం ఇచ్చినందున, రిజి స్ట్రార్‌కు తగిన సమాచారాన్ని, పత్రాలను అందించనందున, పంట వంగ డాల పరిరక్షణ, రైతుల హక్కుల చట్టం –2001 (సెక్షన్ 34 హెచ్) ప్రకారం ‘ప్రజాప్రయోజనాల’కు విఘాతం కలుగుతున్నందున, ధ్రువీ కరణ పొందిన వ్యక్తికి తగిన యోగ్యత లేనందున మేధాహక్కుల ధ్రువీ కరణ పత్రాన్ని రద్దు చేస్తున్నట్లు పి.పి.వి–ఎఫ్.ఆర్.ఎ. చైర్పర్సన్ కె.వి. ప్రభు ప్రకటించారు. రద్దు కాకుండా ఉంటే 2031 జనవరి 31 వరకు పెప్సికోకు మే«ధా సంపత్తి హక్కులు కొనసాగేవి. రైతుల చట్టబద్ధమైన విత్తన హక్కులను, స్వేచ్ఛను తుంగలో తొక్కాలని ప్రయత్నించే విత్తన, ఆహార, పానీయాల వాణిజ్య సంస్థల ఆటలు సాగవని చెప్పడానికి ఈ తీర్పు ఒక హెచ్చరికగా నిలుస్తుంది. – పంతంగి రాంబాబు, సీనియర్ జర్నలిస్టు -
లేడీ రోసెట్టాతో.. ఏడాదికి రూ. 25కోట్లు
అహ్మదాబాద్: గుజరాత్‌లోని ఒకే కుటుంబానికి చెందిన పది మంది రైతులు బంగాళాదుంపలను పండించి ఏడాదికి 25 కోట్లు సంపాదిస్తున్నారు. లేడీ రొసెట్టా(ఎల్ఆర్)రకానికి చెందిన ప్రత్యేక బంగాళాదుంపలను సంవత్సరానికి 20,000 మెట్రిక్ టన్నులను పండించి లాభాలను అర్జిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తె..అరవల్లి జిల్లా దోల్పూర్ కంపాకు చెందిన జితేష్ పటేల్ అనే రైతు బంగాళా దుంపలను పండిస్తూ దేశంలోనే రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత 25 సంవత్సరాలుగా జితేష్ కుటుంబం బంగాళాదుంపలను పండిస్తున్నట్లు జితేష్ తెలిపారు. గ్లోబల్ పొటాటో కాంక్లేవ్-2020లో పాల్గొన్న జితేష్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. జితేష్ మాట్లాడుతూ.. తాను ఎమ్మెస్సీ అగ్రికల్చర్ కోర్సును అభ్యసించానని అందులో నేర్చుకున్న మెళకువలను ఎల్ఆర్ పంట పండించడానికి ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. తాము 2007లో పది ఎకరాలతో ఎల్ఆర్ బంగాళాదుంప పంట సేద్యం చేశామని, ప్రస్తుతం వెయ్యి ఎకరాలతో సేద్యం చేస్తున్నామని తెలిపారు. ఎల్ఆర్ రకానికి చెందిన ప్రత్యేక బంగాళాదుంప తయారీదారులకు విపరీతమైన డిమాండ్ ఉందని టెక్నో అగ్రి సైన్సెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సచిన్ మాదన్ తెలిపారు. గుజరాత్ రాష్ట్రం నుంచి లక్ష టన్నులు ఎల్ఆర్ బంగాళాదుంపలను ఇండోనేషియా, కువైట్, ఒమన్, సౌదీ అరేబియా తదితర దేశాలు కొనుగోళ్లు చేశాయని తెలిపారు. తమ కుటుంబానికి పాథాలజీ, మైక్రోబయాలజీ, హార్టికల్చర్ తదితర రంగాలలో నైపుణ్యం ఉందని జితేష్ పటేల్ పేర్కొన్నారు. ఈ రకమైన బంగాళాదుంపలు చిప్స్ , వేఫర్స్ తయారీకి ఎంతో ఉపయోగకరమని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జితేష్ కుటుంబం పండించిన బంగాళాదుంపలను ప్రముఖ చిప్స్ తయారీ కంపెనీలు బాలాజీ, ఐటీసీలు కొనుగోళ్లు చేస్తుండడం విశేషం. -
ఆలూ రైతులపై పెప్సీ కేసులు వెనక్కి!
