PepsiCo Company
-
పెప్సికో ఇండియా సీఈఓగా జాగృత్ కొటేచా
ప్రముఖ ఆహార, పానీయాల తయారీ సంస్థ పెప్సికో ఇండియా సీఈఓగా 'జాగృత్ కొటేచా' (Jagrut Kotecha) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'అహ్మద్ ఎల్ షేక్'కు కంపెనీ మిడిల్ ఈస్ట్ బ్రాంచ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత కొటేచాను సీఈఓగా ఎంపిక చేశారు. కొటేచా ముంబై యూనివర్సిటీ నుంచి బీఈ, నర్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి మాస్టర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) పూర్తి చేశారు. చదువు పూర్తయిన తరువాత క్యాడ్బరీ ఇండియా సేల్స్‌లో చేరి 1994 వరకు కొనసాగారు. ఆ తరువాత పెప్సికో ఇండియాలో సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో అడుగుపెట్టి 1997లో ప్రాంతీయ సేల్స్ మేనేజర్‌గా, 1999లో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, మలేసియా, సింగపూర్, బృనియా, మంగోలియా దేశాల్లో కూడా పనిచేశారు. జాగృత్ కొటేచా పెప్సికో ఇండియా సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా పెప్సికో ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ & సౌత్ ఏషియా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యూజీన్ విల్లెమ్సెన్ మాట్లాడుతూ.. భారతదేశం కంపెనీకు కీలకమైన మార్కెట్ అని, ఇది కొటేచా నేతృత్వంలో మరింత ముందుకు సాగుతుందని తెలిపారు. ఇదీ చదవండి: యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం! గత కొంత కాలంగా పెప్సికో కుటుంబంలోనే ఉన్న కొటేచా భారతదేశంలో కంపెనీ వ్యాపారాన్ని మరింత బలపరుస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. పెప్సికో ఇండియా గత సెప్టెంబర్‌లో రూ. 778 కోట్ల పెట్టుబడితో అస్సాంలోని నల్బారిలో తన మొదటి ఆహార తయారీ ప్లాంట్‌ను ప్రకటించింది. ఇది 2025 నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
వరుణ్ బెవరేజెస్ చేతికి బెవ్కో
న్యూఢిల్లీ: పానీయాల దిగ్గజం పెప్సీకో ఫ్రాంచైజీ సంస్థ వరుణ్ బెవరేజెస్.. దక్షిణాఫ్రికా కంపెనీ బెవరేజ్ కంపెనీ(బెవ్కో)తోపాటు అనుబంధ సంస్థలను కొనుగోలు చేయనుంది. దక్షిణాఫ్రికా, లెసోఠో, ఎస్వటీని ప్రాంతాలలో పెప్సీకో ఫ్రాంచైజీ హక్కులను బెవ్కో కలిగి ఉంది. 3 బిలియన్ రాండ్ల(జెడ్ఏఆర్) (రూ. 1,320 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వరుణ్ బెవరేజెస్ వెల్లడించింది. తద్వారా దక్షిణాఫ్రికా మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించనుంది. నమీబియా, బోట్స్వానా పంపిణీ హక్కులతోపాటు.. అత్యంత కెఫైన్ కంటెంట్ డ్రింక్ రీఫ్రెష్, ఎనర్జీ డ్రింక్ రీబూస్ట్, కార్బొనేటెడ్ డ్రింక్ కూఈ, జైవ్, ఫిజ్జీ లెమనేడ్ బ్రాండ్లను బెవ్కో కలిగి ఉంది. 2024 జులై31లోగా నగదు ద్వారా లావాదేవీని పూర్తి చేసే వీలున్నట్లు వరుణ్ అంచనా వేస్తోంది. 5 తయారీ కేంద్రాలు 2023లో బెవ్కో రూ. 1,590 కోట్ల టర్నోవర్ సాధించినట్లు వరుణ్ తెలియజేసింది. జోహన్నెస్‌బర్గ్‌లో రెండు, దర్బన్, ఈస్ట్ లండన్, కేప్‌టౌన్‌లో ఒకటి చొప్పున మొత్తం ఐదు తయారీ యూనిట్లను కలిగి ఉంది. నిమిషానికి 3,600 బాటిళ్ల(బీపీఎం) సామర్థ్యం సంస్థ సొంతం. బెవ్కో కొనుగోలు ద్వారా దక్షిణాఫ్రికా మార్కెట్లో విస్తరించనున్నట్లు వరుణ్ వెల్లడించింది. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా అతిపెద్ద పానీయాల మార్కెట్‌కాగా.. రానున్న నాలుగేళ్లలో అంటే 2027కల్లా వార్షిక సగటున 5.3 శాతం చొప్పున వృద్ధి చూపగలదని అంచనా. దేశీయంగా పెప్సీకో అమ్మకాల పరిమాణంలో వరుణ్ బెవరేజెస్ 90 శాతాన్ని ఆక్రమిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది(2022–23) రూ. 10,596 కోట్ల ఆదాయం సాధించింది. బెవ్కో కొనుగోలు వార్తలతో వరుణ్ బెవరేజెస్ షేరు ఎన్ఎస్ఈలో 3.7 శాతం జంప్‌చేసి రూ. 1,174 వద్ద ముగిసింది. -
పెప్సికో కంపెనీకి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు.. కారణం ఏంటంటే?
