గాంధీనగర్ : గంజాయి లాంటి పంట పండిస్తే నేరం కానీ.. బంగాళాదుంపలను పండిస్తే కేసు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా. అసలు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగకపోయినా మన దేశంలో మాత్రం జరుగుతాయి. ఎందుకంటే మన ప్రజా ప్రభుత్వాలకు.. కార్పొరేట్ కంపెనీలంటేనే మక్కువ ఎక్కువ. వాటి కోసం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములను లాక్కుంటాయి.. అవసరమైతే నోటి కాడి కూడును కూడా లాక్కుని కార్పొరేట్ కంపెనీలకు వడ్డిస్తాయి. ఈ విషయంలో అన్ని పార్టీలది ఒకటే విధానం. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో చోటు చేసుకుంది. పెప్సీకో కంపెనీ బంగాళాదుంపలు పండిస్తున్నందుకు అక్కడి రైతుల మీద కేసులు పెట్టింది. ఆ వివరాలు..
అమెరికా కంపెనీ పెప్సీకో ఇండియా తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ 9 మంది గుజరాత్ రైతుల మీద కేసు పెట్టింది. లేస్ చిప్స్ తయారు చేయడం కోసం తాము వినియోగించే ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంపలను భారత్‌లో తామే రిజిస్టర్ చేయించామని పెప్సీకో పేర్కొంది. కానీ గుజరాత్‌కు చెందిన రైతులు తమ అనుమతి లేకుండా ఆ రకం ఆలూని పండించారంటూ వారిపై కేసులు నమోదు చేసింది. పెప్సీకో చర్యల పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామజిక కార్యకర్తలు, రైతులు పెప్సీకో చర్యలను తప్పుపడుతున్నారు.
ఈ క్రమంలో 200 మందికి పైగా రైతు సంఘాల కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. సదరు కంపెనీ రైతుల మీద పెట్టిన కేసులను విత్‌డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ సామజిక కార్యకర్త ఈ విషయంపై స్పందిస్తూ.."పెప్సీకో కంపెనీ సాబర్‌కాంఠాలో 9 మంది రైతులపై కేసులు పెట్టింది. నలుగురు రైతుల మీద కోటి రూపాయల దావా.. మరో ఐదుగురి మీద రూ. 20 లక్షల దావా వేసింది" అని చెప్పుకొచ్చారు.
ఈ విషయం గురించి పెప్సీకో అధికారులు మాట్లాడుతూ.. ‘పెప్సీకో కంపెనీ సహకార వ్యవసాయ కార్యక్రమంలో వేల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. వారికి మాత్రమే ఈ రకం బంగాళాదుంపలను పండించేందుకు అనుమతిచ్చాం. సదరు రైతులు పండించిన పంటను కూడా మేమే కొంటా. అలాంటిది ఇప్పుడు బయటి వారు కూడా ఇదే రకం బంగాళాదుంపలను పండిస్తే.. సహకార వ్యవసాయ కార్యక్రమంలో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుంది. వారి ప్రయోజనాలను కాపడటం కోసమే కోర్టును ఆశ్రయించాం’ అని పెప్సీకో అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఈ వివాదం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో సదరు కంపెనీ కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే నలుగురు రైతులతో సెటిల్‌మెంట్ కుదుర్చుకుంది. దానిలో భాగంగా ప్రస్తుతం సదరు రైతులు పండించిన పంటను కంపెనీకే అమ్మాలి.. లేదా అసలు ఈ బంగాళాదుంపలను పండిచడమే మానుకోవాలంటూ షరతులు విధించింది. పెప్సీకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2016 ఫిబ్రవరి 1న ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంప విత్తనాలను సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేసింది. దాని ప్రొటెక్షన్ పిరియడ్ జనవరి 31, 2031 వరకూ ఉన్నట్లు పెప్సీకో అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment