
ఆకాశాన్నంటే ఉల్లిపాయ ధరలు ప్రభుత్వాన్ని దించేయగలవు. పాతాళాన్ని తాకే బంగాళ దుంప ధరలు అధికార పార్టీలో దడ పుట్టించగలవు. ఉత్తరప్రదేశ్‌లో శ్రీకృష్ణుడు జన్మించిన మథురలో ఎన్నికల కాక ఆలూ చుట్టూ రాజుకుంది.
UP Assembly Election 2022: ఎన్నికల్లో కీలకం కావడానికి ఏవో పెద్ద పెద్ద అంశాలే ఉండనక్కర్లేదు. ఆకాశాన్నంటే ఉల్లిపాయ ధరలు ప్రభుత్వాన్ని దించేయగలవు. పాతాళాన్ని తాకే బంగాళ దుంప ధరలు అధికార పార్టీలో దడ పుట్టించగలవు. ఉత్తరప్రదేశ్‌లో శ్రీకృష్ణుడు జన్మించిన మథురలో ఎన్నికల కాక ఆలూ చుట్టూ రాజుకుంది. వీటి ధరలు రాత్రికి రాత్రి పడిపోయి రైతుల్ని కష్టాల్లోకి నెట్టేసాయి. యూపీలోని ఆగ్రా–మథుర నుంచి కాన్పూర్–ఇటావా వరకు ఆలూ ఎక్కువగా పండుతుంది. (దేశవ్యాప్తంగా పండే ఆలూలో 30% ఇక్కడే పండిస్తారు).
హోల్‌సేల్ మార్కెట్‌లో కొన్నాళ్ల క్రితం వరకు కేజీకి రూ.8, 9 పలికే ధరలు ఇప్పుడు హఠాత్తుగా రూ.5 , 6కి పడిపోయాయి. డీజిల్, ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోవడం, కోల్డ్‌స్టోరేజీల్లో ఉంచడానికయ్యే ఖర్చులతో రైతులకు పంట వ్యయం తడిసిమోపెడవుతోంది. కేజీ ఆలూ పండించడానికి రూ.10 వరకు ఖర్చు అవుతుంటే, మార్కెట్‌లో 50 కేజీలున్న బస్తాకి రూ.200–250 ధర మాత్రమే పలుకుతోంది (అంటే కేజీకి రూ.5 కంటే తక్కువ). దీంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు.
‘‘ఇక్కడ మాకు మరే పని చెయ్యడానికి అవకాశం లేదు. ప్రభుత్వం ఎలాంటి ఉపాధి సదుపాయాలు కల్పించలేదు.పరిశ్రమలేవీ రాలేదు. బంగాళ దుంపల ధరలు పడిపోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే ఈసారి మా ఓటు సమాజ్‌వాదీ పార్టీకే’’ అని మహమ్మద్ అన్వర్ అనే రైతు కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారు. మథుర పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అయిదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి కూడా రైతాంగ సమస్యలు పట్టించుకోని కమలనాథులు మథురలో శ్రీకృష్ణుడికి ఆలయం కట్టిస్తామంటూ హిందుత్వ ఎజెండానే అందుకొని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
– నేషనల్ డెస్క్, సాక్షి