న్యూయార్క్‌కు చెందిన 'పెప్సికో ఇంక్' (PepsiCo Inc) లేస్ పొటాటో చిప్స్ కోసం ప్రేత్యేకంగా పండించిన పొటాటో రకానికి సంబంధించిన పేటెంట్ మీద కంపెనీ చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ (PPVFR) అథారిటీ 2021లో పెప్సికో FC5 బంగాళాదుంప రకానికి మంజూరు చేసిన మేధో రక్షణను ఉపసంహరించుకుంది. సీడ్ వెరైటీ మీద కంపెనీ పేటెంట్‌ను క్లెయిమ్ చేయలేమని రైతుల హక్కుల కార్యకర్త 'కవిత కురుగంటి' వాదించడంతో పెప్సికో పేటెంట్ కవర్‌ను అథారిటీ తొలగించింది. పేటెంట్ కవర్ రద్దుపై పెప్సికో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అధికార నిర్ణయంపై పెప్సికో చేసిన అప్పీల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి నవీన్ చావ్లా జులై 5 నాటి ఉత్తర్వులో తోసిపుచ్చారు. (ఇదీ చదవండి: త్వరలో రానున్న కొత్త కార్లు - టాటా పంచ్ ఈవీ నుంచి టయోటా రూమియన్ వరకు..) మాకు ఆర్డర్ గురించి తెలుసు, అంతే కాకుండా దానిని సమీక్షించే ప్రక్రియలో ఉన్నామని పెప్సికో ఇండియా ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. 1989లో భారతదేశంలో తన మొట్టమొదటి పొటాటో చిప్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన US స్నాక్స్ అండ్ డ్రింక్స్ తయారీదారు, FC5 సీడ్ రకాన్ని రైతుల సమూహానికి సరఫరా చేసింది. వారు ఆ ఉత్పత్తులను కంపెనీకి ఒక స్థిరమైన ధరకు విక్రయించారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియ. దీనిని కంపెనీ ప్రత్యేకంగా అభివృద్ధి చేసిందని 2016లోనే వెల్లడించింది. (ఇదీ చదవండి: మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇదిగో టాప్ 5 మొబైల్స్!) నిజానికి లేస్ కోసం వినియోగించే FC5 రకం బంగాళాదుంప చిప్స్ వంటి స్నాక్స్ చేయడానికి అవసరమైన తేమను కలిగి ఉంటాయి. కావున కంపెనీ వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేసి వినియోగించుకుంటోంది. అయితే 2019లో పెప్సికో కొంతమంది భారతీయ రైతుల మీద దావా వేసింది. కానీ సాగుదారులు ఈ పేటెంట్ ఉల్లంఘించారని ఆరోపించి ఉల్లంఘన కోసం 121050 డాలర్లను కోరినట్లు సమాచారం. చివరకు నెలరోజుల్లోనే పెప్సికో రైతులపై దావాలను ఉపసంహరించుకుంది. -
టెస్లా ఎలక్ట్రిక్ ట్రక్ వచ్చేసింది..సింగిల్ ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల ప్రయాణం
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ 2017 నవంబర్‌లో టెస్లా సెమీ ట్రక్‌ను ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో 2019 లో ట్రక్ల తయారీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఆ సంస్థ తయారు చేసిన ట్రక్‌ను విడుదల చేశారు. తొలి ఈవీ ట్రక్‌ను ప్రముఖ ఫుడ్ బేవరేజెస్ కంపెనీ పెప్సికోకి అందించారు. మస్క్ సెమీ ఎలక్ట్రిక్ ట్రక్ల తయారీ ప్రకటనతో పెప్సికో 100 ట్రక్లు కొనుగోలు చేసేలా టెస్లాతో సంప్రదింపులు జరిపింది. వాస్తవానికి ఈ వెహికల్స్‌ను పెప్సికోకు 2021లోనే అందించాల్సి ఉంది. కానీ కోవిడ్ కారణంగా తయారీ, విడుదల సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ ఈవీ ట్రక్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ సందర్భంగా వీటిలోని ఓకదాన్ని మస్క్ స్వయంగా