అహ్మదాబాద్: గుజరాత్లో బంగాళదుంపలు పండించిన రైతులపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు ఆహార, పానీయ ఉత్పత్తుల సంస్థ పెప్సీకో గురువారం ప్రకటించింది. గుజరాత్‌లోని కొంతమంది రైతులు ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపలను పండించగా, ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్త 11 మంది రైతులపై కేసు వేయడం తెలిసిందే. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్ చిప్స్ తయారీకి వినియోగిస్తోంది. పెప్సీకో కేసు వేయడంతో మన దేశంలో రైతులు ఏం పండించాలో ఒక విదేశీ సంస్థ శాసించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పెప్సీ తాజాగా వెనక్కి తగ్గింది. -
‘ఆలూ పండిస్తారా.. రూ. కోటి ఫైన్ కట్టండి’
గాంధీనగర్ : గంజాయి లాంటి పంట పండిస్తే నేరం కానీ.. బంగాళాదుంపలను పండిస్తే కేసు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా. అసలు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగకపోయినా మన దేశంలో మాత్రం జరుగుతాయి. ఎందుకంటే మన ప్రజా ప్రభుత్వాలకు.. కార్పొరేట్ కంపెనీలంటేనే మక్కువ ఎక్కువ. వాటి కోసం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములను లాక్కుంటాయి.. అవసరమైతే నోటి కాడి కూడును కూడా లాక్కుని కార్పొరేట్ కంపెనీలకు వడ్డిస్తాయి. ఈ విషయంలో అన్ని పార్టీలది ఒకటే విధానం. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో చోటు చేసుకుంది. పెప్సీకో కంపెనీ బంగాళాదుంపలు పండిస్తున్నందుకు అక్కడి రైతుల మీద కేసులు పెట్టింది. ఆ వివరాలు.. అమెరికా కంపెనీ పెప్సీకో ఇండియా తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ 9 మంది గుజరాత్ రైతుల మీద కేసు పెట్టింది. లేస్ చిప్స్ తయారు చేయడం కోసం తాము వినియోగించే ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంపలను భారత్‌లో తామే రిజిస్టర్ చేయించామని పెప్సీకో పేర్కొంది. కానీ గుజరాత్‌కు చెందిన రైతులు తమ అనుమతి లేకుండా ఆ రకం ఆలూని పండించారంటూ వారిపై కేసులు నమోదు చేసింది. పెప్సీకో చర్యల పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామజిక కార్యకర్తలు, రైతులు పెప్సీకో చర్యలను తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో 200 మందికి పైగా రైతు సంఘాల కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. సదరు కంపెనీ రైతుల మీద పెట్టిన కేసులను విత్‌డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ సామజిక కార్యకర్త ఈ విషయంపై స్పందిస్తూ.."పెప్సీకో కంపెనీ సాబర్కాంఠాలో 9 మంది రైతులపై కేసులు పెట్టింది. నలుగురు రైతుల మీద కోటి రూపాయల దావా.. మరో ఐదుగురి మీద రూ. 20 లక్షల దావా వేసింది" అని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి పెప్సీకో అధికారులు మాట్లాడుతూ.. ‘పెప్సీకో కంపెనీ సహకార వ్యవసాయ కార్యక్రమంలో వేల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. వారికి మాత్రమే ఈ రకం బంగాళాదుంపలను పండించేందుకు అనుమతిచ్చాం. సదరు రైతులు పండించిన పంటను కూడా మేమే కొంటా. అలాంటిది ఇప్పుడు బయటి వారు కూడా ఇదే రకం బంగాళాదుంపలను పండిస్తే.. సహకార వ్యవసాయ కార్యక్రమంలో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుంది. వారి ప్రయోజనాలను కాపడటం కోసమే కోర్టును ఆశ్రయించాం’ అని పెప్సీకో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వివాదం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో సదరు కంపెనీ కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే నలుగురు రైతులతో సెటిల్మెంట్ కుదుర్చుకుంది. దానిలో భాగంగా ప్రస్తుతం సదరు రైతులు పండించిన పంటను కంపెనీకే అమ్మాలి.. లేదా అసలు ఈ బంగాళాదుంపలను పండిచడమే మానుకోవాలంటూ షరతులు విధించింది. పెప్సీకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2016 ఫిబ్రవరి 1న ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంప విత్తనాలను సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేసింది. దాని ప్రొటెక్షన్ పిరియడ్ జనవరి 31, 2031 వరకూ ఉన్నట్లు పెప్సీకో అధికారులు తెలిపారు. -