నడిపారు. ఈ సెమీ ట్రక్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 37,000 కిలోల బరువుతో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని మస్క్ తెలిపారు. ఫీచర్లు, ధర 37,000 కిలోలు బరువున్న ఈ ట్రక్ 20 సెకన్లలో 0-60mph వేగాన్ని అందుకుంటుంది. సింగిల్ ఛార్జ్‌తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించ వచ్చు. ఇక ఈ వెహికల్ ధర 1,50,000 డాలర్లు ఖరీదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా,ఉత్తర అమెరికాలో 2024లో 50వేల ట్రక్కులను తయారు చేసే లక్ష్యంతో ప్రొడ క్షన్‌ను పెంచాలని కంపెనీ యోచిస్తోంది. -
ఎలన్ మస్క్ చాపకింద నీరులా.. రోడ్లపై రయ్ రయ్ మంటూ ఎలక్ట్రిక్ ట్రక్లు
టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గురించి, ఆయన ప్రతిభాపాటవాలు' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఓ వైపు అంతరిక్షంపై మానవుని మనగడ కోసం ప్రయత్నాలు చేస్తూనే మరో వైపు ఎలక్ట్రిక్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఇప్పుడు చాపకింద నీరులా సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌లను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఉద్గారాలను తగ్గించేందుకే మనం ఇప్పటి వరకు రోడ్లపై తిరిగే ఎలక్ట్రిక్ బైక్స్, కార్లను, బస్సులను మాత్రమే చూసుంటాం. కానీ ఇకపై ఎలక్ట్రిక్ సెమీ ట్రక్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ సందడి చేయనున్నాయి. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ ప్రముఖ బెవరేజెస్ కంపెనీ పెప్సికో'కి తొలిసారి టెస్లా సెమీ ట్రక్‌లను తయారు చేశారు. త్వరలోనే సెమీ ట్రక్‌లను ఈవీ మార్కెట్‌కు పరిచయం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పెప్సికో సీఈఓ రామన్ లగుర్టా సీఎన్బీసీతో మాట్లాడుతూ..పెప్సికో సంస్థ కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయత్నాల్లో భాగంగా ఎలక్ట్రిక్ 2017లోనే సెమీ ట్రక్‌లను తయారు చేసే ప్రాజెక్ట్‌ను టెస్లాకు అప్పగించినట్లు వెల్లడించారు. 2017లోనే 100 సెమీ ట్రక్‌లకు ఆర్డర్ ఎలన్ మస్క్ సంబంధించి బయటి ప్రపంచానికి కేవలం ఎలక్ట్రిక్ కార్ల గురించి మాత్రమే తెలుసు. కానీ తొలిసారి సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌లను తయారు చేయడంలో 2017నుంచి ప్రయత్నాలు ప్రారంభించారు. 2017లోనే పెప్సికో కంపెనీ ఎలన్ మస్క్‌కు 100 సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌లను తయారు చేసే బాధ్యత అప్పగించినట్లు రామన్ సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతేకాదు టెస్లా సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌లను తయారు చేసిందని, వాటిని ఈ ఏడాది డిసెంబర్ నాటికి తమకి అప్పగిస్తున్నట్లు చెప్పారు. ఎలన్ మాట తప్పాడు ఎలన్ మస్క్ ఈ సెమీ ఎలక్ట్రిక్ ట్రక్‌లను 2020 నాటికే పెప్సికోకి అందిస్తామని మాటిచ్చారు. కానీ బ్యాటరీతో పాటు, సప్లయి చైన్ సంబంధిత రంగాల్లో మార్కెట్ డిమాండ్ కారణంగా సెమీ ట్రక్‌లను అందించే విషయంలో ఎలన్ మాట తప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ట్రక్‌లను విడుదల తేదీలను వాయిదా వేసిన మస్క్ ఈ ఏడాది జులైలో మరోసారి ప్రకటించారు. 2022 సెమీ ట్రక్‌లను లాంఛ్ చేస్తామని ప్రకటించారు. పెప్సీకో మాత్రం ఈ ఏడాది చివరి నాటికి కనీసం 15 ఎలక్ట్రిక్ ట్రక్‌లను టెస్లా నుంచి దిగుమతి చేసుకోవాలని భావిస్తుండగా.. టెస్లా ట్రక్ల కొనుగోలు కోసం మరికొన్ని దిగ్గజ కంపెనీలు క్యూకడుతున్నాయి. క్యూ కడుతున్న కంపెనీలు ఎలన్ మస్క్ తయారు చేస్తున్న సెమీ ఎలక్ట్రిక్ 150,000 డాలర్ల నుంచి 180,000 మధ్యలో ఉంది. అయితే వీటిని కొనుగోలు కోసం వాల్‌మార్ట్, ఫెడ్ఎక్స్, అన్హ్యూసర్ బుష్ దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. చదవండి: భూమ్మీద కాదు, అంతరిక్షంపై ఆదిపత్యం కోసం పోటా పోటీ పడుతున్నారు -
ఆలూ రైతులపై పెప్సీ కేసులు వెనక్కి!
అహ్మదాబాద్: గుజరాత్లో బంగాళదుంపలు పండించిన రైతులపై తాము వేసిన కేసులను ఉపసంహరించుకోనున్నట్లు ఆహార, పానీయ ఉత్పత్తుల సంస్థ పెప్సీకో గురువారం ప్రకటించింది. గుజరాత్‌లోని కొంతమంది రైతులు ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపలను పండించగా, ఆ రకం బంగాళదుంపలపై తమకు పంటరకం రక్షణ హక్కులు ఉన్నాయనీ, తమ అనుమతి లేకుండా వీటిని ఎవరూ పండించకూడదంటూ పెప్సీకో మొత్త 11 మంది రైతులపై కేసు వేయడం తెలిసిందే. ఈ రకం బంగాళదుంపలను పెప్సీలో తమ లేస్ చిప్స్ తయారీకి వినియోగిస్తోంది. పెప్సీకో కేసు వేయడంతో మన దేశంలో రైతులు ఏం పండించాలో ఒక విదేశీ సంస్థ శాసించడం ఏంటంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పెప్సీ తాజాగా వెనక్కి తగ్గింది. -
దిగొచ్చిన పెప్సీకో.. కేసులు వాపస్
గాంధీనగర్ : శీతల పానీయాల దిగ్గజం పెప్సీకో ఇండియా దిగొచ్చింది. గుజరాత్ రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది. తమ కంపెనీ పేరుతో భారత్‌లో రిజస్టర్ అయిన బంగాళాదుంపను తన అనుమతి లేకుండా పండిచారనే నేపంతో పెప్సీకో కంపెనీ 9 మంది గుజరాత్ రైతుల మీద కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే పెప్సీకో చర్యల పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దాంతో ప్రభుత్వం ఈ అంశంలో జోక్యం చేసుకోవడంతో కంపెనీ దిగొచ్చింది. రైతుల మీద పెట్టిన కేసులను వాపస్ తీసుకుంటున్నట్లు కంపెని అధికార ప్రతినిధి ప్రకటించారు. ‘ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మా కంపెనీ రైతుల మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకుంది’ అని సదరు అధికారి తెలిపారు. ఈ వివాదం ఈ ఏడాది ఏప్రిల్‌లో తెరమీదకొచ్చింది. తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ పెప్సీకో రైతుల మీద కేసులు పెట్టడమే కాక.. వారి మీద తగిన చర్యలు తీసుకోవాలంటూ అహ్మదాబాద్ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపై కోర్టు కూడా… సానుకూలంగా స్పందించింది. రైతులు ఆ పంటను పండించడంపై స్టే విధించింది. అంతేకాక తమ అనుమతి లేకుండా ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంపలను పండించినందుకు గాను రూ. కోటి జరిమానా చెల్లించాలంటూ పెప్సీకో.. రైతులను డిమాండ్ చేసింది. -
‘ఆలూ పండిస్తారా.. రూ. కోటి ఫైన్ కట్టండి’