రైతుల దుస్థితి: కిలో ఆలూ 20 పైసలు
సాక్షి,ఆగ్రా: రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా బంగాళాదుంప హోల్‌సేల్ ధరలు దిగజారడంతో రైతులకు కన్నీళ్లు మిగిలాయి. ఆలు ధర కిలోకు 20 పైసలే పలకడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఈ ఏడాది జూన్‌లో 50 కిలోల ఆలు బ్యాగ్ రూ 400 పలికితే ఇప్పుడది రూ 10కి దిగివచ్చింది. నామమాత్ర ధరకు పడిపోవడంతో రైతులు తమ సరుకును కోల్డ్ స్టోరేజ్‌ల ముందే రోడ్లపై పడవేసి జీవాలకు ఆహారంగా వాడుతున్నారు. ధరలు దారుణంగా దిగజారడంతో కేవలం ఆగ్రాలోనే 2.5 లక్షల టన్నుల బంగాళాదుంపలు రోడ్లపాలయ్యాయి. ఆలూ కిలో 20 పైసలకు పడిపోవడంతో రైతులకు సరుకును మార్కెట్‌కు తీసుకువచ్చేందుకు అయిన రవాణా ఖర్చూ గిట్టుబాటు కాకపోవడంతో సరుకును వీధులపైనే వదిలివేస్తున్నారు. కోల్డ్ స్టోరేజ్‌లో సరుకును నిల్వ చేద్దామంటే ఒక్కో ప్యాకెట్‌కు రూ 110 స్టోరేజ్ ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి. 50 కిలోల ప్యాకెట్ అమ్మితే రైతుకు దక్కేది కేవలం రూ 10 కావడం గమనార్హం. ధరలు పడిపోవడంతో ఇప్పటికే నిల్వ ఉంచిన సరుకును బయటకు తీసేందుకు రైతులు సాహసించడం లేదు. మరోవైపు విద్యుత్ ఖర్చులైనా ఆదా చేయాలని యోచిస్తున్న కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు తమ ప్రిజర్వేటివ్ మిషన్లను స్విచ్ఆఫ్ చేశారు. దీంతో ఆగ్రా జిల్లాలోని 240 కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆయా కోల్ట్ స్టోరేజ్‌లో నిల్వచేసిన బంగాళాదుంపలు పాడై నేలపాలవుతున్నాయి. వేలాది టన్నుల ఆలు వ్యర్ధమవుతూ పారవేస్తున్నారు. ఆలు ధరలు పడిపోవడం రైతులతో పాటు కోల్డ్ స్టోరేజ్లకూ తీవ్ర ఇబ్బందులను మిగిల్చింది. -
బంగాళదుంప రైతులపై నోట్ల రద్దు ఎఫెక్ట్
-
ఆశలు వదులుకోవాల్సిందే
జహీరాబాద్, న్యూస్‌లైన్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలు ‘ఆలు’ రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. విత్తనం భూమిలోనే కుళ్లిపోవడంతో పంట మొలకెత్తలేదు. నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో రైతులు భారీ విస్తీర్ణంలో ఆలుగడ్డ పంటను సాగు చేసుకున్నారు. వర్షాల కంటే ముందు సాగు చేసుకున్న ఆలుగడ్డ పంట భూమిలోనే కుళ్లి పోయింది. సుమారు వేయి ఎకరాలకు పైగా ఆలుగడ్డ పంట కుళ్లిపోయినట్లు అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలును సాగు చేస్తున్న రైతులు ఈ సారి నష్టపోయారు. వేసిన పంట మొలకెత్తకుండానే పొలాల్లో కుళ్లి పోవడంతో దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ చర్యలే తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పంటనష్టంపై సర్వే చేయకపోవడం దారుణంగా ఉందంటున్నారు. పెట్టుబడులు పూర్తిగా నేలపాలు ఆలు పంటసాగు కోసం రైతులు పెట్టిన పెట్టుబడులు పూర్తిగా నేల పాలయ్యాయి. ఎకరా పొలంలో పంట సాగు కోసం విత్తనంపై రూ.15 వేలు, ఎరువుల కోసం రూ.5 వేలు, భూమి చదును కోసం రూ.5 వేలు, సాగు కోసం రూ.5 వేలు ఇలా ఎకరాకు రూ.30 వేలు ఆలు రైతులు పెట్టుబడులు పెట్టారు. అయితే అధిక వర్షాలతో విత్తనం కుళ్లిపోవడంతో మొలకలు రాలేదు. దీంతో పెట్టుబడి అంతా వృథా అయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల కోసం అధిక వడ్డీలపై అప్పులు చేశామనీ, పంట విత్తనం దశలోనే దెబ్బతినడంతో ఆశలు వదులుకున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకుంటే తప్ప, తాము అప్పుల ఊబి నుంచి బయటపడే అవకాశం లేదన్నారు నిల్వ చేసిన చోటే కుళ్లిపోయింది పంట సాగు కోసం రైతులు ఉత్తర ప్రదేశ్ రాష్ర్టంలోని ఆగ్రా ప్రాంతం నుంచి ఆలు విత్తనాన్ని కొనుగోలు చేశారు. విత్తనం డబ్బును పంటపై చెల్లించేందుకు వ్యాపారులతో వారు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఎడతెరిపిలేని వర్షాలతో ఆలు విత్తనం నిల్వ ఉంచిన చోటే కుళ్లిపోయింది. దీంతో విత్తనం డబ్బును వ్యాపారులకు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.