గాంధీనగర్ : గంజాయి లాంటి పంట పండిస్తే నేరం కానీ.. బంగాళాదుంపలను పండిస్తే కేసు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా. అసలు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి జరగకపోయినా మన దేశంలో మాత్రం జరుగుతాయి. ఎందుకంటే మన ప్రజా ప్రభుత్వాలకు.. కార్పొరేట్ కంపెనీలంటేనే మక్కువ ఎక్కువ. వాటి కోసం రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములను లాక్కుంటాయి.. అవసరమైతే నోటి కాడి కూడును కూడా లాక్కుని కార్పొరేట్ కంపెనీలకు వడ్డిస్తాయి. ఈ విషయంలో అన్ని పార్టీలది ఒకటే విధానం. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో చోటు చేసుకుంది. పెప్సీకో కంపెనీ బంగాళాదుంపలు పండిస్తున్నందుకు అక్కడి రైతుల మీద కేసులు పెట్టింది. ఆ వివరాలు.. అమెరికా కంపెనీ పెప్సీకో ఇండియా తమ విత్తనాల కాపీరైట్ ఉల్లంఘించారంటూ 9 మంది గుజరాత్ రైతుల మీద కేసు పెట్టింది. లేస్ చిప్స్ తయారు చేయడం కోసం తాము వినియోగించే ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంపలను భారత్‌లో తామే రిజిస్టర్ చేయించామని పెప్సీకో పేర్కొంది. కానీ గుజరాత్‌కు చెందిన రైతులు తమ అనుమతి లేకుండా ఆ రకం ఆలూని పండించారంటూ వారిపై కేసులు నమోదు చేసింది. పెప్సీకో చర్యల పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామజిక కార్యకర్తలు, రైతులు పెప్సీకో చర్యలను తప్పుపడుతున్నారు. ఈ క్రమంలో 200 మందికి పైగా రైతు సంఘాల కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని.. సదరు కంపెనీ రైతుల మీద పెట్టిన కేసులను విత్‌డ్రా చేసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ సామజిక కార్యకర్త ఈ విషయంపై స్పందిస్తూ.."పెప్సీకో కంపెనీ సాబర్కాంఠాలో 9 మంది రైతులపై కేసులు పెట్టింది. నలుగురు రైతుల మీద కోటి రూపాయల దావా.. మరో ఐదుగురి మీద రూ. 20 లక్షల దావా వేసింది" అని చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి పెప్సీకో అధికారులు మాట్లాడుతూ.. ‘పెప్సీకో కంపెనీ సహకార వ్యవసాయ కార్యక్రమంలో వేల మంది రైతులు భాగస్వాములుగా ఉన్నారు. వారికి మాత్రమే ఈ రకం బంగాళాదుంపలను పండించేందుకు అనుమతిచ్చాం. సదరు రైతులు పండించిన పంటను కూడా మేమే కొంటా. అలాంటిది ఇప్పుడు బయటి వారు కూడా ఇదే రకం బంగాళాదుంపలను పండిస్తే.. సహకార వ్యవసాయ కార్యక్రమంలో ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుంది. వారి ప్రయోజనాలను కాపడటం కోసమే కోర్టును ఆశ్రయించాం’ అని పెప్సీకో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వివాదం అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడంతో సదరు కంపెనీ కోర్టు బయట సెటిల్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇప్పటికే నలుగురు రైతులతో సెటిల్మెంట్ కుదుర్చుకుంది. దానిలో భాగంగా ప్రస్తుతం సదరు రైతులు పండించిన పంటను కంపెనీకే అమ్మాలి.. లేదా అసలు ఈ బంగాళాదుంపలను పండిచడమే మానుకోవాలంటూ షరతులు విధించింది. పెప్సీకో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2016 ఫిబ్రవరి 1న ఎఫ్‌సీ5 రకం బంగాళాదుంప విత్తనాలను సంస్థ పేరున రిజిస్ట్రేషన్ చేసింది. దాని ప్రొటెక్షన్ పిరియడ్ జనవరి 31, 2031 వరకూ ఉన్నట్లు పెప్సీకో అధికారులు తెలిపారు. -
పెప్సీలో ‘ఇంద్రా’ శకానికి తెర!
న్యూయార్క్: భారతీయ మహిళలు వ్యాపార నిర్వహణలోనూ దిట్టలు అని నిరూపించిన మహిళ... ప్రపంచ స్థాయి కంపెనీని సైతం విజయవంతంగా భవిష్యత్తులోకి నడిపించగలరని నిరూపించిన నారీశక్తి... ప్రపంచ పారిశ్రామిక రంగంలో అసాధారణ మహిళగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయి (62) పెప్సీకో కంపెనీ నాయకత్వ బాధ్యతల్ని విడిచిపెట్టబోతున్నారు. శీతలపానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ ఇంద్రానూయి త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు. 12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె అక్టోబర్ 3న తన బాధ్యతలను కొత్త సారథికి అప్పగించనున్నారు. కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తాను నూతన సీఈవోగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఎంపిక చేసింది. ఇవి మినహా కంపెనీ యాజమాన్యంలో మరే మార్పులు లేవని కంపెనీ స్పష్టం చేసింది. పెప్సీకోతో ఇంద్రానూయికి ఉన్న 24 ఏళ్ల అనుబంధం కూడా త్వరలోనే ముగిసిపోనుంది. సీఈవోగా వైదొలిగినా, వచ్చే ఏడాది ఆరంభం వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. తాజా పరిణామంపై ఆమె స్పందిస్తూ కంపెనీకి మంచి రోజులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ‘‘భారత్‌లో పెరుగుతున్న నేను ఈ స్థాయి కంపెనీని నడిపించే అవకాశం లభిస్తుందనుకోలేదు. గడిచిన 12 సంవత్సరాల్లో వాటాదారుల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు మేం చేసిన కృషికి గర్విస్తున్నాం. ఉత్తమ కంపెనీగా మారేందుకు, ఉత్తమ కంపెనీగానూ కొనసాగేందుకు మా ప్రపంచ బృందం చేసిన అద్భుత ప్రయాణాన్ని ప్రశంసిస్తున్నాను’’అని ఇంద్రా నూయి ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘ఈ రోజు నాకు భావోద్వేగాల మిశ్రమంతో కూడినది. పెప్సీకోతో 24 ఏళ్ల ప్రయాణం. నా హృదయంలో కొంత భాగం కంపెనీతోనే ఉంటుంది. భవిష్యత్తు కోసం మేం చేసిన దాని పట్ల గర్విస్తున్నాం. పెప్సీకోకు మంచి రోజులు రావాల్సి ఉంది. పర్యావరణ వినియోగాన్ని పరిమితం చేస్తూనే ప్రజల జీవితాలపై అర్థవంతమైన ప్రభావం చూపించాం. ఉజ్వలమైన భవిష్యత్తుకు వృద్ధిని కొనసాగించే బలమైన స్థితిలో పెప్సీకో ఉంది’’ అని నూయి పేర్కొన్నారు. మార్పు దిశగా నడిపించారు... రామన్ లగుర్తా సైతం పెప్సీకో సీనియర్ ఉద్యోగుల్లో ఒకరు. 22 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ కాలంలో ఎన్నో నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి కంపెనీ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు, కార్పొరేట్ విధానాలు, పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రానూయి నాయకత్వాన్ని ఈ సందర్భంగా రామన్ ప్రశంసించారు. తన సాహసోపేతమైన దృష్టి, అసాధారణ నాయకత్వంతో కంపెనీని మార్చివేశారని పేర్కొన్నారు. వాటాదారులకు లాభాలు... ఇంద్రా సారథ్యంలో పెప్సీకో మంచి ఫలితాలను సాధించింది. 2006 నుంచి 2017 నాటికి వాటాదారులకు 162% ప్రతిఫలం లభించింది. వాటాదారులకు డివిడెండ్లు, షేర్ల తిరిగి కొనుగోలు ద్వారా 2006 ప్రారంభం నుంచి 2017 చివరి నాటికి 79.4 బిలియన్ డాలర్ల (రూ.5.39 లక్షల కోట్లు) లాభాలను పంచారు. 2006లో 35 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆదాయాన్ని 2017 నాటికి 63.5 బిలియన్ డాలర్లకు చేర్చారు. గత 12ఏళ్లలో అసాధారణ నాయకత్వాన్ని అందించారని కంపెనీ డైరెక్టర్ల బోర్డు తరఫున ప్రిసైడింగ్ డైరెక్టర్ ఇయాన్‌కుక్ పేర్కొన్నారు. శక్తివంతమైన వ్యాపార మహిళ ఇంద్రానూయి పెప్సీకో సీఈవోగా తప్పుకోవడం వెనుక కారణం ఏంటన్నది ఇంకా స్పష్టం కాలేదు. అతిపెద్ద శీతల పానీయాల కంపెనీ సారధిగా ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందారు. ‘ప్రపంచంలో శక్తివంతమైన వ్యాపార మహిళ’ (అమెరికా వెలుపల)గా ఫార్చ్యూన్స్ జాబితా 2017లో 2వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో టాప్–100 శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా 2014లో ఫోర్బ్స్ జాబితాలో 13వ స్థానంలో నిలిచారు. అత్యధిక పారితోషికం అందుకునే మహిళా సీఈవోగానూ అగ్ర స్థానంలో ఉన్నారు. కార్పొరేట్ అమెరికా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ప్రపంచ దిగ్గజ సంస్థను నడిపించిన భారత మహిళామణుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించారు. చెన్నై నుంచి అమెరికాకు.. మద్రాస్‌లో జన్మించిన ఇంద్రా కృష్ణమూర్తి నూయి అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిధిలోని క్రిస్టియన్ కాలేజీలో 1974లో డిగ్రీ ముగించారు. ఐఐఎం, కల్కత్తా నుంచి ఎంబీఏ చేశారు. దేశీయంగానే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. 1978లో యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేరి పబ్లిక్, ప్రైవేటు మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. తర్వాత బోస్టన్ గ్రూపులో చేరారు. అనంతరం మోటరోలా, ఏసీ బ్రౌన్ బొవేరిలోనూ పనిచేశాక 1994లో పెప్సీకో ఉద్యోగిగా మారారు. 2001లో సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. 2006లో సీఈవోగా, ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. 44 ఏళ్ల పెప్సీకో కంపెనీకి ఆమె ఐదో సీఈవో. యుమ్ బ్రాండ్ పునరుద్ధరణ, ట్రోపికానా కొనుగోలు, క్వాకర్ ఓట్స్ విలీనం, గాటొరేడ్ కొనుగోలులో కీలక పాత్ర పోషించారు. -
నేడు శ్రీసిటీలో సీఎం ప్రారంభోత్సవాలు
సత్యవేడు: శ్రీసిటీ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు శుక్రవారం 12 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు, 11 నూ తన పరిశ్రమలకు భూ మిపూజ చేయనున్నా రు. పెప్సీకో కంపెనీ సీఈవో ఇంద్రనూయి, ఇతర ప్రముఖుల సమక్షంలో ముఖ్యమంత్రి తొలుత పెప్సీకో పానీయ, ఆహార వస్తు ఉత్పాదక కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వెస్టుఫార్మా పరిశ్రమను ప్రారంభించి డేనియలీ కంపె నీ వందో వార్షికోత్సవంలో పాల్గొంటారు. తరువాత బిజినెస్ సెంటర్లో ఉత్పత్తి దశకు చేరిన జెడ్‌టీటీ, నిస్సాన్, నిట్టాన్, వాల్వ్, ఎంఎం హలీ టెక్, కుసాకబే, వైటల్ సొల్యూషన్, సిద్ధార్థ లాజి స్టిక్, సీఎక్స్ ప్రిసిషన్, ఆర్చురా ఫార్మాస్యూటికల్ ను ప్రారంభిస్తారు. అనంతరం రెక్సామ్, వెర్మిరాన్, గోదావరి ఉద్యోగ్, ఆయుర్వేట్, బిరోలెక్స్, పవర్ గ్యాస్ ఎనర్జీ, బెవాసిలికోన్స్, కాస్పెఫ్ట్పాలిప్రో, పేజిల్, కేజీఐక్లాతింగ్, బ్రిండ్కో కంపెనీలకు భూమి పూజ చేస్తారు. అనంతరం మీడియా ప్రతినిధులు, స్ధానిక ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం హంటర్ డగ్లస్ పరిశ్రమను ప్రారంభిస్తారు. కొబెల్ క్రేన్స్‌కు చేరుకుని ఎగుమతి చేయనున్న తొలి క్రేన్‌కు జెండా ఊపుతారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రాష్ట్రముఖ్యమంత్రిగా తొలిసారి శ్రీసిటీకి రావడం ఆనంద దాయకమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం ఆశాజనకంగా ఉందన్నారు. నూతన పారిశ్రామిక విధానం ద్వారా పారిశ్రామిక సంస్థలు తమ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను, శ్రీసిటీని ఎంచుకుంటున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పెప్సీకో అధినేత ఇంద్రనూయి శ్రీసిటీకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అతి పెద్ద పెప్సీకో ప్లాంటును శ్రీసిటీలో నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. రాష్ట్రమంత్రులు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొంటారని ఆయన తెలిపారు. -
బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఆర్య, అఖిల్
పెప్సికో కంపెనీ దక్షిణాదిన తన మార్కెట్‌ను పటిష్టం చేసుకోవడంలో భాగంగా కూల్‌డ్రింక్ మౌంటెన్ డ్యూకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించానికి ఇద్దరు దక్షిణాది సినిమా నటులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. తమిళ హీరో ఆర్య, ప్రముఖ సినీనటుడు, నాగార్జున కుమారుడు అఖిల్‌లతో ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఈ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘రైజ్ అబౌ ఫియర్’ పేరుతో కొత్త ప్రచార కార్యక్రమాన్నీ చేపట్టింది. -
పెప్సికో ఉచిత టాక్‌టైమ్ ఆఫర్
న్యూఢిల్లీ: పెప్సికో కంపెనీ 20-20 క్రికెట్ సీజన్ సందర్భంగా ఉచిత టాక్‌టైమ్ ఆఫర్‌ను అంది స్తోంది. తమ ఆహార పానీయాలు, ఆహారోత్పత్తుల కొనుగోళ్లపై ఈ ఉచిత టాక్‌టైమ్ ఆఫర్‌ను పొందవచ్చని పెప్సికో ఇండియా వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) దీపికా వారియర్ తెలిపారు. పెప్సీ, సెవెనప్, మిరిండా ఆరెంజ్, మౌంటెన్ డ్యూ, స్లైస్‌లపై; కుర్కురే(రూ. 30 ప్యాక్), లేస్(రూ.35 ప్యాక్)లపై ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. వీటి లేబుల్ వెనక గానీ, ప్యాక్ లోపల గానీ ఒక కోడ్ ఉంటుందని, ఆ కోడ్‌ను 9818181234కు ఎస్ఎంఎస్ చేస్తే రూ.10 టాక్‌టైమ్ పొందవచ్చన్నారు. లేదా పేటైమ్డాట్కామ్లో కోడ్‌ను ఎంటర్ చేస్తే రూ.15 టాక్‌టైమ్ లభిస్తుందని తెలిపారు. ఆఫర్ ప్రి పెయిడ్(ఎస్ఎంఎస్ లేదా ఆన్లైన్ రీచార్జ్), పోస్ట్ పెయిడ్(ఆన్లైన్ రీచార్జ్ మాత్రమే) కనెక్షన్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు.